బేబీ ఫ్యాక్టరీలు బోలెడు! | Sakshi
Sakshi News home page

బేబీ ఫ్యాక్టరీలు బోలెడు!

Published Fri, Jan 1 2016 3:51 AM

బేబీ ఫ్యాక్టరీలు బోలెడు!

    ► పిల్లల అమ్మకాల వ్యవహారంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు
    ► ఫ్లాట్ తనిఖీ చేసిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ అధికారులు
    ► విచారణ జరపాల్సిందిగా పోలీస్ కమిషనర్‌కు ఏపీ మంత్రి కామినేని ఆదేశం
    ► బండారం బయటపడటంతో పరారైన నిర్వాహకులు

సాక్షి, విశాఖపట్నం: కడుపు పండించుకోవాలని తపించే తల్లిదండ్రులకు వలవేసి.. పేద మహిళల గర్భమే పెట్టుబడిగా.. పసికందుల వ్యాపారం నిర్వహిస్తున్న ముఠా కార్యకలాపాలు విశాఖ నగరంలోని అనేక ప్రాంతాల్లో సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పసి పిల్లలను విక్రయిస్తున్న దారుణ ఉదంతాన్ని ‘విశాఖ తీరాన బేబీ ఫ్యాక్టరీ’ అన్న శీర్షికతో ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో డొంకంతా కదులుతోంది. నగరంలో ఇటువంటి వ్యాపారం ఆరు ఫ్లాట్లలో జరుగుతున్నట్లు సమాచారం అందింది. అవి కూడా బీచ్‌రోడ్డు పరిసరాల్లోనే ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది.


వెలుగు చూస్తున్న వాస్తవాలు
‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన అపార్ట్‌మెంట్‌లోని 101వ ఫ్లాట్‌లో 2011 నుంచీ చిన్న పిల్లల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఫ్లాట్ యజమానురాలికి కూడా సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. బ్రోకర్ వెంకట్, నర్సు సుజాతలతో పాటు మరో బ్రోకర్ కీలక పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. కృత్రిమ అండాలను పేద మహిళల గర్భంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి వారిని అద్దె ఫ్లాట్లలోనే ఉంచి ప్రసవం అయిన తర్వాత పసికందులను తీసుకుని, మహిళలను పంపివేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదే అపార్ట్‌మెంట్‌లో 103వ ఫ్లాట్‌ను కూడా అద్దెకు తీసుకుని కొన్నాళ్లు సరోగసి తల్లులను ఉంచారని, అయితే అనుమానం వచ్చిన ఫ్లాట్ యజమానులు  ఖాళీ చేయించారని ఇరుగుపొరుగు చెప్పారు. ఆరు నెలలుగా పలువురు గర్భిణులు వరండాల్లో తిరుగుతుంటే అనుమానం వచ్చి ఇలా ఎవరుబడితే వారు వస్తే కుదరదని నిర్వాహకులను హెచ్చరించి, ఫ్లాట్ ఖాళీ చేయించారని అధికారుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ అపార్ట్‌మెంటుకు వెల్ఫేర్ అసోసియేషన్ లేదు. దీంతో ఎవరు వచ్చినా, ఎవరు వెళ్లినా పట్టించుకునే వారు లేకపోవడంతో ఈ ముఠా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఫ్లాట్ యజమానురాలు విజయలక్ష్మి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. ఆమె కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడని తెలిసింది. అతను నగరానికి వచ్చినప్పడు మాత్రం నెల రోజుల పాటు ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు లేకుండా జాగ్రత్తపడుతుంటారని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు.


 గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తాం..
 కైకలూరు: విశాఖ తీరంలో పిల్లల అమ్మకాలపై ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు.  గురువారం కృష్ణాజిల్లా కలిదిండి మండలం తాడినాడ గ్రామానికి వచ్చిన మంత్రి ‘సాక్షి’తో మాట్లాడారు.  ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్ల గుర్తింపును రద్దుచేయాలని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు సిఫారసు చేస్తామని తెలిపారు.

 
 సుమోటోగా కేసు
 సాక్షి కథనంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ విభాగం (ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) స్పందించింది. సుమోటోగా కేసు నమోదుకు ఆదేశించింది. పిల్లల విక్రయాలతో సంబంధమున్న ఆస్పత్రులు, సంస్థలు, ఏజెంట్లపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. ఈ నెల 7వ తేదీలోపు తమకు నివేదిక సమర్పించాల ని కమిషన్ సభ్యులు ఎస్.బాలరాజు, ఎస్.మురళీధర్‌రెడ్డి, ఎం.సుమిత్రలు ఆదేశించారు.  
 
 కదిలిన యంత్రాంగం
 అసాధారణ రీతిలో పసికందులను విక్రయిస్తున్న ముఠా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విశాఖ సీపీ అమిత్‌గార్గ్‌తో గురువారం ఫోన్లో మాట్లాడారు. దీనిపై విచారణ జరిపి దోషులను పట్టుకోవాలని ఆదేశించారు. జిల్లా అదనపు డీఎంహెచ్‌వో పి.ఎస్.సూర్యనారాయణ, ఉమెన్ హెల్త్ ఆఫీసర్ చంద్రలేఖ, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ లైజన్ ఆఫీసర్ నాగమణి, శిశు గృహ ప్రత్యేక దత్తత స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు పద్మలు ‘బేబీ ఫ్యాక్టరీ’ నడుపుతున్న అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అపార్ట్‌మెంట్ వ్యవహారాలు చూస్తున్న ఓ లాయర్‌తో, చుట్టుపక్కల వారితో మాట్లాడామని, నివేదికను జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్‌కు అందించామని సూర్యనారాయణ ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే పత్రికలో తమ బండారం బయటపడటంతో అప్పటికే ఫ్లాట్‌కు తాళం వేసి నిర్వాహకులు పరారయ్యారు.
 

Advertisement
Advertisement