వేంకటేశ నిను సేవింపగను.. | Sakshi
Sakshi News home page

వేంకటేశ నిను సేవింపగను..

Published Thu, Aug 4 2016 12:18 AM

త్యాగరాజ కృతులను ఆలపిస్తున్న రతిప్రియ

ఘనంగా ముగిసిన త్యాగరాజ సంగీతోత్సవాలు
చివరి రోజు అలరించిన రతిప్రియ గాత్రకచేరి
 వేంకటేశ నిను సేవింపగను పదివేల కనులు గావలనయ్య..
 నాద లోలుడై బ్రహ్మానందవే మనసా..
తెరతీయగా రాదా..నాలోని తెరతీయగ రావా..
 తిరుపతి వెంకటరమణ తెరతీయగ రాదా అంటూ
  సంగీత విద్మన్మణి త్యాగరాజస్వామి సంకీర్తనలతో  భక్తి ప్రవాహంలో ముంచెత్తిన సంగీత్సోవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. త్యాగరాజస్వామి భక్తి సంకీర్తనలపై చర్చావేదిక, సమావేశాలు, సదస్సుల ద్వారా  భక్తి సంగీత విశిష్టతను చాటారు.  ప్రముఖ సంగీత విద్వాంసులను సప్తగిరి సంగీత విద్వన్మణి అవార్డులతో ఘనంగా సత్కరించారు.

 తిరుపతి కల్చరల్‌:  త్యాగరాజస్వామి 250 జయంతి మహోత్సవాల్లో భాగంగా త్యాగరాజస్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత నెల 24 నుంచి  ప్రారంభమైన సంగీతోత్సవాలు  బుధవారంతో ఘనంగా ముగిశాయి. నగరంలోని త్యాగరాజ మండపంలో 11 రోజుల పాటు  సాగిన ఈ ఉత్సవాల్లో  వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ సంగీత విద్యాంసులు పాల్గొని త్యాగరాజస్వామి సంకీర్తనలను ఆలపించారు.   త్యాగరాజ భక్తి సంకీర్తనలపై చర్చావేదిక,  త్యాగరాజ దిన చర్య, త్యాగరాజ శిష్య పరంపర సంకీర్తనల  వ్యాప్తి వంటి  సమావేశాలు, సదస్సుల ద్వారా త్యాగరాజ భక్తి సంగీత విశిష్టతను చాటారు.  శాస్త్రీయ సంగీతం విస్తృతికి నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ సంగీత విద్యాంసులకు  త్యాగరాజ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సప్తగిరి సంగీత విద్వన్మణి అవార్డులతో ఘనంగా సత్కరించారు. చివరిరోజు చెన్నైకి చెందిన  రతిప్రియ  గాత్ర కచ్చేరి  శ్రోతులను భక్తి ప్రవహంలో ఓలలాడించింది. కేదారరాగంలో  రామా నీపై తనకు ప్రేమ...,  కానడ రాగంలో శ్రీనారద నాద సర నీరూపం..,  మాళవి రాగంలో  నెనరుంచినాను అన్నిటికీ.. వంటి త్యాగరాజ కృతులను సుమధురంగా గానం చేసి  ప్రేక్షకులను మైమరిపించారు.  వీరికి వయోలిన్‌పై ఆర్‌. రాహుల్, మృదంగంపై  కుంభకోణం స్వామినాథన్‌ చక్కటి సహకారం అందించారు. ఇదే వేదికపై  త్యాగరాజ ట్రస్ట్‌ మాజీ చైర్మన్‌ మాడభూషి కృష్ణస్వామి 90వ జయంతిని ఘనంగా నిర్వహించారు.  ఉత్సవ కమిటీ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించింది. తర్వాత  త్యాగరాజ జీవిత చరిత్రపై  నేమాని నాగలక్ష్మి  గానం చేసి హరికథ శ్రోతులను ఆకట్టుకుంది.  త్యాగయ్య యోగ వైభవం, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను  వివరించారు.  వీరికి వయోలిన్‌పై  రామగోపాల్, మృదంగంపై  పి.మధు  సహకరించారు.  ఈ కార్యక్రమానికి  సుధాకర్‌ చక్కటి వ్యాఖ్యానం చేశారు. చివరిగా  ఆంజనేయ ఉత్సవం ఘనంగా నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో  త్యాగరాజ ఉత్సవ కమిటీ నిర్వాహకులు వేణుగోపాల్‌రెడ్డి, దొరైరాజ్, సుందరరామిరెడ్డి, కత్తుల సుధాకర్‌ పాల్గొన్నారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement