Sakshi News home page

నానమ్మ.. నాకు దిక్కెవరమ్మా?

Published Fri, May 26 2017 4:11 PM

నానమ్మ.. నాకు దిక్కెవరమ్మా? - Sakshi

► చిన్నప్పుడే అమ్మానాన్నలు.. నిన్న వడదెబ్బతో నానమ్మ మృతి
► పెద్దదిక్కును కోల్పోవడంతో అనాథలైన అక్కాతమ్ముడు
► ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఆపసోపాలు పడుతున్న మునినాయక్‌  
 
త్రిపురారం (నాగార్జునసాగర్‌) : ఆ గిరిజన విద్యార్థికి విధి వింత పరీక్ష పెట్టింది. ఓవైపు బీటెక్‌లో చేరేందుకు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఉన్న పెద్ద దిక్కును కాస్త కోల్పోయేలా చేసింది. చిన్నతనంలోనే అమ్మానాన్నలు చనిపోయినా తనను పెంచి పోషించిన నానమ్మ గురువారం వడదెబ్బతో మృతి చెందడంతో అక్కాతమ్ముడు అనాథలయ్యారు. వివరాల్లోకి వెళ్లితే.. త్రిపురారం మండలం బొర్రాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధి బుడ్డితండాకు చెందిన ధనావత్‌ హరి, లక్ష్మి దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ఇద్దరు సంతానం. మొదటి సంతానంగా కుమార్తె  సుజాత, రెండో సంతానంగా కుమారుడు మునినాయక్‌ జన్మించాడు. 
 
హరికి వ్యవసాయ భూమి లేకపోవడంతో రెక్కల కష్టంతోనే కుటుంబం గడిచేది. ఈ క్రమంలో ధనావత్‌ హరి, లక్ష్మి దంపతులు అనారోగ్యంతో మృతి చెందడంతో మునినాయక్, అతని అక్క సుజాత దిక్కులేనివారయ్యారు. ఆ సమయంలో అతని నానమ్మ ధనావత్‌ తీత్రీ(75) వారికి పెద్దదిక్కైంది. వృద్ధురాలైన ధనావత్‌ తీత్రీ కొంతకాలంగా ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో తన మనుమడు, మనుమరాళ్లను సాకుతుంది. ఈ తరుణంలో   తీత్రీ గత నాలుగు రో జుల క్రితం కూలి పనులకు వెళ్లి ఎండకు అస్వస్థతకు గురైంది. నానమ్మ గురువారం తెల్లవారుజామున వడదెబ్బతో మృతి చెందింది. నానమ్మ మృత దేహంపై పడి రోదిస్తున్న అక్కా తమ్ము డిని చూసి తండావాసులు కంటతడి పెట్టారు. 
 
ధనావత్‌ మునికి విధి పెట్టిన పరీక్ష
మునినాయక్‌ను చిన్నతనం నుంచి నానమ్మ ధనావత్‌ తీత్రీ పెంచి పెద్దచేసింది. ఇటీవల నిర్వహించిన ఎంసెట్‌ ఫలితాల్లో ఇంజనీరింగ్‌ విభాగంలో 54వ ర్యాంకు సాధించాడు. కానీ ఆర్థిక పరిస్థితి అడుగు ముందుకు పడనీయడం లేదు. బీటెక్‌లో చేరేందుకు దాతల ఆర్థికసాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ముని చదువుకు అడ్డంకులు తొలగించేందుకు ఈనెల 25వ తేదీన ‘సరస్వతీపుత్రుడికి ఆర్థిక అడ్డంకి’ శీర్షికన ‘సాక్షి’ కథనాన్ని కూడా ప్రచురించింది. తన బీటెక్‌ చుదువుల ఖర్చుల కోసం ఎవరైన మనసున్న మారాజులు ముందుకు వచ్చి ఆర్థికసాయం చేయాలని వేడుకున్నాడు. ఈ క్రమంలో ఉన్న పెద్దదిక్కు కాస్త కనుమరుగవడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement