ఇదేం ‘శిక్ష’ణ ? | Sakshi
Sakshi News home page

ఇదేం ‘శిక్ష’ణ ?

Published Tue, Aug 2 2016 11:01 PM

what is training programme

  • నీళ్లు పెట్టలేదు..కుర్చిలు వేయలేదు 
  • అసౌకర్యాల మధ్య వీటీడీఏ శిక్షణ తరగతులు 
  • ఆదిలాబాద్‌రూరల్‌ : ఇటీవల ఎన్నికైన వీటీడీఏ (విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ) సభ్యులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు మంగళవారం అసౌకర్యాల మధ్య ప్రారంభమయ్యాయి. కనీసం కూర్చునేందుకు కుర్చిలు.. తాగేందుకు నీళ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో సభ్యులు ఇబ్బంది పడ్డారు. ఇదేం ‘శిక్ష’ణ అని అసహనం వ్యక్తం చేశారు. 
    ఆదిలాబాద్‌ డివిజన్‌లోని వీటీడీఏ సభ్యులకు దశల వారీగా అవగాహన తరగతులు నిర్వహించేందుకు ఐటీడీఏ పీవో ఆదేశాలు మేరకు ముందస్తుగా తేదీలు ప్రకటించారు. సంబంధిత సభ్యులకు సమాచారం సైతం అందించారు. డివిజన్‌లోని ఆదిలాబాద్, బజార్‌హత్నూర్, బేల, బోథ్, గుడిహత్నూర్, జైనథ్, తలమడుగు, తాంసి మండలాల వీటీడీఏ సభ్యులకు పట్టణంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల కళాశాల ఆవరణలోని యూత్‌ట్రై నింగ్‌ సెంటర్‌లో అవగాహన తరగతులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మండలానికి చెందిన వీటీడీఏ సభ్యులకు రెండురోజులపాటు ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖ అధికారులతో అవగాహన కల్పించాల్సి ఉంది. మంగళవారం తొలి రోజు ఆదిలాబాద్, బజార్‌హత్నూర్‌ మండలాల సభ్యులకు ఉదయం 10 గంటల నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించాలి. కానీ అలా జరగలేదు. ఆదిలాబాద్‌ మండలంలో 117, బజార్‌హత్నూర్‌ మండలంలో 141 మంది వీటీడీఏ సభ్యులు ఉన్నారు. వర్షం పడుతున్నా వీరు ఉదయం 10 గంటల కంటే ముందుగానే యూత్‌ ట్రై నింగ్‌ సెంటర్‌కు చేరుకున్నారు. కానీ ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదు. సభ్యులు కూర్చునేందుకు కుర్చిలూ  తెప్పించలేదు. అవగాహన తరగతులు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో నిలబడ లేక సభ్యులు ఇబ్బంది పడ్డారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తీరిగ్గా కుర్చిలు తెప్పించారు. ఒంటి గంట ప్రాంతంలో అవగాహన తరగతులు ప్రారంభించారు. శిక్షణ తరగతులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సుదుర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఏర్పాట్ల బాధ్యతలను రెవెన్యూ అధికారులకు అప్పగిస్తూ ఐటీడీఏ వారి ఖాతాల్లో నిధులు జమ చేసింది. అవగాహన తరగతులకు హాజరయ్యే వారికి టీ, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం వరకు వారికి కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదని వీటీడీఏ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
    సమన్వయ లోపం 
    వీటీడీఏ సభ్యులకు ఆయా శాఖల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. కాని వీటీడీఏ సభ్యులకు శిక్షణ ఉందన్న సమాచారం కూడా తమకు తెలియదని కొన్ని శాఖల అధికారులు చెప్పడం గమనార్హం. బజార్‌హత్నూర్‌ మండలానికి చెందిన ఏ ఒక్క అధికారి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా సభ్యులకు అవగాహన కల్పించేందుకు ట్రై నింగ్‌ సెంటర్‌కు రాలేదు. ఆదిలాబాద్‌ మండల అధికారులతోనే వారికి అవగాహన తరగతులు కొనసాగించారు. 
    ఆర్డీవో ఆగ్రహం
    వీటీడీఏ సభ్యులకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతుల కోసం సకాలంలో ఏర్పాట్లు చేయకపోవడంతో ఆర్డీవో సంజీవరెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే శిక్షణ తరగతులను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఎలాంటì  అనుమానాలు ఉన్నా అధికారులను అడిగి నివత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ వర్ణ, ఎంపీడీవో రవీందర్, ఏటీడబ్ల్యూవో చంద్రమోహన్, పీఆర్‌ జేఈ మనోహర్, ఈజీఎస్‌ ఏపీవో శామ్యూల్, ఈవోపీఆర్డీ సుదర్శన్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ సతీశ్, పంచాయతీ కార్యదర్శులు అనిల్‌కుమార్, ఖలీం, చంద్రశేఖర్, మహేందర్, శ్రీధర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
     
     

Advertisement
Advertisement