నాలా ఆక్రమణలు సహించం కూల్చేస్తాం | Sakshi
Sakshi News home page

నాలా ఆక్రమణలు సహించం కూల్చేస్తాం

Published Wed, Sep 28 2016 11:44 PM

ఘటనాస్థలిలో కమిషనర్,  మేయరు - Sakshi

గచ్చిబౌలి: నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలతోపాటు ఎఫ్‌టీఎల్, చెరువులు, కాలనీల్లోని అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి జనర్ధాన్ రెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్‌లోని దుర్గం చెరువు నుంచి రాయదుర్గంలోని మల్కంచెరువు వరకున్న నాలా చుట్టూరా ఉన్న నిర్మాణాలను, షౌగౌస్‌ హోటల్‌కు చెందిన వంటసామగ్రి భద్ర పరిచే గోడౌన్ కూల్చివేతను మేయర్‌ బొంతు రామ్మోహన్ తో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ వరదలొచ్చినప్పుడు జనం పడే కష్టాలను ప్రత్యక్షంగా చూశామన్నారు. నగరంలోని అక్రమ నిర్మాణాలపై వివక్ష లేకుండా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు 117 రోడ్లు దెబ్బతిన్నాయని, 180 కిలోమీటర్ల రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయని గుర్తించామన్నారు.

రోడ్ల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వానికి ?సవివరమైన నివేదికను అందించడం జరుగుతుందన్నారు.వర్షపునీటితో నిల్వ ఉండే ప్రాంతాలు, గుంతలు ఏర్పడిన రోడ్లను గుర్తించి వాటిని సిమెంట్‌ కాంక్రీట్‌తో పూడ్చివేసి రాకపోకలు సాఫీగా సాగేలా చేస్తామన్నారు.  ఉద్యోగులు, విద్యార్థులు అంతా కార్‌ పూలింగ్‌పై దృస్టి సారించాలని ఆయన కోరారు.
 

నిర్మాణాలన్నీ కూల్చాల్సిందే  : మేయర్‌
నాలాల ఆక్రమణలు, నిర్మాణాల నేపథ్యంలో డ్రామా కంపెనీలా చేయవద్దని, నాలా దగ్గరలో ఉన్న అన్ని నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని మేయర్‌ బొంతు రామ్మోహన్  అధికారులకు ఆయన స్పష్టం చేశారు. నాలా, చెరువులు, కుంటల వద్ద పట్టా భూములున్నవారు వ్యవసాయం చేసుకోవాలని, నిర్మాణాలను చేపట్టరాదని ఆయన స్పష్టం చేశారు.

నాలా సమీపంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న భారీ భవనంను చూస్తూ ఈ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని, వీటికి ఇచ్చిన అనుమతులను  త్వరలో రద్దు చేస్తామన్నారు. శేరిలింగంపల్లి తహశీల్దార్‌ మధుసుధన్  శేరిలింగంపల్లి సర్కిల్‌ ?–11 డీసీ మనోహర్, ఏసీపీ కృష్ణమోహన్ , డీఈ కిష్టప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.




 

Advertisement

తప్పక చదవండి

Advertisement