అంధకారంలో వెలుగు పథకాలు | Sakshi
Sakshi News home page

అంధకారంలో వెలుగు పథకాలు

Published Sun, Aug 14 2016 12:32 AM

మా ఇంటి మహాలక్ష్మికి నోచుకోని గిరిజన బాలిక

  • మూతపడిన న్యూట్రిషన్, బాలబడి కేంద్రాలు
  • ఆదుకోని మార్కెటింగ్‌ 
  • అందని మా ఇంటి మహాలక్ష్మి
  •  
    సీతంపేట: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు పథకాలను ఒక్కొక్కటి తుంగలోకి తొక్కేసింది. వెలుగు అంథకారంలోకి వెళ్లిపోతుంది. గిరిజనోద్దరణకు ఏర్పాటు చేసిన టీపీఎంయూ (ట్రైబల్‌ ప్రాజెక్టు మానటరింగ్‌ యూనిట్‌) అటు సిబ్బంది లేక ఇటు పథకాలకు నోచుకోక అంథకారంలోకి వెళ్లిపోయింది. ఐటీడీఏ పరిధిలో సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మందస, మెళియాపుట్టి మండలాల్లోని గిరిజనులను ఉద్దరించడానికి ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెలుగు పథకాలు మూలన పడుతున్నాయి. ఒక్కో పథకానికి మంగళం పాడేయడం పరిపాటిగా మారిపోయింది. మొన్న న్యూట్రిషిన్‌ కేంద్రాలు మూతపడ్డాయి. నిన్న బాలబడులు కూడా మూసివేశారు. దీంతో గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు, బాలింతలు, గర్బిణులకు పోషకాహారం ఎండమావిగా మారింది. అలాగే  చిన్నారులకు ఆటపాటల ద్వారా అందించే బాలబడులు విద్యాకార్యక్రమాలు మూలనపడినట్టయింది. 
     
    మాఇంటి మహాలక్ష్మికి గ్రహణం
     
    మాఇంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు ప్రయోజనం చేకూరే విధంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రస్తుత ప్రభుత్వం నిలుపు చేసింది. ఈ పథకాన్ని వెలుగు నుంచి ఐసీడీఎస్‌కు బదిలీ చేసినా అక్కడ కూడా చిరునామా కరువైంది. ఏడు మండలాల్లో 2,400 మంది గిరిజన బాలికల పేర్లు  అప్పట్లో నమోదయ్యాయి. వాటిలో తొలివిడతగా 1,190 మందికి మాత్రమే నగదు బ్యాంకు ఖాతాలో వేశారు. ఐటీడీఏ పరిధిలో మరో 1,210 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. రెండేళ్లుగా వీటిపై స్పందన లేదు. ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో ఈ పథకం కొనసాగుతుందా లేదాననే ఆందోళన వ్యక్తమవుతుంది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తి చేసేవరకు ఏటా కొంతమెుత్తాన్ని చెల్లిస్తారు. బిడ్డ పుట్టిన వెంటనే టీకాల నిమిత్తం వెయ్యి రూపాయలు, మరో రూ.2,500 ఒకటి, రెండు సంవత్సరాల్లో ఏడాదికి వెయ్యి, 3, 4, 5 ఏళ్లలో సంవత్సరానికి రూ.1,500లు ఇస్తారు. అయిదేళ్ల తర్వాత పాఠశాలకు బాలికను పంపింతే ఏడాదికి రూ.2 వేలు అందజేస్తారు. 6 నుంచి 8వ తరగతి వరకు రూ.2,500లు, 9, 10 తరగతుల్లో ఏడాదికి రూ.3 వేలు చెల్లించనున్నారు. ఇంటర్‌ వరకు చదివితే నెలకు రూ.3,500లు, ఇంటర్‌ పూర్తిచేస్తే రూ.50వేలు, డిగ్రీ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు అందించాలి. ఈ పథకం కానరాకుండా పోయింది.
     
    అంతంత మాత్రంగానే మార్కెటింగ్‌
     
    గిరిజనుల ద్వారా మార్కెటింగ్‌ కేంద్రాలను నడిపి వారికి అన్ని విదాలా చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్ధేశంతో పసుపు, చింతపండు, జీడి ప్రొసెసింగ్‌ కేంద్రాలు గతంలో అయిదు చోట్ల ఏర్పాటు చేశారు. ఇందుకు ట్రైకార్‌ పథకం ద్వారా రూ.8.80 లక్షలు వెచ్చించారు. అయితే వెలుగు ద్వారా సరైన ప్రోత్సాహం లేకపోవడంతో గిరిజన  మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యం లేక మూత పడ్డాయి. ఐటీడీఏ ప్రాంగణంలో జీడి, పసుపు, చింతపండు కేంద్రాల కోసం నూతనంగా భవనాలు రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ కేంద్రాలు తెరవడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నా చింతపండు, పసుపు వంటివాటికి సీజన్‌ కాకపోవడంతో అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. 
     
    జీవనోపాధి కార్యక్రమాలు చేపడుతున్నాం
     
    జీవనోపాధి కార్యక్రమాలు చేపడుతున్నాం. మార్కెటింగ్‌ కేంద్రాలు కూడా నడపడానికి చర్యలు తీసుకుంటున్నాం. కొండచీపుర్లు, పినాయిల్‌ తయారీ జరుగుతుంది. ప్రస్తుతానికి బాలబడి, న్యూట్రిషియన్‌ కేంద్రాలను మూసివేయడం జరిగింది. 
    – కె.సావిత్రి, ఏపీడీ, వెలుగు. 
     
    వెలుగు పథకాలన్నీ నిర్వీర్యమే
     
    వెలుగు పథకాలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పథకాలన్నీ మూతపడ్డాయి. మహిళా సంఘాలకు వెలుగు పథకాలు ఏవీ అక్కరకు రావడం లేదు. ఉన్నవాటిని మూసివేయడం తగదు. 
    – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెలే, పాలకొండ.

Advertisement
Advertisement