కోట్లకు పడగలెత్తిన సీఐ బాలకృష్ణ | Sakshi
Sakshi News home page

కోట్లకు పడగలెత్తిన సీఐ బాలకృష్ణ

Published Thu, Jun 23 2016 9:53 AM

కోట్లకు పడగలెత్తిన సీఐ బాలకృష్ణ - Sakshi

రియల్ ఎస్టేట్.. లిక్కర్ లాబీలతో నగర పోలీసుల అనుబంధం, భాగస్వామ్యం తాజా ఏసీబీ దాడులతో బట్టబయలైంది. రౌడీషీటర్ల పీచమణచాల్సిన పోలీసు అధికారులు.. ఏకంగా వారినే తమ బినామీలుగా పెట్టుకొని అడ్డగోలు వ్యాపారాలు.. దందాలతో కోట్లకు పడగలెత్తుతున్న తీరు విస్మయం కలిగిస్తోంది. వారికి ప్రభుత్వం ఇచ్చే వేతనాలు.. వారి ఆస్తులకు పొంతనే లేకపోయినా పోలీస్ బాస్‌లు చూసీచూడనట్లు పోతుండటంతో అక్రమ దందాలు అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతున్నాయి.  తాజాగా నాలుగోపట్టణ సీఐ బాలకృష్ణపై ఏసీబీ జరిపిన దాడులు ఆయనకు రౌడీషీటర్లతో ఉన్న ‘రియల్’ బంధాన్ని వెలుగులోకి తెచ్చాయి.
 
విశాఖపట్నం:
విశాఖ కమిషనరేట్ పరిధిలోని నాలుగో పట్టణ సీఐ కె.వి.బాలకృష్ణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం జరిపిన దాడులు.. ఆయన నివాసం, కుటుంబ సభ్యుల ఇళ్లలో జరిపిన సోదాల్లో బంగారం, వెండి, నగదుతోపాటు కళ్లు చెదిరేలా భవంతులు, స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించి కీలక పత్రాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ రేటు ప్రకారం వీటి విలువ రూ.2 కోట్లని ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. అయితే బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.10 కోట్లుపైనే ఉంటుందని అంచనా. విశాఖలోని పీఎంపాలెం, సింహాచలం, కొవ్వూరు, విజయనగరం తదితర ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన సోదాల్లో  అత్త, మామ, తండ్రి, భార్య, మరదలు పేరిట విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు నిర్థారణ అయ్యింది.
 
కుటుంబ సభ్యుల పేరుతో..
పోతినమల్లయ్యపాలెంలో బాలకృష్ణకు చెందిన జీ+3 రెండు ఇళ్లు, శివాజీపాలెం మంగపురం కాలనీలో 1800 అడుగుల ప్లాటు, విజయనగరంలో తండ్రి పేరిట కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు గుర్తించారు. అత్త పేరుతో ఎండాడలో 2015లో రూ.40 లక్షలు విలువైన ఫ్లాట్ కొనుగోలు చేశారు. తన మరదలి పేరిట కొమ్మాది సమీపంలోని జె.కె. ప్లాజాలో రూ. 60 లక్షల ఫ్లాట్, నరవలో భార్య పేరు మీద  37 సెంట్లు భూమి, 10 లక్షల విలువైన 227 గజాల స్ధలం ఉన్నట్లు గుర్తించారు. ఫోర్తుటౌన్ స్టేషన్‌లో సీఐ బాలకృష్ణ చాంబర్ నుంచి కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

బాలకృష్ణ ఇంట్లో 25 తూలాల బంగారం, తనఖా పట్టిన 400 గ్రాముల బంగారం లభించిందన్నారు.  వీటితోపాటు మూడు కేజీల వెండి, బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు ఉన్నాయని తెలిపారు. ఇన్సూరెన్స్, చీటీలకు సంబంధించి రూ. 8 లక్షల విలువైన పత్రాలు లభించాయి. బ్యాంకు లాకరు తాళం కూడా ఉందని పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన అన్నదమ్ముల గొడవను సెటిల్ చేసేందుకు సీఐ బాలకృష్ణ రూ.2 లక్షలు తీసుకున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై గత ఏడాది నుంచి ఫోర్తుటౌన్ పోలీస్‌స్టేషన్‌పై నిఘా పెట్టామని డీఎస్పీ వెల్లడించారు. రెండు లక్షలు తీసుకున్నవారిలో ఈయనతోపాటు ఒక ఎస్సై, ఒక హెచ్‌సీ, కానిస్టేబుల్ ఉన్నట్లు తెలిపారు. వారిపై ఇప్పటికే ప్రభుత్వానికి  నివేదిక పంపించామన్నారు. విజయనగరం, కొవ్వూరు,సింహాచలంలో బాలకృష్ణ కుటుంబ సభ్యుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది.

పలు వ్యాపారాలు
రౌడీ షీటర్ అయిన నానాజీ అనే వ్యక్తిని సీఐ తనకు బినామీగా పెట్టుకున్నారన్న ఆరోపణలతో నానాజీ ఇంట్లోనూ సోదాలు చేశామని.. అయితే అక్కడ ఏమీ లభించలేదని డీఎస్పీ చెప్పారు. అయితే ఇతని ద్వారానే బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు తెలిసింది. విజయనగరం జిల్లాలో లిక్కర్ లాబీలో కూడా గతంలో వాటాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 ఏఆర్ నుంచి లా అండ్ ఆర్డర్‌కు
1992లో ఆర్.ఎస్.ఐ.గా పోలీస్ శాఖలో చేరిన బాలకృష్ణ.. 2002లో లా అండ్ ఆర్డర్‌కు వచ్చారు. యలమంచిలిలో సీఐగా చేశారు. అనంతరం పీఎంపాలెం ట్రాఫిక్ సీఐగా వచ్చారు. 2015 జనవరిలో ఫోర్తుటౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. సీఐ బాలకృష్ణపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement