టెండరింగ్‌ | Sakshi
Sakshi News home page

టెండరింగ్‌

Published Thu, Feb 16 2017 11:39 PM

టెండరింగ్‌

వాడపల్లి ఆలయంలో చక్రం తిప్పుతున్న నేతలు
ఆదాయానికి గండికొడుతున్న వైనం
వాడపల్లి(ఆత్రేయపురం): కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నలుగురు గ్రామ పెద్దలు తిష్టవేశారని పలువురు వెంకన్న భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు పాలక వర్గం ఏర్పాటు చేయకపోవడంతో గ్రామానికి చెందిన నలుగురు పచ్చచొక్కా నేతలు ఆలయంలో తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు పలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఆలయ అభివృద్ధి పనులకు జరిగిన టెండర్లలో నలుగురు నాయకులు చక్రం తిప్పి పనులు టెండరింగ్‌ అయ్యేలా ప్రయత్నాలు చేయడంతో పాటు తమ అనుచరులకే పనులు దక్కించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు ఆలయ సిబ్బంది కూడా  వారికి తమ వంతు సాయం అందించి స్వామి భక్తిని చాటుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో రూ.32.20 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు టెండర్లలో రింగ్‌ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ సిబ్బంది పరోక్ష సహకారంతోనే ఆలయంలో తిష్టవేసిన కొందరు కాంట్రాక్టర్లకు అధికారుల సమక్షంలోనే ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున గుడ్‌విల్‌ రూపంలో అందించి దేవుడికి శఠగోపం పెట్టారనే విమర్శలు ఉన్నాయి. పోటీకీ వచ్చిన టెండరుదార్లను ప్రలోభాలకు గురిచేయడంతో రూ 32.20 లక్షల విలువైన పనులు 0.01 తక్కువ మొత్తానికి (రూ.32 తగ్గించి) టెండర్లు ఖరారైనట్టు ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ప్రకటించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వెంకన్న ఆలయంలో అన్నదాన సత్రానికి ప్రహరీ, ఫిల్లింగ్, సీసీ ఫ్లోరింగ్, పీఈబీ నిర్మాణం, గాల్వనైజ్‌డ్‌ మెస్‌కు దేవాదాయ శాఖ రూ.32.20లక్ష లు మంజూరు చేయడంతో పనులు చేపట్టేందుకు ఈ నెల 9న టెండర్లు పిలిచారు. ఆ పనులకు సంబంధించి టెండరుదార్లను ఆహ్వానించేందుకు మొక్కుబడిగా ప్రకటనలు చేసి ఆలయ పరిపాలన సిబ్బంది, ఇంజనీరింగ్‌ సిబ్బంది గోప్యం పాటించారనే విమర్శలు ఉన్నాయి.  స్థానిక పత్రికల్లో టెండర్‌ నోటీస్‌ ప్రకటనలు రాకపోవడం ఆ విమర్శలకు బలం చేకూర్చుతుంది. దీంతో రూ.32.20 లక్షలు పనులకు నాలుగు టెండర్లు మాత్రమే రాగా అందులో రెండు బినామీ అని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఆలయంలో సుమారు రూ.కోటితో పనులు చేపట్టిన కొందరు టెండర్లు వేసేందుకు వచ్చిన వారిని స్థానికత పేరుతో బెదిరించి పను లు దక్కించుకున్నారని భక్తులు వాపోతున్నారు. టెండర్ల గురించి మరింత ప్రచారం చేసి ఉంటే 5 శాతం తక్కువకు ఖరారై దేవాదాయ శాఖకు రూ.1.50 లక్షల వరకు ఆదాయం సమకూరి ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వాడపల్లి ఆలయ పనుల్లో జరిగిన టెండరు అవకతవకలపై దృష్టిసారించి తిరిగి టెండర్లు నిర్వహించాలని వెంకన్న భక్తులు
కోరుతున్నారు. 
 

Advertisement
Advertisement