సీమ ప్ర‘జల’ శంఖారావం | Sakshi
Sakshi News home page

సీమ ప్ర‘జల’ శంఖారావం

Published Sun, May 21 2017 10:47 PM

సీమ ప్ర‘జల’ శంఖారావం

- నీటి వాటాలో అన్యాయం
- సీమకు చంద్రబాబు ద్రోహం
- ప్రభుత్వం స్పందించకపోతే 
  ఉద్యమం ఉద్ధృతం  
- జలచైతన్య సభలో వక్తలు
- విజయవంతమైన బహిరంగ సభ
- అడుగడుగునా పోలీస్‌ ఆంక్షలు
 
నంద్యాల/అర్బన్‌/విద్య: నీటివాటా కోసం రాయలసీమ ప్రజలు ఒక్కటయ్యారు. పార్టీలకతీతంగా వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దశాబ్దాలుగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. తాగు, సాగునీటి కోసం ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నామో ఉదాహరణలో వివరించారు. ఆదివారం నంద్యాల పట్టణం ఎస్పీజీ గ్రౌండ్‌లో నిర్వహించిన సీమ జలచైతన్య సదస్సు ఇక్కడి ప్రజల ఆకాంక్షను తెలియజెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యాలను ఎత్తి చూపింది. సీమ ప్ర‘జల’ శంఖారావం నంద్యాల నుంచే ప్రారంభమైంది. బహిరంగ సభలో అఖిలభారత రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్‌ బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి విషయంలో రాయలసీమ ప్రజలు 64ఏళ్లుగా దగా పడుతున్నారన్నారు. నీటివాటా కేటాయింపులపై  చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని..లేదంటే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 
 
పట్టిసీమతో చుక్కనీరు అందలేదు: మదన్‌మోహన్, రాయలసీమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం పట్టిసీమతో రాయలసీమకు నీరు అందిస్తున్నామంటూ ఆర్భాటలు చేయటమే తప్ప రైతులకు దాని ద్వారా చుక్కనీరు అందించలేదు. పట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లాల్లో 80 టీఎంసీలు ఆదా అవుతాయి. మహారాష్ట్రకు 14టీఎంసీలు, కర్ణాటకకు 20టీఎంసీలు పోను 45టీఎంసీల నీరు మిగులుతుంది. మిగులు జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించే చట్టం చేయాలి.  
 
వచ్చినీరు వచ్చినట్లే తరలిస్తున్నారు:  ప్రభాకర్‌రెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం
పట్టిసీమ నిర్మాణంతో కృష్ణా డెల్టాకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాల్సి అవసరం తీరిపోయింది. నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు కేటాయించిన నీటి పరిమాణం వరకు నీరు విడుదల చేయాలి. అది కూడా శ్రీశైలం రిజర్వాయర్‌లో 875 అడుగుల పైన ఉన్నప్పుడే విడుదల చేయాలి.  శ్రీశైలం జలాశయంలోకి వచ్చిన నీరు వచ్చినట్లు కిందకు తరలించక పోతుండటంతో పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు నీరు అందడం లేదు. 
 
సాగునీటి కమిషన్‌ ఏర్పాటు చేయాలి:  చంద్రమోహన్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు, కడప:
రాయలసీమకు తరతరాలుగా సాగు, తాగునీటి విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు వీటి గురించి పట్టించుకోవడం లేదు. వర్షాలు కురువడం తక్కువనుకుంటే కురిసినప్పుడు వాటిని ఎక్కడ నిల్వ ఉంచుకోవాలో తెలియక రైతులు కష్టాలు పడుతున్నారు. చెరువు సంరక్షణ, పునరుద్ధరణకు చట్టబద్ధ సాగునీటి కమిషన్‌ ఏర్పాటు చేయాలి. 
 
400 టీఎంసీల నీరు ఇవ్వాలి : విష్ణువర్దన్‌రెడ్డి, ఎల్‌ఎల్‌సీ చైర్మన్‌:
రాయలసీమ నాలుగు జిల్లాల్లోని ప్రతి ఎకరా సాగు భూమికి ఒక్క పంటకైనా నీరు అందేలా చూడాలనే బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును ఏ ప్రభుత్వాలు గౌరవించడం లేదు. రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను సీమకు, కోస్తాంధ్రులకు పునః పంపిణీ జరగాలి. రాయలసీమలోని ప్రతి జిల్లాకు కనీసం వంద టీఎంసీల నీటి కేటాయింపు జరగాలి. ఈ మొత్తంగా నాలుగు జిల్లాలకు 400టీఎంసీలు ఇవ్వాలి. 
 
నీటి హక్కులను కాలరాయడం తగదు: ఏర్వ రామచంద్రారెడ్డి, రైతు సంఘం నాయకుడు, నంద్యాల:
రాయలసీమ ప్రాంత నీటి హక్కులను కాలరాస్తున్నారు. కృష్ణా జలాల నీటి విషయంలో ప్రభుత్వాల వాదనలో నిజం లేదు. తుంగభద్ర నుంచి కృష్ణానదికి కేటాయించిన నీటి కంటే అదనంగా ఏటా సుమారు 130 టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇవి నాగార్జునసాగర్‌ ద్వారా డెల్టాకు ప్రవహించి వారు వాడుకోగా మిగతావి సముద్రపాలవుతున్నాయి. ప్రభుత్వం మేల్కొని సీమ వాసుల న్యాయపరమైన నీటి హక్కులు కల్పించాలి. 
 
కోస్తా నటుల నోట సీమ పౌరుషమా: అరుణ్‌, ఉద్యమనేత, అనంతపురం
కోస్తా ప్రాంతానికి చెందిన నటులు బాలకృష్ణ, చింరజీవి, పవన్‌కల్యాణ్‌ రాయలసీమ పౌరుషంపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది.  సినీ పరిశ్రమలో కూడా రాయలసీమ కళాకారులు అణిచివేతకు గురికావడంతో సీమ పౌరుషాన్ని వీరు ప్రదర్శించాల్సి వచ్చిందన్నారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అనే నినాదాన్ని రాయలసీమ జిల్లాలో కాకుండా అమరావతిలో, 13 జిల్లాల్లో చేస్తేనే ప్రయోజనం ఉంటుంది.
 
ఉప ఎన్నికల్లో ప్రశ్నించండి...
నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే అధికార పార్టీ నేతలను సాగునీటిపై నిలదీయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.డాక్టర్‌ నాగన్న మాట్లాడుతూ.. సాగునీటి హక్కు కోసం పోరాడి సీమ పౌరుషాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. విరసం నేత విజయలక్ష్మి మాట్లాడుతూ.. పట్టిసీమను పట్టుబట్టి ఏడాదిలో పూర్తి చేసిన ప్రభుత్వం ఎందుకు హంద్రీనీవాను పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రెయిన్‌గన్‌లతో మభ్యపెట్టడం మాని శాశ్వత ప్రాతిపదికపై నీళ్లను అందివ్వాలని కోరారు. అనంతపురంకు చెందిన అంధుడు.. ఈశ్వరయ్య ఉద్యమ స్ఫూర్తితో సభకు విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ  సాగునీటిపై రాజీలేని ఉద్యమం చేస్తే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. పెద్దారెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డి, రాయలసీమ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య, స్టూడెంట్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు భాస్కర్, ఏపీ రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు చంద్రమౌళీశ్వరరెడ్డి, కోవెలకుంట్ల నేత కర్రహర్షవర్దన్‌ రెడ్డి, రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు వైఎన్‌రెడ్డి, కార్యదర్శి మహేశ్వరరెడ్డి, కోశాధికారి వెంకటేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభలో రిటైర్డు ఇంజనీర్‌ సుబ్బరాయుడు, బొజ్జా దశరథరామిరెడ్డిని సన్మానించారు.
 
స్వచ్ఛందంగా కదిలివచ్చిన సీమ ప్రజలు
సీమకు నీటి భిక్ష కాదు.. చట్టబద్ధమైన హక్కు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నంద్యాలలో నిర్వహించిన జలచైతన్య బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వాహనాల్లో  రైతుల సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు వచ్చారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వాక్‌ఫర్‌రన్‌ పేరిట కాలినడక రైతులు తరలివచ్చారు. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినప్పటికీ వీరు తమ గళం విప్పి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీమకు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు. ప్రభుత్వం మూడు నెలల్లో స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సాగునీరు అందక దిగుబడులు తగ్గి, గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఆత్మశాంతి కోసం బహిరంగ సభలో రెండునిమిషాలు మౌనం పాటించారు.
 
తీర్మానాలివీ...
జలచైతన్య సభకు హాజరైన మేధావులు, ప్రతినిధులు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు.
  •  కృష్ణా జలాల్లో రాయలసీమ వాటా నిగ్గు తేల్చి చట్టబద్ధమైన హక్కు ప్రకటించాలి.
  •  పెండింగ్‌, ప్రతిపాదిత కొత్త ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి.
  • నదీ జలాల వివాదం శాశ్వత పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేస్తున్న బోర్డులో సీమకు నీటిని కేటాయించే విధానాలను రూపొందించాలి.
  • సీమలో సంప్రదాయ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ కోసం చట్టబద్ధ సాగునీటి కమిషన్‌ ఏర్పాటు చేయాలి.
 

Advertisement
Advertisement