మహిళపై యువ క్రికెటర్ అసభ్య ప్రవర్తన | Sakshi
Sakshi News home page

మహిళపై యువ క్రికెటర్ అసభ్య ప్రవర్తన

Published Wed, Jul 20 2016 9:18 AM

మహిళపై యువ క్రికెటర్ అసభ్య ప్రవర్తన

బంజారాహిల్స్‌ : తనను కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందనే అక్కసుతో యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన యువ క్రికెటర్‌ కాకి ఉమామహేశ్వర్‌రావు అలియాస్‌ మహేష్‌(27)ను జూబ్లీహిల్స్‌ పోలీసులు నిర్భయ చట్టం కింద అరెస్ట్‌ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక సావరం గ్రామానికి చెందిన మహేష్‌ జూబ్లీహిల్స్‌లో తన తండ్రి వాచ్‌మన్‌గా పని చేస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు.

ఎంసీఏ చదువుతున్న మహేష్‌ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌ క్రికెట్‌ లీగ్‌లో కూడా ఆడాడు. ఇతను కొంతకాలంగా తానుండే ప్రాంతంలోనే ఉండే ఓ వాచ్‌మన్‌ కుమార్తెను ప్రేమిస్తున్నాడు. ఆమెను వెంటేసుకొని తిరిగేవాడు. మం చి భవిష్యత్‌ ఉన్న క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తూ ఆవారా గా తిరగడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే అతను ప్రేమిస్తున్న యువతి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొనేందుకు అంగీకరించింది. 

ఇది జీర్ణించుకోలేని మహేష్‌ రెండు రోజుల క్రితం ఆ యువతి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 10 నుంచి నడచుకుంటూ వెళ్తుండగా అడ్డగించాడు. ప్రేమించిన నన్ను కాదని వేరే వ్యక్తితో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతావా? అంటూ చున్నీపట్టి లాగడమే కాకుండా.. చెయ్యి పట్టుకొని బలవంతంగా పక్కకు గుంజాడు. ఆమె పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి మహేష్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహేష్‌పై ఐపీసీ సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement