ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. కానీ..! | Sakshi
Sakshi News home page

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. కానీ..!

Published Mon, Mar 28 2016 2:12 AM

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. కానీ..! - Sakshi

ప్రేమకు బలైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ప్రేమికురాలిని అరెస్ట్ చేయాలని ఆందోళన
న్యాయం చేయాలని కోరుతున్న మృతుడి కుటుంబసభ్యులు

 
భవానీపురం : ఔను వాళ్దిద్దరూ ఇష్టపడ్డారు. ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. కలిసి సినిమాలకూ షికార్లకు తిరిగారు. జాతకాలు చూపించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. నీతో నాకు పెళ్లి కుదరదని ప్రేయసి తెగేసి చెప్పింది. ఫోన్లు చెయ్యొద్దంది. చివరికి ప్రియుడిపై పోలీస్ కేసు పెట్టింది. ప్రియురాలు చేసిన మోసానికి తట్టుకోలేని ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కష్టపడి పెంచుకున్న ఏకైక కుమారుడు ప్రేమకు బలైపోవడంతో ఆ పేద తల్లిదండ్రులు హృదయవిదారకంగా విలపిస్తున్నారు. తమకు ఆసరాగా నిలుస్తాడనుకున్న చెట్టంత కొడుకు తనువు చాలించడంతో రోదిస్తున్న తల్లిదండ్రులను చూసి స్థానికులు కంటతడిపెట్టుకున్నారు.

 బాధితుల కధనం..
ఆటోడ్రైవర్‌గా పని చేసే షేక్ ఖాజా, షకీల దంపతులు చిట్టినగర్ ఈద్గామహల్ వెనుక బజార్‌లో నివసిస్తున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తాజుద్దీన్(25) నగరంలోని కేజే సిస్టమ్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతనికి సత్యనారాయణపురానికి చెందిన ఒక యువతితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. కలిసి మెలిసి సినిమాలకు, షికారులకు తిరిగారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ 10 రోజుల క్రితం ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు.. నన్ను కలవటానికి ప్రయత్నించ వద్దు.. ఫోన్ చెయ్యెద్ద’ని తాజుద్దీన్‌కు ఖరాఖండిగా చెప్పింది.

శనివారం సాయంత్రం తాజుద్దీన్ ఆ యువతికి ఫోన్ చేయటంతో తాను ఒక వ్యక్తితో సినిమా హాల్లో ఉన్నానంటూ మెసేజ్ పెట్టింది. దీంతో కలత చెందిన తాజుద్దీన్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 సత్యనారాయణపురం పీఎస్‌లో కేసు..
తాజుద్దీన్ తనను వేధిస్తున్నాడంటూ ఆ యువతి ఈనెల 20న సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ సత్యనారాయణ 23, 24 తేదీలలో రెండు కుటుంబాల సభ్యులను పిలిపించి విచారించారు. పెళ్లి చేసుకుంటానని తాజుద్దీన్, అతను సైకోలా వ్యవహరిస్తున్నాడు తనకు వద్దని యువతి సీఐకి చెప్పారు. ఇరు కుటుంబాలకు సీఐ కౌన్సిలింగ్ చేసి పంపారు. 26వ తేదీ రాత్రి తాజుద్దీన్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో సత్యనారాయణపురం పీఎస్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. తాజుద్దీన్ ఆత్మహత్యకు కారణమైన యువతిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగింది చిట్టినగర్ ప్రాంతంలో కాబట్టి కొత్తపేట పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని సీఐ వారికి నచ్చచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
 
 ఆ తల్లి కడుపుకోత ఎవరు తీరుస్తారు?
ఉన్న ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి కడుపు కోత ఎవరు తీరుస్తారు? నా సోదరుడు రూ.40 వేల జీతగాడు. వచ్చిందంతా ఆమెకే ఖర్చు పెట్టేవాడు. ఓ ఫోన్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. ఆ అమ్మాయి మా ఇంటికి వస్తే ప్రత్యేకంగా వంటలు చేసి పెట్టేవాళ్లం. ఇంటి కోడలుగా వచ్చి అన్ని సేవలు పొందేది. ఇప్పుడు నా సోదరుడికంటే ఎక్కువ జీతం వచ్చే వ్యక్తి దొరికాడంట. అందుకే వాడిని దూరంగా పెట్టి, మాకు అందనంత దూరం చేసింది. ఇదే ఆడదానికి జరిగితే ఊరుకునేవారా? మా కుటుంబానికి న్యాయం జరగాలి - మెహర, తాజుద్దీన్ సోదరి 

Advertisement
Advertisement