వెంకన్న ఆలయంలో దొంగలు పడ్డారు | Sakshi
Sakshi News home page

వెంకన్న ఆలయంలో దొంగలు పడ్డారు

Published Sun, Feb 26 2017 11:36 PM

వెంకన్న ఆలయంలో దొంగలు పడ్డారు - Sakshi

  • వాడపల్లి ఆలయంలో అడుగడుగునా అక్రమాలు
  • దేవుడి సొమ్మును దోచుకుంటున్న స్వార్థపరులు
  • అర్చకుల ఆదాయంలో వసూళ్లు  ∙ఇష్టారాజ్యంగా ‘తమ్ముళ్ల’ ప్రైవేటు పార్కింగ్‌ 
  • అయినా కిమ్మనని అధికారులు ∙కొరవడుతున్న అజమాయిషీ
  •  
    కోనసీమ తిరుపతిగా పిలిచే వాడపల్లి వెంకన్న ఆలయంలో దొంగలు పడ్డారు. గుడినే కాదు గుడిలో దేవుడిని కూడా దోచుకుంటున్నారు. ఇటీవల కొన్నేళ్లుగా ఈ ఆలయానికి భక్తుల తాకిడి గణనీయం గా పెరిగింది. మన జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆదాయం కూడా దండిగానే వస్తోంది. దీనిపై అక్రమార్కుల కన్ను పడింది. దొరికిందే అవకాశంగా అందినంతా దోచుకుంటున్నారు.
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ : 
    గోదావరి తీరాన ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయంభువుగా శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరాడు. గోదావరి ఇసుక తిన్నెల్లో కొయ్య విగ్రహం దొరకడంతో నారద మహర్షి వాడపల్లిలో ఆ విగ్రహాన్ని ప్రతిషి్ఠంచినట్టు  చెబుతారు. పిఠాపురం మహారాజుల కాలంలో తిమ్మగజపతి అనే రాజు వెంకన్న ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, నిర్వహణ కోసం 265 ఎకరాలు ఇచ్చారు. ఎ–గ్రేడ్‌ హోదా కలిగిన ఈ ఆలయానికి రెగ్యులర్‌ కార్యనిర్వహణాధికారి లేరు. కొత్తపేట మండలం వానపల్లి పల్లాలమ్మ ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణమూర్తే వాడపల్లి వెంకన్న ఆలయానికి ఇ¯ŒSచార్జిగా వ్యవహరిస్తున్నారు. రెండుచోట్లా బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో ఆలయ నిర్వహణపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయలేని పరిస్థితి. ఇదే అవకాశంగా కొంతమంది అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
    పెరిగిన హుండీల ఆదాయం
    వెంకన్న ఆలయం బాగా ప్రాచుర్యం పొందడంతో 2010 నుంచి భక్తుల తాకిడి బాగా పెరిగింది. వెంకన్న ఆలయంలో ఏడు వారాల పాటు ఏడు ప్రదక్షిణల వంతున చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాçÜం. ఆ నమ్మకంతోనే ప్రతి శని, ఆదివారాల్లో 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు తరలి వస్తున్నారు. మన జిల్లాతోపాటు పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఫలితంగా హుండీ ఆదాయం కూడా మునుపెన్నడూ లేని రీతిలో రెట్టింపైంది. ఆదాయం పెరిగిన నేపథ్యంలో ప్రతి నెలా లేదా 45 రోజులకు ఒకసారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. ఈ ఆదాయాన్ని అదే మండలం లొల్లలోని సిండికేట్‌ బ్యాంక్‌ బ్రాంచిలో జమ చేస్తున్నారు. ప్రతిసారీ హుండీ ఆదాయం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వస్తోంది.
    సంభావనల్లోనూ కక్కుర్తే
    పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగానే అర్చకులకు పళ్లెంలో వచ్చే సంభావనలు కూడా పెరిగాయి. ఆలయంపై అనధికారికంగా పెత్తనం చెలాయిస్తున్న నలుగురి కళ్లు వీటిమీద పడ్డాయి. ఆలయ నిర్వాహకులు కొందరు కూడా వారితో చేయి కలిపారు. దీంతో అర్చకుల సంభావన మొత్తంలో ప్రతి నెలా ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున ముక్కు పిండి మరీ వసూలు చేసుకుపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈవిధంగా ప్రతి నెలా రూ.35 వేల మేర ఆలయ నిర్వాహకులు, నలుగురు పెత్తందార్లు జేబులో వేసుకుంటున్నారని సమాచారం. రెండేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా ప్రశ్నించే నాథుడే లేడు. అర్చకులకు పళ్లెంలో సంభావనను చాలా ఆలయాల్లో అధికారికంగానే నియంత్రించారు. కానీ దీనిని భక్తులు ఐచ్ఛికంగానే సమర్పిస్తూండడంతో చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. దీనినే అక్రమార్కులకు అవకాశంగా మలుచుకున్నారు.
    ప్రైవేటు సెక్యూరిటీ దేనికో..!
    భక్తుల రద్ధీ పెరిగిన నేపథ్యంలో రావులపాలెం సీఐ పర్యవేక్షణలో రావులపాలెం, ఆత్రేయపురం స్టేషన్లకు చెందిన పోలీసులు ప్రతి శనివారం బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ భక్తుల నియంత్రణ కోసమంటూ రాజమహేంద్రవరం నుంచి డజను మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని తీసుకువస్తున్నారు. పోలీసులు ఉండగా, ప్రైవేటు సెక్యూరిటీ దేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు. నెలలో వారు పని చేసేది నాలుగు రోజులు మాత్రమే. కానీ ఆ రూపేణా సుమారు రూ.60 వేలు వృథాగా వెచ్చిస్తున్నారు. గతంలో హుండీల లెక్కింపులో స్థానికంగా వెంకన్న సేవకులే ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు మొక్కుబడిగా కొందరిని మాత్రమే అనుమతిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
    దర్జాగా ప్రైవేటు పార్కింగ్‌
    వేలాదిగా భక్తులు వస్తున్న ఆలయంలో పార్కింగ్‌ సౌకర్యమే లేదు. ఇదే అదునుగా అధికార పార్టీలో స్థానిక సంస్థలకు చెందిన ఒక మాజీ ప్రతినిధి, ఆలయ కమిటీలో ఉన్న ముగ్గురు మాజీలు కలిసి సొంత స్థలాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేసి, భక్తుల నుంచి సొమ్ములు గుంజుతున్నారు. పార్కింగ్‌ రూపంలో వారానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. కార్లకు రూ.30, సైకిల్‌కు రూ.5, మోటార్‌ సైకిల్‌కు రూ.10 వసూలు చేస్తున్నారు. ఆ మేరకు వెంకన్న ఆలయానికి రావాల్సిన ఆదాయం పెత్తందార్ల చేతిల్లోకి పోతోంది. తెలుగు తమ్ముళ్ల స్థలాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ను దాటి భక్తుల వాహనాలను అనుమతించడం లేదు. అంటే పరోక్షంగా పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్న విషయం స్పష్టమవుతోంది. పార్కింగ్‌ పేరుతో భక్తుల నుంచి అడ్డగోలుగా దోపిడీ చేయడంపై కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గతంలో రెండుమార్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారిలో స్పందన లేదు. ప్రైవేటు వ్యక్తులు ఇంత అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని భక్తులు ఆవేదన చెందుతున్నారు.
    పార్కింగ్‌ ఏర్పాటు చేస్తాం
    ఆలయానికి పార్కింగ్‌ లేకపోవడం వాస్తవమే. ఆలయానికి చెందిన సుమారు నాలుగు ఎకరాలను పార్కింగ్‌ కోసం కేటాయించనున్నాం. ఇ¯ŒSచార్జిగా బాధ్యతలు తీసుకున్నాక భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచాను. ఇందులో భాగంగానే ఆ స్థలాన్ని చదును చేసి పార్కింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం. సంభావన నుంచి కమీషన్లు వసూలు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. పెరిగిన భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా పెరిగింది. హుండీ లెక్కింపు నిబంధనల ప్రకారమే జరుగుతోంది. హుండీ లెక్కింపులో స్థానికులకు కూడా అవకాశం కల్పిస్తున్నాం. హుండీ లెక్కింపునకు బయటనుంచి ఎవ్వరినీ తీసుకురావడం లేదు. పెరిగిన భక్తుల సంఖ్యకు తగ్గట్టు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నాం.
    – బీహెచ్‌వీ రమణమూర్తి, ఆలయ ఇ¯ŒSచార్జి ఈఓ, వాడపల్లి
     

Advertisement

తప్పక చదవండి

Advertisement