కళే శ్వాస..ధ్యాస | Sakshi
Sakshi News home page

కళే శ్వాస..ధ్యాస

Published Fri, Jan 22 2016 8:51 AM

విద్యాసాగర్ - Sakshi

ఆయన నాటకంపై మక్కువతో ఆ రంగంలో అడుగుపెట్టారు. పదకొండో ఏటే ఓ నాటక సంఘం స్థాపించి సంచలనం సృష్టించారు. ఈ రంగంలో రాణించడంతో జంద్యాల దృష్టిలో పడి సినీ రంగ ప్రవేశం చేశారు. తనకంటూ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నేడు అనారోగ్యం కుంగదీస్తున్నప్పటికీ రంగస్థలంలో దర్శకుడిగా రాణిస్తున్నారు ప్రముఖ రంగస్థల, సినీ నటుడు విద్యాసాగర్. నాటకంపై ఉన్న మమకారంతో తిరుపతిలో జరుగుతున్న నంది నాటకోత్సవాలను తిలకించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో ముఖాముఖి.     
 
ప్ర : రంగస్థల ప్రవేశం ఎలా జరిగింది.

జ: మా సొంతూరు గుంటూరు. నాకు ఎనిమిదేళ్ల ప్రా యంలో మా ఊళ్లో ఆంధ్ర బాలానందం సంఘం వ్యవస్థాపకుడు రేడియో అన్నయ్య(జ్ఞాపతి రాఘవరావు) చిన్నపిల్లలతో ‘బుజి బుజి రేకుల పిల్లుందా’ మ్యూజికల్ బేరె(డ్రామా) ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు. అందులో నాకో చిన్న పాత్ర దక్కడంతో మొదలైంది రంగస్థల ప్రవేశం.
 
ప్ర: ఏదో సంస్థకు పోటీగా బ్యా నర్ పెట్టారని తెలిసింది.
జ : మ్యూజికల్ బేరెలో పెళ్లికొడుకు పాత్ర ఇవ్వమని రేడియో అన్నయ్యను అడిగాను. ఆయన అదిగో ఇదిగో అంటూ ఇవ్వలే దు. దీంతో ఆంధ్రా బాలానందం సంస్థకు పోటీగా నేను 11 ఏటనే శ్రీవెంకటేశ్వర బాలానందం సంఘం స్థాపించాను. మా ఇంటి చుట్టు పక్క ఉన్న పిల్లలతో కలిసి డ్రామాలు వేశాం. రేడియో అన్నయ్య పాత్ర ఇవ్వలేదన్న కసే నన్ను ఇంతవాణ్ణి చేసింది.
 
ప్ర : సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది.

జ: 1984లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి నాటక పోటీ ల్లో ‘లిఫ్ట్’ అనే నాటికను ప్రదర్శించాం. సినీ దర్శకులు జంద్యాల, ఉషాకిరణ్ మూవీస్ మేనేజర్ అట్లూరు రామారావు ఆ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆ ప్రదర్శనకు విశేష స్పందన రావడంతో జంద్యాల దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీ స్ మొదటి సినిమా ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో అవకాశం ఇచ్చారు.
 
ప్ర : కేవలం నటనతోనే సరిపెట్టారా?
జ : నా జీవితమనే నాటకంలో బ్యాంకు ఉద్యోగిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, కోడెరైక్టర్‌గా ఇలా పలు పాత్రలు పోషిం చాను. ఇప్పటి వరకు 102 సినిమాల్లో నటించాను. ఎస్వీ కృష్ణారెడ్డి డెరైక్షన్‌లో బాలకృష్ణ నటించిన టాప్‌హీరో నా ఆఖరు సినిమా. దర్శకుడిగా అవకాశం వచ్చే సమయంలో 1994లో పక్షవాతం రావడంతో సినీ రంగానికి దూరమయ్యాను. అయితే మాతృరంగాన్ని మాత్రం వీడలేదు.  
 
ప్ర : నేటి రంగస్థల నటులకు మీ సూచనలు?

జ : ఒకప్పట్లో టీవీ వంటి మాధ్యమాలు లేకపోవడంతో నాటక రంగానికి విశేషాదరణ ఉండే ది. దీంతో నాటకమే ఊపిరి, శ్వాసగా జీవించేవాళ్లు. అయితే ఇప్పుడు కొత్తగా నటనారంగంలోకి వస్తున్న వారికి కమిట్‌మెంట్ కొరవడింది. వచ్చిన రెండ్రోజులకే నంది అవార్డు వస్తుందా? సినిమా, టీవీలో అవకాశాలు ఇప్పిస్తారా? అని అడుగుతున్నారు. ఏదైనా ఒక కళను నమ్ముకుంటే అదే శ్వాస, ధ్యాస కావాలి. అప్పుడే ఆ కళలో గుర్తింపుతోపాటు అగ్రస్థానం దక్కుతుంది.  

 

Advertisement

తప్పక చదవండి

Advertisement