వేదమాత సేవలో 80 వసంతాలు | Sakshi
Sakshi News home page

వేదమాత సేవలో 80 వసంతాలు

Published Sun, Aug 21 2016 9:09 PM

వేదమాత సేవలో 80 వసంతాలు

  • ఏటా పరీక్షలు నిర్వహిస్తున్న వేదశాస్త్రపరిషత్‌ ఇచ్చే పట్టాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు
  • మంచికొలువుల్లో స్థిరపడుతున్న విద్యార్థులు
  • రాజమహేంద్రవరం కల్చరల్‌ :
    వేదశాస్త్ర పరిరక్షణకు, వేదాధ్యయనం పట్ల విద్యార్థులను ప్రోత్సహించడానికి, వేదపండితులను ఏటా సత్కరించే లక్ష్యంతో హోతా వీరభద్రయ్య జమీందారు 1937లో రాజమహేంద్రవరంలో వేదశాస్త్ర పరిషత్‌నుప్రారంభించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు చంద్రశేఖరేంద్రసరస్వతీ మహాస్వాముల ఆశీస్సులతో ప్రారంభమైన పరిషత్‌ నేటివరకూ ఏటా వేదపరీక్షలు నిర్వహించి పట్టాలను అందించడం, వేదపండితులను సత్కరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక్కడ పట్టాలు తీసుకున్న వారు తిరుపతి వేద విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో కొలువులు సంపాదించి మంచిజీతాలు అందుకుంటున్నారు. పరిషత్‌ ఇచ్చే పట్టాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఏటా శ్రావణమాసంలో పరిషత్‌ నిర్వహించే వేదశాస్త్ర పరీక్షలకు వివిధ రాష్ట్రాలనుంచి విద్యార్థులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇన్నీసుపేట, హోతావారి వీధిలో పరిషత్‌ కార్యాలయం ఉంది. ఈనెల 20న ప్రారంభమైన పరిషత్‌ 80వ వార్షికోత్సవాలు 24 వరకూ జరగనున్నాయి. 25న పట్టాల ప్రదానం జరుగుతుంది. 
    ఈ విభాగాల్లో పరీక్షలు : ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలో పరీక్షలు జరుగుతాయి. జాతీయస్థాయిలో పేరెన్నికగన్న వేదపండితులు, ఘనపాఠీలు పరీక్షాధికారులుగా పాల్గొంటారు. వేదవిద్య అంతా మౌఖికమే కనుక పరీక్షలు మౌఖికంగానే జరుగుతాయి. తర్కం, వ్యాకరణం , పూర్వ, ఉత్తర మీమాంసలు, వేదభాష్యాలలో కూడా పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. స్మార్తం, పురాణాలలో కూడా పరీక్షలు నిర్వహిస్తారు. ఉత్తీర్ణులయినవారికి పట్టాలతోపాటు నగదు పురస్కారాలను అందచేస్తున్నారు. వేదపండితులకు, పరీక్షాధికారులకు నగదు పురస్కారాలను అందచేస్తున్నారు. ప్రభుత్వపరంగా ఎటువంటి సాయం లేకపోయినా వేదశాస్త్రాభిమానులు అందించే విరాళాలు, సొంతనిధులతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
     

Advertisement
Advertisement