Sakshi News home page

ధిక్కరిస్తున్నారేం!

Published Sat, Jun 25 2016 8:47 AM

ధిక్కరిస్తున్నారేం!

జిల్లా ఎస్పీ, నరసాపురం ఎమ్మెల్యేకు జిల్లా అదనపు జడ్జి నుంచి షోకాజ్ నోటీసులు
జూలై 1న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు

నరసాపురం : అనుచరులతో కోర్టు ఆవరణలోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అతని సోదరుడు పటేల్‌నాయుడు, వారి అనుచరులపై చార్జిషీట్ నమోదు చేయడంలో చోటుచేసుకున్న జాప్యంపై నరసాపురం అదనపు జిల్లా జడ్జి పి.కళ్యాణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 1న నరసాపురం ఏడీజే కోర్టుకు స్వయంగా హాజరై, వివరణ ఇవ్వాలని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, నరసాపురం సీఐ పి.రామచంద్రరావు, టౌన్ ఎస్సై బి.యుగంధర్‌కిరణ్‌కు ఆదేశాలిచ్చారు.

ఇదే కేసులో.. కోర్టు విలువలను గౌరవించకుండా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతోపాటు ఆయన సోదరుడు పటేల్ నాయుడుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘2015 ఆగస్ట్ 15న ఎమ్మెల్యే అతని అనుచరులతో వచ్చి కోర్టు ఆవరణలో నాతో గొడవకు దిగారు. జాతీయ జెండాను కాళ్లకిందవేసి తొక్కారు.  
 
 వందమందికి పైగా న్యాయవాదులు ప్రదర్శనగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి 22 నెలలు గడుస్తున్నా కనీసం చార్జిషీట్ వేయలేదు. జిల్లా అదనపు కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 15న ఇచ్చిన తీర్పులో ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి, గొడవకు కారణమైన ఎమ్మెల్యే  మాధవనాయుడు, అతని అనుచరులపై చార్జిషీట్ ఫైల్ చేయాలని ఆదేశించింది. 2015 ఏప్రిల్ 15న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్యేకు రూ.1000 జరిమానా విధించింది. ఈ కేసులో నాతో సహా, 20మంది సాక్షులను విచారించి కూడా, ఇప్పటివరకూ ఎందుకు చార్జిషీట్ నమోదు చేయలేదు’ అని జడ్జి కళ్యాణరావు ప్రశ్నించారు.
 
 ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒక న్యాయస్థానానికి, జడ్జికి సంబంధించిన విషయంలోనూ పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజకీయ పలుకుబడితో ఈ క్రిమినల్ కేసునుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని జడ్జి మండిపడ్డారు. పోలీసుల తీరు, ఎమ్మెల్యే వ్యవహార శైలివల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం కలిగే అవకాశం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ప్రభుత్వ విభాగాలు రాజ్యాంగపరంగా వాటి విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైన సందర్బాల్లో న్యాయవ్యవస్థ తానంతట తాను జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని కంటెంట్ ఆఫ్ కోర్టు రూల్స్ 9(4) కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు జడ్జి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే అధికారాన్ని ఉపయోగించి, పోలీసుల సహకారంతో ఈ కేసును మిస్టేక్ ఆఫ్ యాక్ట్‌గా రిఫర్  చేయించేందుకు ప్రయత్నించడం దారుణమని షోకాజ్ నోటీసులో జడ్జి ఆవేదన వెలిబుచ్చారు. ఇదిలావుంటే ఈ వ్యవహారానికి సంబంధించి జడ్జి కళ్యాణరావు ఇటీవల సుప్రీంకోర్టుకు, ప్రధానమంత్రికి, హైకోర్టుకు, మానవ హక్కుల సంఘానికి లేఖలు రాసిన విషయం విదితమే.

Advertisement

తప్పక చదవండి

Advertisement