ఉపకార ‘యాతనం’ | Sakshi
Sakshi News home page

ఉపకార ‘యాతనం’

Published Wed, Sep 7 2016 12:28 AM

upkara " yatanam'

 ఏలూరు సిటీ/ఆకివీడు : విద్యార్థులకు ఉపకార వేతనాల మం జూరులో అడుగడుగునా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అటు ప్రభుత్వం దయచూపక.. ఇటు అధికారులు పట్టించుకోక.. మరోవైపు ఆన్‌లైన్‌ సహకరించకపోవడంతో కళాశాల, హైస్కూల్‌ స్థాయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించే విషయంలో సమస్యలు తలెత్తుతుండటంతో వేలాది మంది ఉపకార వేతనాలు అందుకోలేకపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు పూర్తయినా నేటికీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాలేదు. దరఖాస్తులను స్వీకరించి, కళాశాల స్థాయిలో పరిశీ లించి ఎంపిక చేసిన అనంతరం విద్యార్థుల ఖాతాల్లోకి ఉపకార వేతనాలు జమ కావాల్సి ఉంది. ఇదంతా పూర్తయ్యేసరికి పుణ్యకాలం కాస్తా ముగిసేలా ఉంది. 
సమస్యలెన్నో..
తెలంగాణ జిల్లాల్లో చదువుకున్న ఇక్కడి విద్యార్థులు రాష్ట్ర విభజన అనంతరం తిరిగి సొంత ప్రాంతాలకు వచ్చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విద్యార్థులు ఉపకార వేతనాలు అందుకోలేని పరిస్థితి నెలకొంది. ధ్రువీకరణ పత్రాల విషయంలో వారికి చుక్కెదురవుతోంది. అదేవిధంగా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని విద్యార్థులు కూడా ఉపకార వేతనాలు పొందే విషయంలో అన్యాయానికి గురవుతున్నారు. స్థానికత అంశంపై రెండు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేయటంతో ఆ రెండు మండలాల వారు దారుణంగా నష్టపోతున్నారు. మరోవైపు రేషన్, ఆధార్‌ కార్డు సమస్యలు వేధిస్తున్నాయి. దరఖాస్తు చేసిన విద్యార్థుల రేషన్‌కార్డుల్లోని సమాచారం అన్‌లైన్‌లో లేకపోవటం, విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లను సరిచేయకపోవడం వంటి ఇబ్బందులు వెంటాడుతున్నాయి. తల్లి/తండ్రి చనిపోయిన విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు. వీటితోపాటు విద్యార్థుల వేలిముద్రలు సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్‌ కాకపోవటం వంటివి వెంటాడుతున్నాయి.
ని««దlుల మంజూరులోనూ జాప్యం
సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కళాశాల స్థాయిలో డే స్కాలర్‌కు నెలకు రూ.325, కళాశాల హాస్టల్‌లోని డిగ్రీ విద్యార్థులకు రూ.550, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రూ.1,100, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు రూ.1,050 చొప్పున అందించాల్సి ఉంది. 2016–17 విద్యా సంవత్సరంలో రెన్యువల్‌ విద్యార్థులు 15,076 మంది ఉంటే వారిలో ఇప్పటివరకు 12,595 మంది మాత్రమే స్కాలర్‌ షిప్పుల కోసం దరఖాస్తు చేసుకోగలిగారు. కొత్తగా కళాశాలల్లో చేరిన విద్యార్థులు (ఫ్రెషర్స్‌) 12,801 మంది ఉండగా, ఇప్పటివరకు కేవలం 3,766 మంది దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో ఓకే అయ్యాయి. మిగతా విద్యార్థులంతా రేషన్‌కార్డు, ఆధార్‌ తదితర సమస్యలతో దరఖాస్తుల దశలోనే కష్టాలు పడుతున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఉపకార వేతన నిధులు ప్రథమ క్వార్టర్‌గా రూ.3.36 కోట్లు విడుదలయ్యాయని అధికారులు చెబుతున్నారు. 
హైస్కూల్‌ స్థాయిలోనూ అంతంతే
హైస్కూల్‌ విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్‌షిప్పుల విషయంలోనూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లాలోని పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన 68 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారందరికీ నేరుగా ఉపకార వేతనాలు చెల్లిస్తామనడంతో ప్రధానోపాధ్యాయులు వారితో బ్యాంక్‌ అకౌంట్లు తెరిపించారు. ఒక్కొక్క విద్యార్థి రూ. 60 నుంచి రూ.70 వరకూ వెచ్చించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.200 చొప్పున జమ చేశారు. ప్రభుత్వం అడిగిన అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. అయితే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన చాలామంది విద్యార్థుల అకౌంట్లలో నేటికీ ఉపకార వేతనం సొమ్ము జమ కాలేదు. ప్రతి పాఠశాలలో కనీసం 20 నుంచి 40 శాతం మందికి మంజూరు కాలేదు. అధికారులు మాత్రం 90 శాతానికి పైగా విద్యార్థులకు ఉపకార వేతనాలను వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశామని చెబుతున్నారు.
కాపు, బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకారమేదీ!
కాపు, బ్రాహ్మణ విద్యార్థులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉపకార వేతనాలు అందిస్తున్నట్టు ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటిస్తున్నా వారెవరికీ పైసా కూడా అందలేదు. ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల నుంచి ఇంతవరకు దరఖాస్తులే స్వీకరించలేదు. కనీసం ఆన్‌లైన్‌ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. 
64 వేల మంది విద్యార్థులకు బ్యాంక్‌ ఖాతాల్లో జమ
జిల్లాలో గత ఏడాది 68 వేల మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థుల్లో 64 వేల మంది ఖాతాలకు రూ.68 కోట్లు జమ చేశాం. ప్రాథమిక స్థాయి విద్యార్థులు 7 వేల మందికి రూ.7.14 లక్షలు అందించాం. 4 వేల మందికి వివిధ కారణాల రీత్యా బ్యాంక్‌ ఖాతాల్లో ఉపకార వేతనాలు జమ కాలేదు. త్వరలోనే వీరి ఖాతాలకు జమ చేస్తాం. ఈ ఏడాది ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. పాత విద్యార్థులు రెన్యువల్‌ చేయించుకోవాలి. ఫ్రెషర్స్‌కు ఈనెల 30వ తేదీ వరకు, రెన్యువల్‌ విద్యార్థులకు ఈనెల 15 వరకు గడువు ఉంది. నిధుల మంజూరులో కొంత జాప్యం జరుగుతోంది. రేషన్‌కార్డు, ఆధార్, స్థానికత సమస్యలు ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించాలి. – టి.లక్ష్మీప్రసాద్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, ఏలూరు
 
 
 

Advertisement
Advertisement