విస్తరణ.. మలుపు! | Sakshi
Sakshi News home page

విస్తరణ.. మలుపు!

Published Thu, Sep 15 2016 12:39 AM

విస్తరణ.. మలుపు! - Sakshi

రోడ్డు వెడల్పు పనుల్లో అడ్డంకి
– టీడీపీ నేత భవంతి విషయంలో ఆచితూచి
– అనుమతి లేకున్నా అక్రమ కట్టడం
– విస్తరణ పనుల కంటే ముందుగానే నిర్మాణం
– చేష్టలుడిగి చూస్తున్న మున్సిపల్‌ యంత్రాంగం
– నిలిచిపోయిన రోడ్డు వెడల్పు పనులు
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రోడ్డు వెడల్పు పనుల్లోనూ అధికార పార్టీ హవా కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రై వేటు స్థలాలను అడ్డంగా కొట్టేసిన కార్పొరేషన్‌ అధికారులు.. సరిగ్గా రోడ్డు వెడల్పు పనులు అవసరమైన చోట అధికార పార్టీ నేత భవంతి ఉందనే కారణంగా నెమ్మదించారు. పైగా రోడ్డు నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే 10 అడుగుల స్థలం ఇచ్చేశానని చెబుతూ.. కనీసం అనుమతి తీసుకోకుండానే నిర్మాణాలు కూడా చేపట్టారు. అంతేకాదు.. ఈ భవంతి కోసం ఏకంగా రోడ్ల వెడల్పు పనులను కూడా నెమ్మదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా పుష్కరాల పనుల్లో జలమండలి నుంచి రైల్వే స్టేషన్‌ వరకు చేపట్టిన రోడ్డు వెడల్పు పనుల్లో సాగుతున్న తతంగం ఇదీ. వాస్తవానికి రైల్వే స్టేషన్‌కు సరిగ్గా ఎదుటనున్న ఈ భవంతి వద్ద రోడ్డు వెడల్పు చేయకపోతే మొత్తం రోడ్ల విస్తరణ పనులకే అర్థం లేకుండా పోతుంది. ఎందుకంటే సరిగ్గా ఇక్కడే ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ భవంతిని కూల్చకుండా.. 10 అడుగుల స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చాడనే పేరుతో కనీసం అనుమతి లేకుండా నిర్మాణం సాగిస్తున్నా కార్పొరేషన్‌ అధికారులు కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ఇందుకు ఆయన అధికార పార్టీ నేత కావడమే కారణమని తెలుస్తోంది.
 
హడావుడి పనులు
వాస్తవానికి కృష్ణా పుష్కరాలల్లో భాగంగా కర్నూలు కార్పొరేషన్‌లో అనేక పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కోటి రూపాయలకు పైగా వ్యయంతో ఐదు రోడ్ల కూడలి(జలమండలి) నుంచి రైల్వే స్టేషన్‌ వరకు రోడ్డు వెడల్పు, డివైడర్ల ఏర్పాటుకు టెండర్లను పిలిచారు. ఈ పనులను అధికార పార్టీ నేత చేజిక్కించుకున్నారు. మొదట్లో జెట్‌ స్పీడుతో పనులు సాగాయి. పుష్కరాల్లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవి కాస్తా కాకపోవడంతో ఇప్పుడు పనులు నెమ్మదించాయి. ఇందులోనూ మొదట్లో ఇటు జలమండలి కార్యాలయం, అదనపు ఎస్పీ కార్యాలయం వంటి ప్రభుత్వ స్థలాలతో పాటు కేవీఆర్‌ కాలేజీకి చెందిన ప్రహరీ గోడను కూడా అంతే వేగంగా కూల్చివేశారు. అయితే, అధికార పార్టీ నేత భవనం జోలికి మాత్రం పోకుండా జాగ్రత్తపడ్డారు. 
 
అక్కడికొచ్చే సరికి..
పుష్కరాల్లో భాగంగా చేపట్టిన ఈ పనులు మొదట్లో వేగంగా చేపట్టారు. తీరా అధికార పార్టీకి చెందిన నేత భవంతి రావడంతో పనులు నెమ్మదించాయి. సరిగ్గా ఈ భవనానికి ఎదురుగా ఉన్న షాపులను కూల్చివేసిన అధికారులు ఈ భవనం జోలికి మాత్రం పోలేదు. తీరిగ్గా కోర్టుకు వెళ్లి పద్ధతి ప్రకారం(డ్యూ ప్రాసెస్‌) రోడ్ల వెడల్పు చేపట్టాలని ఆదేశాలు తెచ్చే వరకూ అధికారులు ఆగారు. తీరా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మీ భవంతిని కూలుస్తామని నోటీసులు జారీచేశారు. ఇందుకు స్పందించిన సదరు అధికార పార్టీ నేత, భవన యజమాని టైటిల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌(టీడీఆర్‌) కింద 10 అడుగుల స్థలం ఇస్తానని ముందుకొచ్చారు. అయితే, దీనిపై ఇంకా కార్పొరేషన్‌ అధికారులు మార్కింగ్‌ కూడా చేయలేదు. ఇవేవీ జరగకుండా కనీసం అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు మాత్రం చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement