సైకో సాంబ ఆచూకీ ఎక్కడ? | Sakshi
Sakshi News home page

సైకో సాంబ ఆచూకీ ఎక్కడ?

Published Mon, Aug 12 2013 12:29 AM

Where the whereabouts of sycho Samba?

ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్ : సైకో సాంబ పరారై ఏడాది గడిచింది. నేటికీ అతన్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. నాలుగు జిల్లాల పోలీసులను మూడేళ్లపాటు ముచ్చమటలు పట్టించిన సైకో సాంబ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తప్పిం చుకుని పరారయ్యాడు. అదుపులో ఉన్న సాంబ తప్పించుకోవడానికి కారణమైన పోలీ సులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా చార్జి మెమోతో సరిపెట్టడం గమనార్హం.

ప్రత్తిపాడు గ్రామానికి చెందిన రాచకొండ సాంబశివరావు వ్యసనాలకు బానిసగా మా 2005 నుంచి చోరీలు ప్రారంభించాడు. అతనిపై మొదట విజయవాడ సిటీలో చోరీ కేసు నమోదైంది. రైలు మార్గాల ద్వారా సంచరిస్తూ రాత్రి సమయాల్లో మహిళలు ఒంటరిగా ఉండే నివాసాల లక్ష్యంగా దాడులకు పాల్పడి బంగారం, నగదు దోచుకునేవాడు. మూడేళ్లల్లో అతనిపై గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 80కి పైగా కేసులు నమోదయ్యాయి.

గత ఏడాది మార్చి, ఏప్రిల్, మేలో గుంటూరు జిల్లా పోలీసుల కంటి మీద కునుకు లేకుండా చేశాడు. సైకో సాంబ ఒంటరిగా నివసించే మహిళల ఇళ్లల్లోకి చొరబడి అత్యాచారాలు, హత్యలు చేస్తూ అత్యంత ప్రమాదకారిగా మారినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. గత ఏడాది జూలై 11న మంగళగిరి హాయ్‌ల్యాండ్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్, హోం గార్డులు సైకో సాంబను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు గుంటూరు క్రైమ్ పోలీసులకు అప్పగించారు.

చోరీ చేసిన సొత్తు పలు ప్రాంతాల్లో దాచి ఉంచానని, వాటన్నిం టిని అప్పగిస్తానని సైకో సాంబ పోలీసులను నమ్మించి ముందుగా గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఏమీ లభించకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా కృష్ణా జిల్లా కొండపల్లిలోని కొండల్లో దాచినట్టు చెప్పాడు. దీంతో గుంటూరు అర్బన్ క్రైమ్ డీఎస్పీ రవీంద్రబాబు పర్యవేక్షణలో సీఐ కె.సుధాకర్‌బాబు నేతృత్వంలో నెల్లూరు సీఐ రమేష్, ఎస్‌ఐ సురేష్‌లతోపాటు ముగ్గురు క్రైమ్ కానిస్టేబుళ్ల బందోబస్తు నడుమ సైకో సాంబను కొండపల్లి కొండల్లోకి తీసుకెళ్లారు.

కాళ్లు, చేతులకు బేడీలువేసి ఉన్నప్పటికీ పోలీ సులకు మస్కా కొట్టి సమీపంలోని లోయలోకి దూకి సైకో సాంబ పరారయ్యాడు. వెంటనే 300 మంది ప్రత్యేక బలగాలతో కొండపల్లి కొండల్లో మూడు రోజులు కూంబింగ్ నిర్వహించినా సాంబ పట్టుబడలేదు. అతను కాళ్లకు వేసిన గొలుసు మాత్రం పోలీసులకు అక్కడ లభించింది. పోలీసులు వెనుదిరిగి వచ్చారు. ఎస్కార్ట్ ఏర్పాటు చేసి తీసుకెళ్లినప్పటికీ సునాయాసంగా సైకో సాంబ పరారవడంపై ప్రజ ల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇందులో పోలీసుల పాత్రపైనా ఆరోపణలు వస్తున్నాయి.

ఖమ్మం, వరంగల్, నల్గొండ తదితర జిల్లాలకు సైకో సాంబ ఫొటోలను పంపించి ఆచూకి గుర్తిస్తే సమాచారం తెలపాలంటూ ప్రచారం చేసి చేతులు దులుపుకున్నారు. సైకో పరారైన సంఘటనపై అప్పటి అర్బన్ ఎస్పీ ఆకే రవికృష్ణ ఆయా అధికారులకు చార్జి మెమోలు జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అప్పటి ఐజీ హరీష్‌కుమార్ గుప్తాకు నివేదిక అందజేశారు. ఈ ఏడాదిలో ఐజీలు హరీష్‌కుమార్‌గుప్తా, రవి గుప్తా ఇక్కడ విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్లారు. ఈ ఏడాది జూన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐజీ సునీల్‌కుమార్ పెం డింగ్ ఫైళ్లను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఆయనైనా సైకో కేసులో అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అని పోలీస్‌శాఖలో చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement