వ్యాపిస్తున్న జ్వరాలు..వణుకుతున్న జనాలు | Sakshi
Sakshi News home page

వ్యాపిస్తున్న జ్వరాలు..వణుకుతున్న జనాలు

Published Sun, Jul 17 2016 3:29 AM

వ్యాపిస్తున్న జ్వరాలు..వణుకుతున్న జనాలు - Sakshi

జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన జ్వరం కేసులు 619
వీటిలో మలేరియా 441, డెంగీ 15, టైఫాయిడ్ 163

ఖమ్మం వైద్య విభాగం : జిల్లావాసులను సీజనల్ వ్యాధులైన జ్వరాలు వణికిస్తున్నాయి. వర్షాలు, వరదలతో ఏజెన్సీలో ఇప్పటికే అనేకమంది మంచాన పడ్డారు. జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,93,187 మంది నుంచి రక్త నమూనాలను ప్రభుత్వ వైద్యులు పరీక్షించారు. 441 మందికి మలేరియా, 15 మందికి డెంగీ, 163 మందికి (జూన్‌లో 93, జూలైలో 70) టైఫాయిడ్ సోకినట్టుగా గుర్తించారు. ప్రయివేటు ఆసుపత్రులు, ఆర్‌ఎంపీ వైద్యుల వద్దకు వెళ్లిన కేసులు ఇంకా ఎన్ని ఉంటాయో..?!

 కానరాని దోమ తెరలు
జిల్లాలోని మారుమూల గ్రామాల్లో 2012లో 2.60 లక్షల దోమ తెరలను వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దోమ తెరలు పంపిణీ చేయలేదు. ఈ ఏడాది 1.40 లక్షల దోమతెరలు కావాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటివరకూ స్పందన లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. ‘‘దోమ తెరలను వెంటనే అందేలా చూస్తా’’నని ఇచ్చిన హామీ గాల్లో కలిసింది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటింది. వర్షాలు, గోదావరి వరదలతో ప్రధానంగా ఏజెన్సీ (పాల్వంచ, భద్రాచలం డివిజన్లలోని) గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు ఎక్కువయ్యాయి. అందుకే, ఆయా గ్రామాల్లో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. వ్యాధుల నివారణకు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆరోగ్య శాఖ సమన్వయంగా కృషి చేస్తే ఫలితం కనిపించేంది. కానీ, ఈ మూడు శాఖల మధ్య సమన్వయ లోపం కూడా వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది.

జాగ్రత్తలు తీసుకుంటున్నాం
ఇల్లెందు: జిల్లాలో జ్వరాల వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మలేరియా అధికారి(డీఎంఓ) డాక్టర్ రాంబాబు చెప్పారు. ఇల్లెందు మండలంలోని డెంగీ, మలేరియా ప్రభావిత ప్రాంతాలైన కాకతీయనగర్, రొంపేడును ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం, ఇల్లెందులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి నెల 7 నుంచి 17వ తేదీ వరకు గ్రామాల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1266 గ్రామాల్లో సుమారు 5.22 లక్షల మందిని సర్వే చేశామన్నారు. 658 గ్రామాలను డెంగీ ప్రభావిత సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్టు చెప్పారు. సమస్యాత్మక గ్రామాల్లో ఇప్పటికే 166 వైద్య శిబిరాలు నిర్వహించినట్టు, 464 గ్రామాల్లో ఇండోర్ రెసిడ్యూల్ స్ప్రే పూర్తిచేసినట్టు చెప్పారు.

ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను పీహెచ్‌సీల్లో సిద్ధంగా ఉంచామన్నారు. ఏ జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్స్ తగ్గుతాయని, అంతమాత్రాన భయపడాల్సిన అవసరం లేదన్నారు. జ్వరం వచ్చిన వెంటనే ప్యారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుని, ఒంటిని తడి గుడ్డతో పూర్తిగా తుడిస్తే జ్వరం తగ్గే అవకాశం ఉంటుందన్నారు. అంతకీ తగ్గనప్పుడు దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలన్నారు. ఇల్లెందు పట్టణంలోని కాకతీయనగర్, మండలంలోని రొంపేడులో; గుండాల మండలంలోని గుండాల, ఆళ్లపల్లిలో డెంగీ లక్షణాలు ఉన్నాయన్నారు. నర్సాపూర్, మంగపేట, ఎదిర, అశ్వాపురం తదితర ప్రాంతాల్లో మలేరియా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. మురుగు నీటిలో జీవించే దోమలు కుట్టితే పైలేరియా వ్యాధి సోకుతుందన్నారు. జిల్లాలో ఇటువంటివి 2360 కేసులు ఉన్నాయన్నారు. వీరికి ఆసరా పింఛన్ కోసం ప్రతిపాదించామన్నారు.

ఇలా వస్తాయి... ఇవీ లక్షణాలు
మలేరియా: ‘ఎనాఫలిస్’ అనే ఆడ దోమ కాటుతో వస్తుంది. ఇది మనిషి నుంచి రక్తంతోపాటు కొన్ని సూక్ష్మ జీవులను పీల్చుకుంటుంది. ఈ సూక్ష్మజీవులు దోమ ఉదరంలో 10 నుంచి 14 రోజుల్లో పెరుగుతాయి. ఆ తరువాత, ఈ దోమ ఎవరినైనా కుట్టినప్పుడు.. దానిలోని సూక్ష్మజీవులు (ఆ వ్యక్తి) శరీరంలోకి ప్రవేశించి, మలేరియా జ్వరం వస్తుంది. ఇది ముందుగా చలి, వణుకుతో మొదలవుతుంది. తల, ఒళ్లు నొప్పులు వస్తాయి. ఆ తరువాత తీవ్రమైన జ్వరం వస్తుంది. జ్వరం తీవ్రత తగ్గినప్పుడు విపరీతంగా చెమటలు పోస్తాయి. ఈ జ్వరం ప్రతి రోజుగానీ, రోజు విడిచి రోజుగానీ, నాలుగు రోజులకు ఒకసారిగానీ వస్తుంది. జ్వరం వచ్చిన వెంటనే మలేరియా పరీక్ష చేయించుకుంటే మంచిది.

 డెంగీ: ‘ఆర్ధ్రెటిస్’ జాతికి చెందిన సూక్ష్మజీవితో వస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందటానికి ‘ఏడిస్’ అనే ఈజిప్ట్ దోమలు ముఖ్య కారణం. ఇవి డెంగీ, చికున్‌గున్యా వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ఈ దోమలు పగటి పూట మాత్రమే కుడతాయి. వీటిని ‘టైగర్ దోమలు’ అని కూడా అంటారు. ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తల నొప్పి, కళ్ళు తెరవడం కూడా కష్టమవడం, కదిపితే నొప్పి రావడం, చర్మంపై దద్దుర్లు, కండరాలు.. కీళ్ళ నొప్పులు, అధిక దాహం, రక్తపోటు (బీపీ) పడిపోవటం.. ఈ లక్షణాలు ఉన్నట్టయితే డెంగీగానీ, చికున్‌గున్యాగానీ వచ్చినట్టుగా భావించి చికిత్స చేయించుకోవాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
నివాస పరిసరాల్లో రోజులతరబడి నీరు నిల్వ ఉండకుండా (పడేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, కుండలు, వాటర్ బాటిళ్లు, సిమెంట్ డ్రమ్ములు, వాడని రోళ్ళు, ఖాళీ డబ్బాలు, మురుగు కాల్వలు.. గుంతల్లో) చూసుకోవాలి.

నీరు నిల్వ ఉండే కుండలు, డ్రమ్ములు, ట్యాంకులు, కూలర్లు తదితరాలను కనీసంగా వారినికి ఒక్కసారైనా శుభ్రపరిచి ఆరబెట్టి, ఆ తరువాత వాడుకోవాలి.

నీరు నిల్వ ఉంచే పాత్రలు, నీటి తొట్టెలు, డ్రమ్ములు, ట్యాంకులపై సరైన రీతిలో మూతలు ఉంచాలి.

దోమ తెరలు, కిటికీలకు మెష్‌లు అమర్చుకోవాలి. నిండు దుస్తులు ధరించాలి.

కాయిల్స్, లిక్విడ్స్ ఓడోమాన్ వంటివి వాడాలి. ఇంట్లో వేపాకు పొగ కూడా వేసుకోవచ్చు.

దోమలు కుట్టకుండా వీలైనంత వరకు పగటిపూట పొడుగు చేతుల చొక్కా, పైజామా, ప్యాంట్, పంచె, కాళ్ళకు మేజోళ్లు వేసుకోవాలి.

తీవ్ర జ్వరం ఉన్నప్పుడు పారాసిటమల్ మాత్రలు వాడాలి. ఇతర వివరాలకు దగ్గరలోని ఏరియా ఆస్పత్రి... ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగాని, ఆరోగ్య కార్యకర్తనుగానీ సంప్రదించాలి.

Advertisement
Advertisement