పాతాల గంగమ్మ పైకొచ్చింది | Sakshi
Sakshi News home page

పాతాల గంగమ్మ పైకొచ్చింది

Published Sun, Aug 4 2013 5:52 AM

water table raises

భారీగా పెరిగిన భూగర్భ జలాలుచాలాచోట్ల రెండు మీటర్ల లోతులోనే నీరు
 మోర్తాడ్, న్యూస్‌లైన్ :
 జిల్లాలో ఊహించని రీతిలో వర్షాలు కురియడంతో భూగర్భ జల మట్టం భారీగా పెరిగింది. చాలాచోట్ల రెండు మూడు మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభిస్తున్నాయి. జిల్లాలో సరాసరిన 7.6 మీటర్ల లోతులోనే నీరుంది. గతేడాది జూలైలో జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 12.27 మీట ర్లుగా నమోదైంది. కాగా ఇదే సంవత్సరం జూన్‌లో 11.42 మీటర్లుగా ఉంది. భారీ వర్షాలు కురియడంతో వారం వ్యవధిలోనే భూగర్భ జలాలు పైకి వచ్చాయి. జిల్లాలోని 45 ఫీజో మీటర్ల ద్వారా గత నెలలో భూగర్భ జలమట్టాలు సేకరించారు. వాటి ఆధారంగా జిల్లాలో సగటున 7.60 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నట్లు తేల్చారు. వారం వ్యవధిలోనే భారీ వర్షాలు కురియడంతో నీటి మట్టం ఒకేసారి 3.82 మీటర్లు పెరిగింది. నిజామాబాద్, బోధన్ డివిజన్‌లలోని పెద్దవాల్గోట్, అయిలాపూర్, మంచిప్ప, పెర్కిట్, నూత్‌పల్లి, ముప్కాల్, గన్నారం, అంక్సాపూర్, అర్సపల్లి, నిజాంసాగర్, నస్రూల్లాబాద్‌లలోని ఫీజో మీటర్లలో 2 మీటర్ల నుంచి 3 మీటర్ల లోతులో నీటిమట్టం నిలచి ఉంది. బిచ్కుంద మండలంలోని పుల్కల్‌లో మాత్రం 0.58 మీటర్ల లోతులోనే నీరుంది. మూడేళ్లలో భూగర్భ జల మట్టం భారీగా పెరగడం ఇదే మొదటిసారి.
 కామారెడ్డి డివిజన్‌లో అత్యల్పం
 నిజామాబాద్, బోధన్ డివిజన్‌లతో పోల్చితే కామారెడ్డి డివిజన్‌లో భూ గర్భ జలమట్టం తక్కువగా నమోదైంది. కామారెడ్డి డివిజన్‌లోని అనేక ప్రాంతాలలో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీరుంది. నిజామాబాద్ డివిజన్‌లో ప్రస్తుత సగటు భూగర్భ జలమట్టం 5.24 మీటర్లు కాగా జూన్‌లో 10.15 మీటర్లు, గతేడాది జూలైలో 12.25 మీటర్లుగా నమోదైంది. బోధన్ డివిజన్‌లో ప్రస్తుత సగటు 6.3 మీటర్లుగా నమోదు కాగా జూన్‌లో 8.66 మీటర్లు, గతేడాది జూలైలో 8.10 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. కామారెడ్డి డివిజన్‌లో ప్రస్తుత సగటు 11.47 మీటర్లు కాగా జూన్‌లో 15.17 మీటర్లు, గతేడాది 12.27 మీటర్లుగా ఉంది. డివిజన్‌లో తక్కువగా భిక్కనూరులో 15.53 మీటర్లు, గాంధారిలో 15.97 మీటర్లు, దోమకొండలో 21.49 మీటర్లు, బీబీపేట్‌లో 23.39 మీటర్లు, పెద్దమల్లారెడ్డిలో 24.61 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి.


 నీటిని వృథా చేయొద్దు : పి.శ్రీనివాస్‌బాబు, భూగర్భ జల శాస్త్రవేత్త భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పరిరక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. భారీ వర్షాల కారణంగా నీటి మట్టం పెరిగింది. ఎండల తీవ్రత పెరిగితే మళ్లీ పడిపోతుంది. ప్రస్తుతానికి నీటి ఇబ్బందులు తప్పినట్లే.
 -
 

Advertisement

తప్పక చదవండి

Advertisement