అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్‌లు | Sakshi
Sakshi News home page

అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్‌లు

Published Sun, Oct 23 2016 7:50 PM

అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్‌లు

- తిరుపతిలో హాఫ్ మారథాన్ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చిన రాజప్ప
తిరుపతి గాంధీరోడ్డు: ఏపీ రాజధాని అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర హోం మంత్రి, డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. డిసీజ్ ఎరాడికేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్(డిప్) సంస్థ తిరుపతిలో ఆదివారం నిర్వహించిన సెవెన్ హిల్స్ మారథాన్ 21కె, 10కె, 5కె, 3కె రన్ ముగింపు సభలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులందజేశారు. 5కె, 3కె పరుగులో పాల్గొన్న వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ, సుధారాణి ఫౌండేషన్, టీటీడీ సహకారంతో డిప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మారథాన్‌లో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగించేందుకే ఈ మారథాన్‌ను తిరుపతిలో నిర్వహించామని తెలిపారు. ప్రజలు ప్రతిరోజూ సైకిల్ తొక్కడానికి, వాకింగ్‌ను ప్రోత్సహించేందుకు అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే తరహాలో తిరుపతిలో కూడా వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ వారంలో 150 నిమిషాలు ఏదో ఒక వ్యాయామం చేస్తే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చన్నారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ బాల్యం నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో మారథాన్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సమావేశంలో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, టీటీడీ జేఈవో పోలా భాస్కర్, తిరుపతి ఎస్పీ జయలక్ష్మి, సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా, నగర కమిషనర్ వినయ్‌చంద్, ఎస్వీయూ వీసీ దామోదరం, పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడు, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, సంస్థ నిర్వాహకులు రాకేష్, నన్నపనేని మురళి, మధు తదితరులు పాల్గొన్నారు.

మంత్రుల ఆస్తులు ప్రకటిస్తాం
ముఖ్యమంత్రి ఆస్తుల వివరాలు ప్రకటించినట్టుగానే రాష్ట్ర మంత్రుల ఆస్తుల వివరాలను స్పీకర్‌కు అందజేస్తామని విలేకరుల ప్రశ్నలకు హోం మంత్రి చిన రాజప్ప సమాధానమిచ్చారు.
 

Advertisement
Advertisement