డెబ్భై ఏళ్ల భారత ప్రజాస్వామ్యం ఎలా సాగింది? | Sakshi
Sakshi News home page

డెబ్భై ఏళ్ల భారత ప్రజాస్వామ్యం ఎలా సాగింది?

Published Mon, Aug 14 2017 6:55 PM

డెబ్భై ఏళ్ల భారత ప్రజాస్వామ్యం ఎలా సాగింది?

ప్రజాస్వామ్యం ఎలా ఉంది? ఎటుపోతుంది?
మానవాళి చరిత్రలోనే ఒక మహత్తర విజయం

శతాబ్దాలపాటు పరాయిపాలనలో కొనసాగిన భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొంది 70 ఏళ్లపాటు ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాగించగలగడం మానవాళి చరిత్రలోనే ఒక మహత్తర విజయం. ఎందుకంటే వలసపాలన నుంచి బయటపడిన ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యాలుగా ప్రయాణం ప్రారంభించినప్పటికీ ఎక్కువకాలం ప్రజాస్వామ్యాలుగా అవి కొనసాగలేకపోయాయి. అక్కడ రాజ్యాంగాలు రద్దయినాయి. మిలటరీ కుట్రలలో ఎన్నికోబడ్డ ప్రభుత్వాలు పతనమయినాయి.

నియంతృత్వ ప్రభుత్వాలు రూపుదాల్చి పాదుకుపోయాయి. ప్రజాస్వామ్యం కన్నా నియంతృత్వమే మెరుగన్న భావన కూడ ఆయాదేశాల ప్రజల మనసుల్లో ఏదోకొంత మేరకు పోదిచేసుకుంది. అందుకు భిన్నంగా భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ రూపం మరింత బలపడుతూ, పాశ్చాత్య ప్రజాస్వామ్యాల సరసన సమానంగా ప్రపంచంలోనే అతిపెద్ద సుదృఢ ప్రజాస్వామ్యంగా మన్నలనందుకొంటుంది.

ఇదంత తేలికగా సాధ్యమవలేదు. గత 70 ఏళ్ల కాలంలో భారతదేశం పలు విషమ పరిస్థితులను ఎదుర్కొంది. అంతర్గత తిరుగుబాటు నేపథ్యంతో 1975లో ఆత్మయిక స్థితిని దేశంలో విధించింది నాటి ప్రభుత్వం. స్వతంత్ర్య సిక్కుదేశం కోసం అకాలీ తీవ్రవాదులు చేసిన ఉద్యమం, పర్యవసానంగా జరిగి హింసాకాండ దేశ సమగ్రతను ప్రశ్నార్ధకం చేశాయి. పంజాబ్‌ కల్లోలం తరువాత దేశ ప్రధాన మంత్రి ఇంధిరాగాంధీని కాల్చిచంపారు. మండల రిజర్వేషన్ల అంశం, మందిర్‌ వివాదం దేశాన్ని తీవ్ర సంక్షోభంలో పడవేశాయి.

యూరప్‌లో సోషలిస్టు రాజ్యాల పతనానంతరం ప్రపంచ వ్యాప్తంగా ముందుకొచ్చిన స్వేచ్ఛా విపణివాదానికి అనుకూలంగా దేశ ఆర్థికవ్యవస్థను పునర్నిర్మాణం చేయవలసి వచ్చింది. అయితే ఈ విషమ పరిస్థితుల నుంచి భారతదేశం విజయవంతంగా బయటపడగలిగింది. ఈ విజయాలకు ప్రధాన కారణం ప్రజాస్వామ్య రాజకీయ పరిపాలనా చట్టం. శాంతిభద్రతలు, ప్రజాభిప్రాయం, ప్రజాసంక్షేమం, వ్యక్తి స్వేచ్చలు, ఆర్థిక ప్రగతి తదితర అంశాలు ఏవి ఎంత ప్రాధాన్యమో, ఏ పాళ్లలో ఉండాలో భారత ప్రజలకు నేర్పింది ప్రజాస్వామ్యం.

సామాజికంగా వెనుకబడ్డ కులాలవారు విద్య, ఉద్యోగాలు, ప్రాతినిధ్య సంస్థలలో తగుస్థానం పొందేందుకు రిజర్వేషన్‌ విధానాలు దోహదపడ్డాయి. పెరిగిన విద్యావకాశాలు, భూ సంస్కరణలు, కుల వృత్తులనే కాక నచ్చిన వృత్తిని చేపట్టగలిగిన అవకాశాలు పెరగడం, రాజకీయ వికేంద్రీకరణ మెదలగు అంశాలు సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, సామాజిక పరిపుష్టతకూ దారితీశాయి. నేడు దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవుల్లో సామాన్య సామాజిక, కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారు ఉండటమనేది భారత ప్రజాస్వామ్య విజయ పథానికి సంకేతం.

అలానే కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల ద్యారా అధికారంలోకి రావడం, ప్రభుత్వాలను నిర్వహించడం, పార్లమెంటరీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర నిర్వహించడం ప్రపంచంలో ఒక్క భారత దేశంలోనే జరిగింది. నేటికీ ప్రజాస్వామ్య దేశాలలో అతి బలమైన పార్టీలుగా కమ్యూనిస్టు పార్టీలు భారతదేశంలో కొనసాగుతున్నాయి. హిందూ సాంస్కృతిక జాతీయవాదం ఆధారంగా పార్టీని బలోపేతం చేసుకొని కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలను ఏర్పరిచిన భారతీయ జనతాపార్టీ తన భావాజాల తీవ్రతను క్రమేపీ తగ్గించుకొంది. అలానే కులం, మతం, ప్రాంతం, వగైరా అస్థిత్వాల ఆధారంగా ఏర్పడి అధికారం చేపట్టిన పార్టీలు తమ భావాజాల తీవ్రతను తగ్గించుకొని ఇతరులను కలుపుకుని పోయే మార్గాన్ని అలవరుకొన్నాయి. ఇవన్నీ భారత ప్రజాస్వామ్య విజయాలే.

భారత ప్రజాస్వామ్య ప్రయోగం, విజయం ప్రపంచ దేశాలకు కూడా కొన్ని సహకారాత్మక సందేశాలను అందించింది. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ప్రజాస్వామ్యం సాధ్యమా అని రాజనీతి పండితులు తర్జనభర్జనలు చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగర జీవితం ప్రధాన స్రవంతిగా ఉండి, వ్యక్తిగత ఆదాయాలు సంవృద్ధిగా గల దేశాలలో ప్రజాస్వామ్యం సాధ్యమని వారి అభిప్రాయం. కాని ఆ పరిస్థితులు భారత దేశంలో నాడు ఒక్కటీ లేదు. ప్రజాస్వామ్యం, పేదరికం ఒకదానికొకటి పొసగవన్నది దృఢమైన వాదన. అయితే ఈ విధమైన ప్రజాస్వామ్య సిద్ధాంతం సరికాదని భారతదేశం నిరూపించింది.

స్వాతంత్య్రానంతరం మూడేళ్ల కాలంలోనే భారత ప్రజలు తమ దేశాన్ని గణతంత్ర ప్రజాస్వామ్యంగా ప్రకటించుకున్నారు. భారత ప్రజాస్వామ్యం పనిచేయడం మొదలయిన కొద్ది కాలానికే మరలా రాజనీతి పండితులు భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందా, పరిఢవిల్లుతుందా అని తర్జనభర్జన చేశారు. భారత సమాజంలోని అంతర్గత వైరుధ్యాల భారాన్ని, ధాటికి భారత ప్రజాస్వామ్యం కూలిపోక తప్పదని జ్యోస్యం చెప్పారు. అయితే ఈ రోజు నీతికోవిదుల సంశయం, జ్యోస్యం తప్పని భారత ప్రజాస్వామ్యం నిరూపించింది.

అంతవరకూ ప్రజాస్వామ్య సిద్ధాంతమేమంటే ప్రజాస్వామ్యం సామాజికంగా ఏకీకృతమైన జాతులలోనే, అంటే సజాతీయ సమూహాలతోనే సాధ్యం, దీని ప్రకారం బహుళ అస్థిత్వాలు, పలు భాషలు, ఛిద్రసమూహాలు కలిగిన భారతదేశం ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదన్నది ఈ సిద్ధాంతం, కాని ఇవేమీ పెను ఉప్పెనై భారత ప్రజాస్వామ్యాన్ని ముంచివేయలేదు. గత 70 ఏళ్లలో చాలానే సమస్యలొచ్చాయి. హింసాయుత పోరాటాలే జరిగాయి. ఏర్పాటువాద ఉద్యమాలు జరిగాయి. ఈ సమస్యలను బలప్రయోగం - సర్దుబాటు సూత్రం ఆధారంగా భారతదేశం ఈ సమస్యలకు చాలామటుకు పరిష్కరించగలిగింది. ఒక ప్రాంతం ఆందోళనల్లో అట్టడికిపోతున్నా, మిగతాదేశం ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలను నడుపుకు పోవడం భారతీయులకు అలవాటైంది.

అయితే భారత ప్రజాస్వామ్యంతా  బ్రహ్మండంగా ఉందనలేం. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకొన్నా, 70 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రక్రియ, ప్రభుత్వాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అనుకున్నా, ఒకే విధమైన, ఉత్తమమైన ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉన్నదని చెప్పడానికి ధైర్యం చాలదు. ఇలీవల కాలంలో పెచ్చుపడిన కొన్ని రాజకీయధోరణులు భారతదేశానికి రాజకీయ పరంగా పెద్ద సవాళ్లుగా మారాయి.

వాటిల్లో కొన్ని:
రాజకీయ అవినీతి: రాజకీయాన్ని, ప్రభుత్వాధికారాన్ని తాము సంపదను పోగువేసుకొనేందుకు మార్గంగా చూడటం చాలామంది రాజకీయ నాయకులకు పరిపాటి అయిపోయింది. ఒక్కొక్కరు పదో, ఇరవై కోట్లో కాదు, వందల, వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను కూడబెడుతున్నారన్న ఆరోపణలను మనం నిత్యం రాజకీయనాయకుల నుండే వింటున్నాం.

ప్రభుత్వ విధానాలను తమ తీబేదారులకనుగుణంగా అన్వయించడం, నిర్ణయాల్లో మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వాధినేతలు ఎలా అక్రమ ఆస్థులను కూడబెడుతున్నారో నివేదికలు వెల్లడి చేస్తున్నాయి. ‘‘య ఆశ్వత పెట్టుబడిదారీ వ్యవస్థ’’ అని దీనికొక పేరుకూడా నానుడిలోకి వచ్చింది, చట్ట సభల్లో జరుగుతున్న తీవ్రదూషణ భాషణలు, పార్టీలు మార్చడం చూస్తుంటే రాజకీయ నాయకులు ఈ విష క్రీడలో ఎంత కూరుకుపోయారో విదితమవుతుంది.

రెండవ సమస్య వారసత్వ రాజకీయాలు: రాజకీయ పార్టీలను స్థాపించినవారు వాటిని తమ స్వంత ఎస్టేటుల్లా పరిగణించడం సహజమయింది. రాజకీయ అధికారాన్ని తమ స్వంత ఆస్తిలా తమ పిల్లలకు బదలాయించడం తమ హక్కుగా అధినాయకులు భావిస్తున్నారు. హద్దులలేని అధికారం చెలాయించడం, తమ తాబేదారులకు పనులు చేసిపెట్టడం, తాము ఆస్తులను పోగేసుకోవడమే రాజకీయంగా భావించి ఈ అధికారాలను, హోదాలను తమ పిల్లలకు అందజేయాలని అహరణం రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

ఇదే రకం పక్రియ వ్యాపార రంగంలో చూస్తున్నాం. నటనా కౌశలం ఉన్నా, లేకపోయినా పెద్దల మద్దతుతో, భారీ పెట్టుబడులు, సెట్టింగులు, సాంకేతిక వర్గంతో, మార్కెటింగ్‌లతో బడా హీరోల పిల్లలు ఎలా అయితే హిట్‌ సినిమాలు కొడుతున్నారో, రాజకీయ రంగంలో కూడా పెద్ద ప్రతిభ ఉన్నా లేకపోయినా పిల్లలకు రాజకీయ ఆరంగేటం చేయిస్తున్నారు. తాము ఎలా అయినా అధికారంలోకి రావాలని పిల్లలూ, కుటుంబ సభ్యులూ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వంశపాలన, వారసత్వ రాజకీయమనేది ప్రజాస్వామ్యపక్రియకు విరుద్ధం, అందుకే బహుశా రాజనీతి శాస్త్ర పరిభాషకు భారత ప్రజాస్వామ్యం ఒక నూతన పదాన్ని జోడించింది. దాని పేరే ‘‘ అనువంశిక ప్రజాస్వామ్యం’’ లేదా ‘‘ వారసత్వ ప్రజాస్వామ్యం’’ .

మూడవ సమస్య అధికార కేంద్రీకరణ: కేవలం కేంద్రీకరణే కాదు. పూర్తి అధికారాన్ని ఒకే వ్యక్తిలో నిక్షిప్తం చేయడం, అంటే కేంద్రీకృత అధికారాన్ని ఒక బృందానికో, కమిటీకో కాకుండా వ్యక్తిపరం చేయడం. చాలామటుకు పార్టీలలో, ప్రభుత్వాలలో ఈ రకమైన ఏకవ్యక్తి నిరంకుశ పాలనను చూస్తున్నాం. పార్టీ అధినాయకునికి నమ్మకస్తులే అధికారంలో ఉంటారు. అధినాయకునికి అయిష్టమైన విషయాలను ఎవరూ ఆలోచించకూడదు, మాట్లాడకూడదు. ఒకవేళ భిన్నాభిప్రాయాలంటే నోరుమూసుకు కూర్చోవాలి లేదా పార్టీ నుంచి బయటకు పోవాలి. అధినాయకుని విశ్వరూపమే పార్టీ, పార్టీ ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఏకచ్ఛత్రాధిపత్యం నేర్పే అధినాయకులు నడపడం భారత ప్రజాస్వామ్య వైచిత్రి.

ఈ ధోరణులు చాల పార్టీలలో, చాలా పార్టీ ప్రభుత్వాలలో, దాదాపు అన్ని స్థాయిలలో మనం చూస్తున్నాం. రాజకీయ అవినీతి, అనువంశిక పాలన, నిరంకుశ అధినాయకత్వం అనే ఈ మూడిటికి అవినాభావ అంతర్గత సంబంధముంది. బహుశా సామాజిక వెనుకబాటుతనం, విద్యాలేమి, విస్త్రత పేదరికం కలగలసి ప్రజాస్వామ్య పక్రియలో ఈ విపరీణ ధోరణులకు దారితీసి ఉండవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించి ఒక విధమైన, అర్థవంతమైన, సారవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పర్చుకోవడం ఎలా అన్నది భారతదేశ ప్రజల ముందున్న పెద్ద సవాలు. గత 70 ఏళ్ల కాలంలో భారత ప్రజాస్వామ్యం ఎన్నో సమస్యలను, సంక్షోభాలను అధిగమించి ముందుకు సాగింది. తనను తాను పరిష్కరించుకోగల్గింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా భారత ప్రజాస్వామ్యం తన ముందున్న సవాళ్లను అధిగమించి మరింత పరిప్రష్టమై ముందుకు సాగుతుందని ఆశిద్దాం.

కొండవీటి చిన్నయసూరి
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం

Advertisement
Advertisement