‘కష్ట’ర్లు | Sakshi
Sakshi News home page

‘కష్ట’ర్లు

Published Fri, Feb 26 2016 2:13 AM

‘కష్ట’ర్లు

నాలుగైదు క్లస్టర్లకు ఒకరే కార్యదర్శి
179 క్లస్టర్లలో పోస్టులు ఖాళీ
అస్తవ్యస్తంగా పల్లె పాలన
గ్రామ సచివాలయాల వద్ద ప్రజల  పడిగాపులు


దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల్లో పాలన కుంటుపడింది.. కార్యదర్శుల్లేక  రోజు రోజుకు కునారిల్లుతున్నాయి. స్మార్ట్‌విలేజ్ అంటూ హడావుడిచేసిన సర్కార్ ఆ తర్వాత ఆ ఊసెత్తడం లేదు. కనీసం పల్లెల్లో పాలనపై కూడా దృష్టి పెట్టడం లేదు. కేంద్రం నుంచి నేరుగా వచ్చే నిధులను దారి మళ్లిస్తూ దొడ్డిదారిన పెత్తనం చెలాయిస్తోంది.

సాక్షి, విశాఖపట్నం :  గ్రామ సచివాలయాలుగా పిలవబడే పంచాయతీ కార్యాలయాలు ఎప్పుడు చూసినా తాళాలు వేసే కన్పిస్తున్నాయి. అవసరానికి తగ్గట్టుగా కార్యదర్శుల్లేక ఈ కార్యాలయాల్లో పాలన పట్టాలు తప్పింది. ఉన్న కొద్ది మంది కార్యదర్శులపై పనిభారం పెరిగి పోవడంతో వారానికో రోజు కూడా కార్యాలయాల్లో అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 925 పంచాయతీలున్నాయి. 2 నుంచి 5 పంచాయతీల కొకటి చొప్పున 558 క్లస్టర్లుగా కుదించారు. కనీసం ఈ క్లస్టర్లకైనా పూర్తిస్థాయిలో కార్యదర్శులున్నారా అంటే అదీలేదు. 558 క్లస్టర్లుకు కేవలం 379 మంది కార్యదర్శులు  విధులు నిర్వర్తిస్తున్నారు.

179 క్లస్టర్లలో పోస్టులు ఖాళీ : రూ.5 లక్షలపైబడి ఆదాయమున్న గ్రేడ్-1 క్లస్టర్లు 77 ఉంటే వాటి పరిధిలో 61 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులున్నారు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయమున్న గ్రేడ్-2 క్లస్టర్లు 50 ఉంటే 39కి మాత్రమే కార్యదర్శులున్నారు. ఇక రూ.లక్ష నుంచి రూ.3 లక్షల ఆదాయమున్న గ్రేడ్-3 క్లస్టర్లు 151 ఉంటే.. కేవలం 49 చోట్లే  కార్యదర్శులున్నారు. ఇక రూ.లక్ష లోపు ఆదాయం ఉన్న  280గ్రేడ్-4 క్లస్టర్లకు గాను 230 మంది కార్యదర్శులున్నారు. 2013లో 55 మంది కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయగా.. ఏపీపీ ఎస్‌సీ ద్వారా 155 మందిని కొత్తగా నియమించడంతో ఆ మాత్రమైనా కార్యదర్శులున్నారు. లేకపోతే మరీ ఘోరంగా ఉండేది. ఇంకా 179 క్లస్టర్లకు కార్యదర్శులు లేకపోవడం వల్ల వీటి పరిధిలో ఉన్న సగానికి పైగా పంచాయతీలు దిక్కూమొక్కూలేని అనాథల్లా తయారయ్యాయి.

 పంచాయతీల్లో వారానికోరోజే..
కార్యదర్శుల కొరత కారణంగా నాలుగైదు క్లస్టర్స్ కొకరు చొప్పున కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంటే ఒక్కో కార్యదర్శిపై ఐదునుంచి 10 పంచాయతీల భారం పడింది. ప్రతీనెలా 1 నుంచి 10వ తేదీ వరకు పింఛన్ల పంపిణీలో తలమునకలవ్వాల్సి వస్తోంది. ఆ తర్వాత సమావేశాలు.. సమీక్షలు, పన్నుల వసూళ్లంటూ ఊళ్లమ్మట తిరగడంతో నెలలో పట్టుమని నాలుగైదురోజులు కూడా కార్యాలయాల్లో ఉండలేని పరిస్థితి. కొంతమంది అయితే ఇదేఆసరాగా చేసుకుని సొంత పనులు చక్కబెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు.

లక్ష్యానికి దూరంగా పన్నుల వసూలు
జిల్లాలో పన్నుల వసూలు డిమాండ్ రూ.38 కోట్లు కాగా మరో నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. రూ.13కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. మరో పక్క జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎన్‌వోసీలు ఇలా పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలు కార్యదర్శుల కోసం కార్యాలయాల చుట్టూ  ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోంది.

చివరకు మిగిలింది ఆరుగురే..
ఖాళీ పోస్టులను భర్తీచేయాల్సిన సర్కార్ ఆ ఊసెత్తకుండా వివిధ శాఖల్లో అదనపు సిబ్బందిని పంపించాలన్న ఆలోచనతో జీవో 966ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాసినా పెద్దగా స్పందన రాలేదు. కేవలం 19 మంది మాత్రమే కార్యదర్శులుగా చేరేందుకు ఆసక్తిచూపగా.. డిగ్రీ అర్హత ఉన్న రెగ్యులర్ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవాలని తొలుత జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 10మందిని అర్హులుగా నిర్ధారించారు. కానీ తాజాగా జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉన్న ఉద్యోగులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పడంతో దరఖాస్తు చేసిన అటెండర్ స్థాయి సిబ్బందిని జాబితా నుంచి తప్పించడంతో  చివరికి మిగిలింది  ఆరుగురే. వీరికి శిక్షణ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు.

వెనక్కి వెళ్లనున్న డిప్యుటేషన్ సిబ్బంది
మరో పక్క ఇప్పటికే డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న 22 మందిలో ఒకరు లాంగ్ లీవ్‌లో ఉండగా.. మిగిలిన 21మంది పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. 14 ఏళ్లుగా పనిచేస్తూ, పదోన్నతులు పొందే అవకాశాన్ని కోల్పోతుండడంతో సొంత శాఖలకు వెళ్లేందుకు ఆసక్తిచూపుతున్నారు. వీరు కూడా వెళ్లిపోతే పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం  కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయకుంటే పంచాయతీల పాలన మరింత కుదేలయ్యే పరిస్థితి నెలకొంది.

Advertisement
Advertisement