శివారు భూములకు నీరందించేందుకు చర్యలు | Sakshi
Sakshi News home page

శివారు భూములకు నీరందించేందుకు చర్యలు

Published Sun, Sep 18 2016 1:29 AM

water to tail lands

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : జిల్లాలో కాలువలను తవ్వి అభివృద్ధి చేయడం ద్వారా చివరి భూములకు సైతం సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు కాలువ తప్ప సబ్‌ ఛానల్స్‌తో పాటు అన్ని కాలువలను తవ్వి భూములకు సాగునీరు అందేలా చూడాలన్నారు. రైతుల పొలాల గుండా ఫీల్డ్‌ ఛానల్‌ ్స తవ్వి ప్రతి రైతు పొలానికి నీరు అందించాలన్నారు. ఎక్కడైనా ఇంకా పొలాలకు నీరు అందకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 11 మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు క్షేత్రస్థాయికి వెళ్లి కాలువలను తనిఖీ చేయాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 197 మైనర్, సబ్‌మైనర్‌ ఛానల్స్‌ ఉన్నాయని వాటి ద్వారా పొలాలకు పిల్ల కాలవలు తవ్వి సాగునీరు అందించాలని ఏజెన్సీ ప్రతినిధులను కలెక్టర్‌ ఆదేశించారు. ఏలూరులో తమ్మిలేరు కాలువ బండ్‌ను ఆహ్లాదకర వాతావరణంలో సుందరంగా తీర్చిదిద్దాలని, అందుకు సంబంధించి ప్లాన్‌ను రూపొందించి 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ వై.సాయిశ్రీకాంత్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్‌.షరీఫ్, భూసేకరణ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ భానుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement