నీళ్లివ్వకపోతే చూస్తూ ఊరుకోవాలా..? | Sakshi
Sakshi News home page

నీళ్లివ్వకపోతే చూస్తూ ఊరుకోవాలా..?

Published Sun, Jan 29 2017 11:40 PM

నీళ్లివ్వకపోతే చూస్తూ ఊరుకోవాలా..? - Sakshi

- కళ్ల ముందు నీళ్లున్నా దొంగగా వాడుకోవాల్సిన దుస్థితేంటి?
- హంద్రీనీటిని కుప్పంకు తరలిస్తే ఉద్యమిస్తాం
- ఫిబ్రవరి 6న వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ఉరవకొండలో మహాధర్నా
- పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు తరలిరావాలి
- ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపు


వజ్రకరూరు : ‘‘ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంకెన్నాళ్లు చూస్తూ ఊరుకోవాలి’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 6వ తేదీ ఉరవకొండ పట్టణంలో వైఎస్సార్‌సీపీ అ«ధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండలంలోని పీసీ.ప్యాపిలి, రాగులపాడు, పందికుంట గ్రామాల్లో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి మహాధర్నాను విజయవంతం చేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు హంద్రీనీవా కాలువ ద్వారా అధికారికంగా సాగునీరు ఇవ్వాలని రైతులతో కలిసి జలజాగరణ, ధర్నాలు, నిరాహార దీక్షలు, పంప్‌ హౌస్‌ ముట్టడి తదితర కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని కూడా నేరుగా కలిసి సమస్యను విన్నవిస్తే... మీ విధానం, మా విధానం వేరని మాట్లాడారన్నారు. ఈ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వాలన్న చిత్తశుద్ధి సీఎంకు లేదని విమర్శించారు. ఈప్రాంత రైతులకు నీరు ఇవ్వకుండా కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నాడన్నారు. జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీరు తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హంద్రీనీవా పనులు 95 శాతం పూర్తి చేస్తే మిగిలిన 5 శాతం పనులను పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలుగా మాల్యాల నుంచి జీడిపల్లికి నీరు వస్తున్నా వాడుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. దొంగగా వాడుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. జిల్లాకు నీళ్లు వస్తున్నాయంటే అది వైఎస్సార్‌ పుణ్యమేనన్నారు. చంద్రబాబు సర్కార్‌ కేవలం చెరువులకు నీరిచ్చి అంతా తామే చేశామంటూ రైతులను మభ్యపెట్టడం సరికాదని హితవు పలికారు. 2016 ఆగస్టులో ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పడంతో పాటు డిస్ట్రిబ్యూటరీ లను పూర్తిచేస్తామని చెప్పి ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. దీని వల్ల రైతులు నష్టపోయారన్నారు.

అలాగే ఉరవకొండలో మహానేత వైఎస్‌ఆర్‌ హయాంలో కొనుగోలు చేసిన 89 ఎకరాల్లో ఇంతవరకు పేదలకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. దీని కోసం ఆందోళన చేసినా స్పందించలేదన్నారు.  రైతులు, ప్రజలకు జరుగు తున్న అన్యాయన్ని ప్రశ్నించడానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 6న ఉరవకొండకు వస్తున్నారని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు పూర్తిచేసి వెంటనే సాగునీరు ఇవ్వాలని, గుంతకల్‌ బ్రాంచ్‌కాలువ ఆధునీకరణ చేపట్టాలని, ఎకరాకు కనీసం రూ.15 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని, చేనేత కార్మికులకు ప్రతినెలా నూలు కొనుగో లుపై రూ. 1000 సబ్సిడీ ఇవ్వాలని, రైతుల రుణమాఫీ ఓకే విడతలో ఇవ్వాలని, కూలీలు వలస వెళ్లకుండా పనులు కల్పించాలని కోరుతూ ఈ ధర్నా చేపట్టడం జరుగుతోందన్నారు.

Advertisement
Advertisement