వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

Published Wed, Aug 24 2016 6:21 PM

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి - Sakshi

ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు 
డాక్టర్ల తప్పు లేదంటున్న సూపరింటెండెంట్‌ 
 
తెనాలి (మారీసుపేట): వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. జ్వరంతో బాధపడుతూ చికిత్సకు వచ్చిన ఆమెకు సరైన వైద్యం అందించటంలో నెలకొన్న జాప్యం వల్లే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో న్యాయం చేయాలంటూ కొద్దిసేపు ఆందోళన చేశారు. వారి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కాకుమాను మండలం పాండ్రుపాడుకు చెందిన కట్టా దేవమణి (48) కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం జ్వరం ఎక్కువ కావడంతో తెనాలి జిల్లా వైద్యశాలకు చికిత్స నిమిత్తం వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు డెంగీ వ్యాధి సోకిందని, ప్రాథమిక దశలోనే ఉందని చెప్పి వైద్యశాలలో చేర్పించారు. మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఒక్క వైద్యుడు కూడా వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయలేదు. ఈ క్రమంలో దేవమణిలో చలనం లేకపోవటం, శరీరం మొత్తం చెమటలు పట్టటం గమనించిన కుటుంబ సభ్యులు విషయాన్ని అక్కడ ఉన్న నర్సులకు చెపారు. వారు మేం ఏం చేయలేమని, డాక్టర్‌ వచ్చి పరీక్షలు చేయాలని సమాధానమిచ్చారు. దీంతో బుధవారం ఉదయం దేవమణి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఆ తర్వాత వచ్చిన డాక్టర్లు ఆమెను పరీక్షించి మరణించినట్లు చెప్పారన్నారు. సకాలంలో వైద్యులు పరీక్షించి ఉంటే దేవమణి ప్రాణాలు నిలిచేవని వారు విలపిస్తూ చెప్పారు. కేవలం డాక్టర్‌ నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దేవమణి భర్త వీరయ్య ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారని, ఇద్దరు కుమారులలో ఒకరు పాలిటెక్నిక్‌ చదువుతున్నాడని, మరొకరు టాపీ పని చేస్తున్నాడని బంధువులు తెలిపారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ దేవమణి కుమారుడిని చదివిస్తోందన్నారు. విషయం తెలుసుకున్న త్రీ టౌన్‌ సీఐ అశోక్‌ కుమార్‌ జిల్లా వైద్యశాలకు వచ్చి వివరాలు సేకరించారు. దీనిపై జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సులోచనను వివరణ కోరగా దేవమణి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందలేదన్నారు. వైద్యులు నిత్యం ఆమె ఆరోగ్య పరిస్ధితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారని, బంధువుల ఆరోపణలో వాస్తవం లేదని తెలిపారు.

Advertisement
Advertisement