పోరాటయోధుడు గోపాల్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

పోరాటయోధుడు గోపాల్‌రెడ్డి

Published Wed, Feb 8 2017 10:55 PM

పోరాటయోధుడు గోపాల్‌రెడ్డి - Sakshi

–వెన్నపూస గెలుపే లక్ష్యంగా  పనిచేద్దాం
–పట్టభద్రులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు జిల్లా నేతల పిలుపు
–కదిరి నుంచి ‘ఎన్నికల శంఖారావం’


కదిరి : ‘పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి మంచి పోరాట యోధుడు. ఆయనకు నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యలపై బాగా అవగాహన ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకుంటే చంద్రబాబు మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఆయన్ను శాసనమండలికి పంపేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాల’ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నేతలు పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లాపై ఉన్న అభిమానంతో ‘వెన్నపూస’ను  అభ్యర్థిగా ప్రకటించారని, అందుకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో  గెలిపించి జగన్‌కు కానుకగా ఇద్దామని అన్నారు. బుధవారం వారు ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావాన్ని కదిరి నుంచి పూరించారు. ఈ సందర్భంగా స్థానిక కృష్ణా çఫంక్షన్‌ హాలులో  సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు  ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు, నిరుద్యోగులకు ఎన్నో వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటి దాకా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.  పట్టభద్రులైన నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పారని, అలా ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామన్నారని తెలిపారు. వీటిని ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబును గట్టిగా ప్రశ్నించేందుకు వెన్నపూస గోపాల్‌రెడ్డి లాంటి సమర్థుడు మనకు కావాలని పేర్కొన్నారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసింది.

చంద్రబాబు మాత్రం హోదా రాకుండా సైంధవుడిలా అడ్డపడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారు. ఆయనకు దిమ్మ తిరిగేలా ప్రజల తీర్పు మారదని తెలియజెప్పేందుకు గోపాల్‌రెడ్డిని గెలిపించండి’ అని పార్టీ శ్రేణులు, పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులను కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీం, మాజీ మేయర్‌ రాగే పరశురాం, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ రవీంద్రారెడ్డి, నాయకులు బాలకృష్ణారెడ్డి, కదిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement