రైస్‌ మిల్లుపై విజిలెన్స్‌ దాడులు | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లుపై విజిలెన్స్‌ దాడులు

Published Thu, Sep 8 2016 11:25 PM

రైస్‌ మిల్లుపై విజిలెన్స్‌ దాడులు

  • 456 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత
  • 210 క్వింటాళ్ల ధాన్యం, 60 క్వింటాళ్ల నూకలు కూడా..
  • చీరాల : పేదల పొట్ట నింపాల్సిన రేషన్‌ బియ్యం.. డీలర్లు, మిల్లర్లు, అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. పేదల బియ్యంపై అక్రమ వ్యాపారులు గద్దల్లా వాలుతున్నారు. కోట్లాది రూపాయల సబ్సిడీ బియ్యం పేదల కడుపు నింపకపోగా అక్రమ వ్యాపారులకు జేబులు నింపుతోంది. జిల్లాలో చీరాల కేంద్రంగా పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం ఇతర జిల్లాలు దాటి అక్కడ పాలిషింగై రాష్ట్రాలు తరలిస్తున్నారు.
     
    ఎలాంటి అనుమతులు లేకుండా రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి కర్ణాటకకు తరలించే ందుకు సిద్ధంగా ఉన్న లారీతో పాటు క్వింటాళ్ల కొద్దీ రేషన్‌ బియ్యం, నూకలు, ఆధారాలు లేని ధాన్యాన్ని విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మిల్లు యాజమానిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మండలంలోని ఈపూరుపాలెంలో గురువారం జరిగింది.
     
    విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ ఆర్‌ఎస్‌ కిషోర్‌కుమార్‌ కథనం ప్రకారం.. ఈపూరుపాలెం సమీపంలో శ్రీలక్ష్మీ రైస్‌ మిల్లులో పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం నిల్వ ఉంచారు. అంతేకాకుండా రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారం విజిలెన్స్‌ అధికారులకు అందింది. శ్రీలక్ష్మీ రైస్‌ మిల్లుపై విజిలెన్స్‌ సీఐతో పాటు ఎస్సైలు ఎస్‌డీ మస్తాన్‌వలి, కె.సాంబయ్య, చీరాల ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ ముస్తాక్‌లు తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. రేషన్‌ బియ్యం 456 క్వింటాళ్లు, 210 క్వింటాళ్ల ధాన్యం, 60 క్వింటాళ్ల నూకలు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.
     
    రేషన్‌ బియ్యం గురించి వివరాలు కోరగా తన వద్ద లేవని మిల్లు యాజమాని చక్కా ఆదిసూర్య ప్రకాశరావు చెప్పడంతో బియ్యాన్ని మిల్లులోనే ఉంచి సీజ్‌ చేసి లారీని ఈపూరుపాలెంకు తరలించారు. రేషన్‌ బియ్యాన్ని చీరాలతో పాటు పలు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి శ్రీలక్ష్మీ రైసుమిల్లులో రీసైక్లింగ్‌ (పాలిష్‌తో పాటు బ్యాగ్‌ మార్చడం) చేసి ఆ బియ్యాన్ని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తూ విక్రయిస్తుంటారని సీఐ కిషోర్‌కుమార్‌ తెలిపారు. పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం రైస్‌ మిల్లులో దొరకడంతో దీనిపై పూర్తి విచారణ చే స్తామన్నారు.
     
    సీఐ కిషోర్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ రైస్‌ మిల్లులో రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తున్నారనే సమాచారంతో దాడి చేయగా 456 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, 210 క్వింటాళ్ల ధాన్యం, 60 క్వింటాళ్ల నూకలు, ఎగుమతికి సిద్ధంగా ఉన్న లారీని సీజ్‌ చేశామన్నారు. మిల్లు యాజమాని చక్కా ఆదిసూర్యప్రకాశరావుపై 6–ఏ, క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామన్నారు. పట్టుకున్న రేషన్‌ బియ్యం విలువ రూ.15.50 లక్షలు ఉందని, కలెక్టర్, జేసీకి నివేదిక అందిస్తామన్నారు. రైస్‌ మిల్లును సీజ్‌ చేశామన్నారు. 
     
     
    మరోచోట కూడా
    కందుకూరు అర్బన్‌ : మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాద్రిపాలెంలో మందాడి మంగమ్మ అనే మహిళ ఇంట్లో దాచి ఉంచిన రేషన్‌ బియ్యాన్ని ఏఎస్‌ఓ హనుమంతురావు గురువారం దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా మంగమ్మ రేషన్‌ కార్డులదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి ఇతరులకు అమ్ముకుంటోందన్నారు. సమాచారం అందడంతో మంగమ్మ ఇంటిపై దాడి చేసినట్లు ఆయన తెలిపారు. నిందితురాలిపై 6ఏ కేసు నమోదు చేసి పట్టుకున్న బియ్యాన్ని గ్రామంలో ఉన్న రేషన్‌ షాపునకు అప్పగించినట్లు చెప్పారు. ఏఎస్‌ఓతో పాటు డీటీ లక్ష్మీనారాయణ, ఎఫ్‌ఐ కృష్ణమోహన్‌ ఉన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement