నేనున్నాననీ.! | Sakshi
Sakshi News home page

నేనున్నాననీ.!

Published Wed, Nov 9 2016 11:30 PM

నేనున్నాననీ.! - Sakshi

అనంతపురం మెడికల్‌ : చంటి పిల్లాడి కోసం పాలు తెద్దామని బయటికొస్తే 'చిల్లర' కష్టమొచ్చింది. ఆస్పత్రిలో దొరకని మందులు బయట మెడికల్‌ షాప్‌లో కొందామని వెళితే అక్కడా అదే పరిస్థితి. ఏం చేయాలో తోచలేదు. ఎవర్ని అడిగినా 'చిల్లర'లేదన్నారు. రూ.500, రూ.1000  నోట్లు చెల్లవన్నారు. అంతలో 'నేనున్నా'నంటూ ఓ మనిషి ముందుకొచ్చారు. రోగుల బంధువుల 'నోట్ల' కష్టాలు తీర్చాడు. వివరాల్లోకి వెళితే.. గోరంట్ల మండలం బూదిలికి చెందిన నర్సమ్మ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం సర్వజనాస్పత్రిలో చేరారు. ఆమెను చూసేందుకు అదే గ్రామానికి చెందిన, వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం నేత బూదిలి వేణుగోపాల్‌రెడ్డి బుధవారం ఉదయం 10 గంటలకు ఆస్పత్రికి వచ్చారు.

వార్డులో ఆమెను పలుకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఓ మహిళ వచ్చి రూ.500కు చిల్లర అడిగింది. జేబులోంచి రూ.100 నోట్లు తీసి లెక్కిస్తుండగానే మరికొంత మంది పోగయ్యారు. అసలు విషయం అర్థం చేసుకున్న ఆయన  వెంటనే తన స్నేహితులకు ఫోన్‌ చేసి రూ.100 నోట్లు సమకూర్చాలని కోరారు. జేబులో ఉన్న రూ.100 నోట్లను కొంత మందికి ఇచ్చి కొద్దిసేపట్లో వస్తానని కారులో బయటకు వెళ్లి, అర గంట తర్వాత రూ.100 నోట్ల (రూ.60వేలు)తో ఆస్పత్రి ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న వారితో రూ.500 నోట్లు తీసుకుని రూ.100 నోట్లు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది అక్కడికి భారీగా చేరుకున్నారు. గంటకే నోట్ల పంపిణీ అయిపోయినా ఇంకా చాలా మంది మిగిలిపోయారు. దీంతో మరో గంట తర్వాత వస్తానని వెళ్లి రూ.50 వేలు తీసుకుని వచ్చి అందరికీ ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా ఓ వ్యక్తి వచ్చి తమ కష్టాలు తీర్చడం పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేశారు.  

ఎక్కడికెళ్లినా చిల్లర ఇవ్వలేదు
నా భార్య అంజలి డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చా. పది రోజులైంది. ఉదయాన్నే టిఫిన్‌ తెద్దామని బయటకు వెళితే రూ.500కు చిల్లర లేదన్నారు. ఎవరిని అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ రూ.100 నోట్లు ఇస్తుంటే వచ్చాను.
 - శివశంకర్, మడకశిర

చీటీ ఎత్తితే అన్నీ రూ.500 నోట్లే ఇచ్చారు
నా కుమార్తె రిహానకు జ్వరం, కడుపు నొప్పి ఉండడంతో వచ్చా. డబ్బులు అవసరముంటే నిన్ననే రూ.2,500 చీటి ఎత్తితే అన్నీ రూ.500 నోట్లే ఇచ్చారు. ఉదయాన్నే హోటల్‌కు వెళితే ఎవరూ తీసుకోవడం లేదు. ఉన్నట్టుండి ఇలా చేస్తే ఎలా. పేదోళ్ల ఇబ్బందులు తీర్చాలి కదా?
షమీం, అశోక్‌నగర్, అనంతపురం

Advertisement
Advertisement