‘నీరూ’ తరలుతోంది.. | Sakshi
Sakshi News home page

‘నీరూ’ తరలుతోంది..

Published Wed, Sep 7 2016 11:17 PM

నీటిపారుదల శాఖ డివిజన్‌ కార్యాలయం

  • పాల్వంచ ఇరిగేషన్‌ పరిధి నుంచి 324 చెరువులు ఔట్‌
  • 9 మండలాలకు పరిమితమైన పాల్వంచ డివిజన్‌
  • సత్తుపల్లి డివిజన్‌ కలిస్తే మరింతగా పెరగనున్న విస్తీర్ణం
  •  
    పాల్వంచ: 15 ఏళ్ల క్రితం ఏర్పాటైన పాల్వంచ ఇరిగేషన్‌ డివిజన్‌ ముక్కలు కానుంది. ఈ డివిజన్‌ నుంచి 324 చెరువులు బయటకు వెళ్లనున్నాయి. ఇప్పటి వరకు 12 మండలాలలో ఉన్న నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖ (ఇరిగేషన్‌) డివిజన్‌ ఇక మీదట 9 మండలాలకు పరిమితం కానుంది. పాల్వంచ ఇరిగేషన్‌ డివిజన్‌ నుంచి మూడు మండలాలు వివిధ జిల్లాల్లోకి వెళ్లనున్నాయి.
     
    డివిజన్‌లో ఇప్పటి వరకు పాల్వంచ, కొత్తగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాలు ఉండగా దీనిలో గార్ల, బయ్యారం మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్లనున్నాయి. కామేపల్లి ఖమ్మం జిల్లాలోకి చేరుతుండగా ఈ డివిజన్‌ 9 మండలాలకు పరిమితం కానుంది. ఇప్పటి వరకు అశ్వారావుపేట డివిజన్‌లో ఉన్న అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాలు ఈ డివిజన్‌ పరిధిలోకి వస్తే విస్తీర్ణం పెరగనుంది. 12 మండలాల నుంచి 13 మండలాలకు ఈ ఇరిగేషన్‌ డివిజన్‌ చేరుతుంది. 
     
    చెరువులు అటూఇటూ
    పాల్వంచ ఇరిగేషన్‌ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు 1,660 చెరువులున్నాయి. గార్ల, బయ్యారం మండలాల పరిధిలోని 222 చెరువులు మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్తున్నాయి. కామేపల్లి మండలంలోని 102 చెరువులు మాత్రం ఖమ్మం జిల్లాలో చేరనున్నాయి. ఈ మూడు మండలాల్లో కలిపి 324 చెరువులు పోతే 1336 చెరువులు పాల్వంచ డివిజన్‌ పరిధిలో ఉంటాయని ఇరిగేషన్‌ అధికారులు ధ్రువీకరించారు. ఆయా చెరువుల కింద 14,898 ఎకరాల ఆయకట్టు ఉంది. బయ్యారం పెద్దచెరువు మీడియం ఇరిగేషన్‌ కూడా మానుకోట జిల్లాలోకి వెళ్లడంతో 7,200 ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతుంది. 
     
    ‘కొత్త’గా 730 చెరువులు: వెంకటేశ్వరరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ 
    పాల్వంచ ఇరిగేషన్‌ డివిజన్‌ పరిధిలోని గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాల నుంచి 324 చెరువులు ఇతర జిల్లాల్లోకి వెళ్తున్నాయి. అదే సమయంలో సత్తుపల్లి డివిజన్‌లో ఉన్న అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల పరిధిలోని 730 చెరువులు పాల్వంచ ఇరిగేషన్‌ డివిజన్‌ పరిధిలోకి రానున్నాయి. ఇది ఖాయమైతే ఇరిగేషన్‌ డివిజన్‌ విస్తీర్ణం పెరుగుతుంది తప్ప తగ్గదు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement