‘పశ్చిమ’ను ఆదర్శంగా తీసుకోండి | Sakshi
Sakshi News home page

‘పశ్చిమ’ను ఆదర్శంగా తీసుకోండి

Published Thu, Sep 29 2016 10:23 PM

‘పశ్చిమ’ను ఆదర్శంగా తీసుకోండి

ఏలూరు (మెట్రో) : పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వినూత్న రీతిలో ప్రవేశపెట్టిన పౌరసేవల విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అమల్లోకి తీసుకోవాలని, ఈ విధానంలో పశ్చిమను ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్‌లో రెండో రోజు నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వివిధ జిల్లాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ పౌర సేవలపై ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జిల్లాలోని పంచాయతీల్లో ఇళ్ల పన్ను, నీటి పన్ను, ప్రజలకు ఆదాయ, నివాస, కుల, జనన మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు వివిధ రకాల పౌర సేవలను ఆన్‌లైన్‌ ద్వారా ప్రజలు ఇంటి వద్ద నుండే నేరుగా పొందే వెసులుబాటును కల్పించామని, దీని వల్ల జిల్లాలలో మంచి ఫలితాలు లభిస్తున్నాయని భాస్కర్‌ వివరించారు. రానున్న మూడేళ్లలో జిల్లాలో ఉద్యాన, మత్స్య, పశు తదితర రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement