ఆయుధ వ్యాపారం | Sakshi
Sakshi News home page

ఆయుధ వ్యాపారం

Published Tue, Feb 16 2016 6:45 AM

ఆయుధ వ్యాపారం - Sakshi

అమెరికా ఎప్పటిలా చేసిన తప్పునే చేయదల్చుకున్నట్టుంది. పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్-16 రకం యుద్ధ విమానాలను విక్రయించాలని తీసుకున్న నిర్ణయం ఆ సంగతినే వెల్లడిస్తున్నది. ఈ విమానాలకు దాదాపు 70 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని, అవి అణ్వస్త్రాలను మోసుకెళ్లడానికి అనువైనవని తెలుస్తోంది.

 

ఒకపక్క భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరగవలసి ఉన్న చర్చలు పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాద దాడి పర్యవసానంగా నిలిచిపోయాయి. అందుకు సంబంధించిన ఆధారాలను భారత్ అందజేస్తే బాధ్యులుగా భావిస్తున్నవారిని అరెస్టు చేస్తామని పాకిస్తానే చెప్పింది. ఆధారాలిచ్చి రోజులు గడుస్తున్నా ఇంతవరకూ ఆ సంగతిని తేల్చలేదు. పాకిస్తాన్‌కు నచ్చజెప్పడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ దశలో ప్రయత్నించాల్సిన అమెరికా...దాన్ని మరింత దిగజార్చే ధోరణిలో ప్రవర్తిస్తోంది. ఒకపక్క తన నిర్బంధంలో ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబై మారణకాండ కేసులో ముంబైలోని సెషన్స్ కోర్టుకు వీడియో లింక్ ద్వారా ఇస్తున్న సాక్ష్యాలు ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఎంతగా పెనవేసుకుపోయిందో చెబుతున్నాయి. తామూ ఉగ్రవాద బాధితులమేనని తరచు చెప్పే పాకిస్తాన్ ఈ విషయంలో తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలేమిటో ఎవరికీ తెలియదు.

 

ఈ దశలో ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలని నిర్ణయించడం ఎంత వరకూ సహేతుకమో అమెరికాకు తెలియాలి. రెండు దేశాలూ నిరంతరం ఉద్రిక్త వాతావరణంలో బతుకీడ్వాలని, అప్పుడు మాత్రమే తమ ఆయుధ వ్యాపారం సజావుగా సాగుతుందని అది భావిస్తున్నట్టు కనబడుతోంది. ఫక్తు వ్యాపారం చేసుకుంటూ అది కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసమేనంటూ లోకాన్ని నమ్మించాలని చూస్తోంది. అణ్వాయుధాలను తీసుకెళ్లగల ఈ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించడం ఎలా సాధ్యం? ఈ వాదన నమ్మశక్యంగా ఉందా? పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని, ఉగ్రవాదులకు అవసరమైన శిక్షణనూ, ఆయుధాలనూ అందజేస్తున్నదని అమెరికాకు దశాబ్దాలుగా స్పష్టంగా తెలుసు. అయినా ఆ దేశానికి సైనిక సాయం అందించడంలో ఏనాడూ అమెరికా వెనకా ముందూ ఆలోచించలేదు. తమ దేశంలో ఉగ్రవాదులు విలయం సృష్టించాక అమెరికా మారినట్టే కనబడినా అది కొద్దికాలమే. సాయం అందజేయాల్సి వచ్చినప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పడం లేదా చడీచప్పుడూ లేకుండా చేయదల్చుకున్నది చేయడం అమెరికాకు అలవాటుగా మారింది.

 

2012లో ఒకసారి షరతులు ఎత్తేసి సాయం చేసినప్పుడు అమెరికన్ కాంగ్రెస్‌కు ఒబామా సర్కారు వింత వాదనను వినిపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి పాక్ తీసుకుంటున్న చర్యలు సక్రమంగా ఉన్నాయని భావించకపోయినా, అక్కడి ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియను ‘ప్రభావితం’ చేసేందుకు సాయం కొనసాగించక తప్పడం లేదని వింత తర్కం వినిపించింది. ఇప్పుడు ఎఫ్-16 యుద్ధ విమానాలను అమ్మడం కోసం ఆ మాదిరి కథనే చెబుతోంది. ఆయుధ వ్యాపారం సజావుగా చేసుకోవాలను కున్నప్పుడల్లా పాకిస్తాన్‌కు భుజకీర్తులను తగిలించడం అమెరికాకు అలవాటైంది.

 

  యుద్ధ విమానాల అమ్మకంపై మొన్న డిసెంబర్‌లోనే ఒబామా ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. విదేశీ సైనిక సాయంపై లాంఛనంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది సరికాదని డెమొక్రటిక్ పార్టీలోని ముఖ్యులు ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నారు. అయినా ఒబామా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోదల్చుకోలేదు. పాక్ వద్ద ప్రస్తుతం ఉన్న ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉగ్రవాద నిర్మూలనలో అమోఘంగా ఉపయోగపడుతున్నాయని, అందుకే మరిన్ని అందజేయడం అవసరమని భావించామని చెబుతోంది. ఈ ప్రతిపాదనపై అమెరికన్ కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా, వ్యాపార లాబీల ప్రయోజనాలకు భిన్నమైన నిర్ణయం వస్తుందా అన్నది అనుమానమే.

 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరి కొన్నాళ్లలో జరగనున్న నేపథ్యంలో ఇది సాధ్యమవుతుందని అనుకోనవసరం లేదు.  పాకిస్తాన్ వైమానిక దళం వద్ద ఇప్పటికే ఎఫ్-16లు 70 వరకూ ఉన్నాయి. 1980 ప్రాంతంలోనే పాక్ వైమానిక దళానికి ఈ విమానాల అమ్మకం మొదలైంది. అయితే అణ్వస్త్ర కార్యక్రమంలో పాక్ చురుగ్గా పాల్గొంటున్నదని అందిన సమాచారంతో ఆ దేశానికి ఇవ్వాల్సిన 28 యుద్ధ విమానాలను ప్రెస్లర్ సవరణకింద ఆపేస్తున్నట్టు 1990లో అమెరికా ప్రకటించింది. కానీ 2006లో ఈ అమ్మకాలను పునరుద్ధరించింది. ఆ సంవత్సరం అధునాతన బ్లాక్ 52 రకం ఎఫ్-16 యుద్ధ విమానాలు 18 అందజేయాలని ఇరు దేశాలమధ్యా ఒప్పందం కుదిరింది. 2010లో కొన్నిటిని, 2012లో మరికొన్నిటిని అందజేసింది. దానికి కొనసాగింపుగానే ఒబామా ప్రభుత్వం తాజా ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన 15 కోట్ల డాలర్ల  సైనిక సాయాన్ని నిరుడు మార్చిలోనే అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ నిలుపుదల చేసింది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ అర్ధవంతమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆ సందర్భంగా కమిటీ పేర్కొంది. నిరుడు మార్చికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో వచ్చిన మార్పేమిటో అమెరికా చెప్పాలి.

 

 అమెరికా వ్యవహార శైలి ఆదినుంచీ భారత్-పాకిస్తాన్‌లమధ్య పొరపొచ్చాలను మరింత పెంచేదిగానే ఉంటోంది. ముంబై మారణకాండ జరిగిన ఏడాదికే డేవిడ్ కోల్మన్ హెడ్లీ పట్టుబడినా ఆ కేసు విషయంలో మనకు సరైన సహకారం అందజేయలేదు. అతన్ని భారత్‌కు అప్పగించడానికి బదులు తమ నిర్బంధంలో ఉండగా మాత్రమే ప్రశ్నించడానికి అంగీకరించింది. 2010లో అలాంటి అవకాశం ఇచ్చాక మళ్లీ నేరుగా మన న్యాయస్థానం ముందు అతను సాక్ష్యం ఇవ్వడానికి ఇన్నాళ్లుపట్టింది.

 

ప్రస్తుతం హెడ్లీ సాక్ష్యం చెబుతున్నాడు గనుక పాకిస్తాన్‌కు ఎఫ్-16లు విక్రయించినా ఈ దశలో భారత్ ఎలాంటి అభ్యంతరమూ చెప్పదని అమెరికా భావించినట్టు కనబడుతోంది. బలాబలాల సమతూకం పేరుతో ఆయుధ విక్రయం సాగించే అమెరికా ధోరణివల్ల పోటీ పెరిగి ఉద్రిక్తతలు ఎక్కువవుతున్నాయి. పేదరికం నిర్మూలనకూ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకూ ఉపయోగపడవలసిన సొమ్ము రక్షణ కొనుగోళ్లకు వ్యయమవుతున్నది. భారత్, పాక్‌ల మధ్య శాంతిసామరస్యాలను కోరుకునేవారందరూ అమెరికా ధోరణులను నిరసించాలి. దాని ఆయుధ వ్యాపారాన్ని ప్రశ్నించాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement