మంచం పట్టిన పల్లెలు | Sakshi
Sakshi News home page

మంచం పట్టిన పల్లెలు

Published Sun, Jul 31 2016 9:13 PM

మంచం పట్టిన పల్లెలు - Sakshi

  పారిశుద్ధ్యం అధ్వానం
♦  జిల్లా ఆస్పత్రిలో పెరుగుతున్న డయేరియా కేసులు
♦  ఇప్పటికే ఇద్దరు చిన్నారుల మృతి

తాండూరు రూరల్‌: పల్లెలు మంచం పట్టాయి. ఎక్కడ.. ఏ ఇంట్లో చూసినా మలేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాల మూలుగులే వినిపిస్తున్నాయి.  నెల రోజులుగా తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో అతిసార, డయేరియా వంటి రోగాలతో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజు ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి 40-60 డయేరియా కేసులు వస్తున్నాయి. ఓపీలో 100 కేసులు నమోదవుతున్నాయని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో వారం రోజుల నుంచి ఇద్దరు చిన్నారులు అతిసారతో మృతి చెందారు.  గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మండలంలోని జినుగుర్తి పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి వస్తున్నారు. వైద్యం కోసం అవస్థలు పడుతున్నారు.

లోపించిన పారిశుద్ధ్యం..
 వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. అక్కడక్కడా తాగునీటి పైప్‌లైన్‌ లీకేజీలు ఉన్నా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కరన్‌కోట్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ, లేబర్‌ కాలనీల్లోని మురుగు కాల్వల్లో పేరుకుపోయిన మురుగును తొలగించలేదని ఆయా కాలనీవాసులు వాపోతున్నారు. ఉద్దండపూర్‌ అనుబంధ గ్రామమైన గుండ్లమడుగు తండాలో రోడ్డుపై మురుగునీరు పారుతోంది.

జడిపిస్తున్న డయేరియా..
జిల్లా ఆస్పత్రిలో రోజురొజుకూ డయేరియా కేసుల నమోదు పెరుగుతోంది.  గతనెల 25న 42, 26న 53, 27న 53, 28న 46, 29న 48, 30న 52 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు డయేరియా బారిన పడి బాధపడుతున్నారు. అయితే జబ్బులతో ఆస్పత్రికి వస్తే ఇక్కడా పరిసరాలు ఆపరిశుభ్రంగానే ఉన్నాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement