చంద్రబాబుకు పేదలే బుద్ధిచెబుతారు | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు పేదలే బుద్ధిచెబుతారు

Published Wed, Aug 3 2016 8:25 PM

చంద్రబాబుకు పేదలే బుద్ధిచెబుతారు - Sakshi

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వరు
గుడివాడ టౌన్‌ : 
ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో శ్రద్ధ్దచూపని చంద్రబాబునాయుడు అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణాజిల్లా 30వ మహాసభ జరిగింది. వందలసంఖ్యలో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఉపాధిహామీ పనుల్లో ప్రభుత్వ సొమ్మును కార్మికులు దోచేస్తున్నారని విమర్శించిన నాయకులు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు ఎవరి సొమ్ము తింటున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన ఎంపి సుజనా చౌదరి రూ.400 కోట్లు బ్యాంకు రుణం ఎగవేస్తే చూస్తూ ఊరుకున్న బాంకు అధికారులు, పేద వ్యవసాయ కూలీల చిన్న చిన్న అప్పులపై జప్తులని విరుచుకుపడడం ఎంతవరకు సబబని అన్నారు. త్వరలోనే చంద్రబాబుకు పేదలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు.
దోచుకుంటున్న తెలుగుతమ్ముళ్లు
రైతులు కూలీల నుంచి చంద్రబాబు బలవంతంగా లాక్కున్న భూములను త్వరలోనే పోరాటాల ద్వారా తిరిగి తీసుకుంటామని వెంకటేశ్వర్లు అన్నారు. అందుకే వ్యవసాయ కార్మిక సంఘ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా బందరు పోర్టుకు 5000 ఎకరాలు సరిపోతున్నాయని చెప్పి ఇప్పుడు 1,20,000 ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని చెప్పారు. జన్మభూమి కమిటీలు, ఇంకుడు గుంతలు, నీరు–చెట్టు, వనం–మనం, చంద్రన్న కానుకలు, ఉచిత ఇసుక వంటి పథకాలు ప్రవేశపెట్టి తెలుగు తమ్ముళ్ల జేబులు నింపుతున్నారని విమర్శించారు.  కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి కోట కల్యాణ్, జిల్లా అధ్యక్షుడు ఎం.ప్రభాకర్, జిల్లా మాజీ అధ్యక్షుడు సీహెచ్‌.రవి, ఉపాధి మేట్ల సంఘ జిల్లా అధ్యక్షురాలు ప్రమీల, డివిజన్‌ కార్యదర్శి ఎం.రాజేష్, తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement