Sakshi News home page

మాసాయిపేటలో విషజ్వరాలు

Published Sun, Sep 4 2016 8:17 PM

మాసాయిపేటలోని ఓవాడలో పేరుకుపోయిన మురుగు

వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట  గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న  ఓ వాడలో  విష జ్వరాలు సోకి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గత 15 రోజుల నుంచి కొందరు మంచాన పడగా మరి కొందరు నగరంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.  కొంత మంది పేద రోగులు  మంచాన పడి మూలుగుతున్నారు. దోమల కాటు వల్ల డెంగీ తదితర జ్వరాలు సోకాయని బాధితులు తెలిపారు.

వాడలో ఇంటింటికీ గొర్ల కొట్టాలు ఉండడంతో పేడ, మురుగు వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణలో అధికారులు అశ్రద్ధ చేస్తున్నారని,  రోగాల బారినపడిన వారికి సర్కారు వైద్యం అందకపోవడంతో  ఇబ్బందులు పడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు.  15 రోజుల క్రితం సాయిప్రియ,  శ్రీకాంత్‌, సుశీల, కవిత తదితరులకు  విష జ్వరాలు సోకడంతో నగరంలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకొని వచ్చారు.

అలాగే నందిని, నవీన, మౌనిక, మోక్షిత తదితరులు రోగాల బారిన పడి నగరంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం  చేయించుకుంటున్నారని స్థానికులు తెలిపారు.  ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పాప వైద్యానికి రూ.30 వేలు ఖర్చు
మా ఐదేళ్ల కూతురు సాయిప్రియకు 15 రోజుల క్రితం జ్వరం వచ్చింది. తగ్గక పోవడంతో టెస్టులు చేయించాం. రక్తంలో తెల్ల కణాలు తగ్గాయని, దీంతో డెంగీ సోకిందని డాక్టర్లు చెప్పారు. దీంతో హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ వద్ద సెయింట్‌ థెరిసా ఆసుపత్రిలో వైద్యం చేయించాం. అప్పు చేసి రూ. 30వేలు ఖర్చు చేశాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. - లలిత

మనవరాలు ఆసుపత్రిలోనే ఉంది
నామనవరాలు సరితకు జ్వరం వచ్చిం‍ది. పది రోజుల నుంచి పట్నంలోని ఆస్పత్రిలో ఉంది. ఇప్పటివరకు రూ. 20వేలు ఖర్చయ్యాయి. డెంగీ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. - కమలమ్మ

మళ్లీ జ్వరం వస్తోంది
నా కూతురు కవితకు పక్షం రోజుల క్రితం జ్వరం వచ్చింది. తూప్రాన్‌లో టెస్టులు తీసుకుంటే డెంగీ సోకిందని చెప్పిండ్రు. పట్నం తీసుకెళ్లి రూ. 25 వేలు ఖర్చు చేసి నయం చేయించి ఇంటికి వచ్చాం. మళ్లీ సాయంత్రం పూట చలి, జ్వరం రావడంతో మూలుగుతోంది. - లక్ష్మి

Advertisement
Advertisement