కసాయి భార్య | Sakshi
Sakshi News home page

కసాయి భార్య

Published Sun, Mar 26 2017 1:00 PM

కసాయి భార్య - Sakshi

వివాహేతర సంబంధంతో భర్త హత్య
సహజ మరణమని నమ్మించి దహన సంస్కారాల నిర్వహణ
నెలలు గడుస్తున్నా కిరాయి రౌడీలకు డబ్బులివ్వని వైనం
వాహన తనిఖీల్లో పట్టుబడి హత్య విషయం కక్కిన నిందితులు
విలేకర్ల సమావేశంలో వెల్లడించిన ఏసీపీ భీమారావు


ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ):
కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చింది. సహజ మరణంగా అందర్నీ నమ్మించి దహన సంస్కారాలు చేయించింది. ఇది జరిగి నెలలు గడిచిపోయింది. అంతా సద్దుమణిగిపోయిందనుకున్న తరుణంలో నిందితులతో సహ మృతుడి భార్య కూడా పోలీసులకు చిక్కింది. ఎయిర్‌పోర్ట్‌ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ కేసు వివరాలను ఏసీపీ భీమారావు వెల్లడించారు. విశాఖపట్నం ఎస్‌ఈ రైల్వేలో కలాసీగా పని చేస్తున్న డబ్బూరి సంతోష్‌కుమార్‌(30), నిందితురాలు డబ్బూరి కరుణ జ్యోతి కలసి రెడ్డి కంచరపాలెం సుభాష్‌నగర్‌లో నివాసముండేవారు. కరుణ జ్యోతికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. దీంతో పథకం ప్రకారం భర్తను తప్పించినట్లయితే ఆయన ఉద్యోగంతో పాటు ప్రియునితో సహజీవనం చేయొచ్చని భావించింది. అంతే పథకం ప్రకారం కిరాయి రౌడీలతో రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. గతేడాది నవంబర్‌ 27 రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సంతోష్‌కుమార్‌ను కిరాయి రౌడీలు హతమార్చారు. తన భర్త మద్యం ఎక్కువగా తీసుకోవడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మించింది. సహజ మరణంగా నమ్మిన వారంతా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దహన సంస్కరాలు నిర్వహించేశారు.

పోలీసుల తనిఖీల్లో దొరికారు..:
ఎన్‌ఏడీ కూడలిలో పోలీసులు శనివారం వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంగా తిరుగుతున్న ముసురి బాలరాజు, పిల్లా అప్పన్నను ప్రశ్నించారు. వారు పొంతన లేని వివరాలు చెబుతుండడంతో అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో గతంలో హత్య చేసిన విషయాలు బట్టబయలు చేశారని ఏసీపీ తెలిపారు. తమతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేదని, హత్య చేసిన సమయంలో రూ.2 వేలు మాత్రమే ఇచ్చారని వారు చెప్పారన్నారు. ఇప్పుడు మిగతా సొమ్ము కోసం విశాఖ వచ్చినట్టు నిందితులు ఒప్పుకున్నారని వివరించారు. ఈ మేరకు కరుణ జ్యోతిని, డుంబ్రిగుడ మండలానికి చెందిన కిరాయి రౌడీలు ముసిరి బాలరాజు, గుజ్జల చిరంజీవి, పిల్లా అప్పన్నలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. చిరంజీవిపై ఇప్పటికే హత్య, అత్యాచారం కేసులతో పాటు రౌడీ షీట్‌ ఉందన్నారు. పరారీలో ఉన్న ప్రియుడితో పాటు మరికొందరు నిందితుల కోసం రెండు బృందాలు తిరుగుతున్నాయని ఏసీపీ వివరించారు. ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర వహించిన ఎస్‌ఐ జె.సురేష్, సీఐ ప్రభాకర్‌లను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కంచరపాలెం సీఐ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement