అడుగంటిన ఉఫా ఆశలు | Sakshi
Sakshi News home page

అడుగంటిన ఉఫా ఆశలు

Published Mon, Aug 24 2015 12:00 AM

debates between pak and india end

ఎప్పటి లాగే భారత్-పాకిస్తాన్ సంబంధాలు మళ్లీ మొదటికొచ్చాయి. మరికొన్ని గంటల్లో రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారులమధ్య చర్చలు జరుగుతా యనగా అవి కాస్తా రద్దయ్యాయి. గత వారమంతా సాగిన పరిణామాలను గమనిం చిన వారికి రెండు దేశాలూ మాట్లాడుకుంటాయన్న విశ్వాసం పెద్దగా కలగలేదు. కానీ ఏదో అద్భుతం జరగకపోతుందా అని ఓ మూల ఆశపడ్డారు. ఆ విశ్వాసానికి కారణం గత నెల 11న రష్యాలోని ఉఫాలో బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ (ఎస్‌ఓసీ) సమావేశాల సమయంలో ఇరు దేశాల ప్రధానులూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడమే. నిరుడు కఠ్మాండూలో సార్క్ దేశాల అధినేతల సదస్సులో ఎడ మొహం, పెడమొహంగా ఉన్న నేతలిద్దరూ ఉఫాలో ఇలా కలవడమే కాక... సమస్యల పరిష్కారానికి సంప్రదింపుల బాట పట్టాలని నిర్ణయించారు. ఆ సంద ర్భంగా ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు.

ముంబై దాడి కేసు నిందితులపై విచారణ త్వరితగతిన జరగడానికి వీలైన చర్యలు తీసుకోవాలని ఆ ఉమ్మడి ప్రకటన సంకల్పం వ్యక్తం చేయడమే కాదు...అన్ని రకాల ఉగ్రవాదాన్నీ ఖండిస్తున్నట్టు తెలిపింది. ముందు ఇరు దేశాల ఎన్‌ఎస్‌ఏల మధ్యా చర్చలుంటాయని, ఆ తర్వాత బీఎస్‌ఎఫ్, పాక్ రేంజర్స్ మధ్యా... ఆ తర్వాత ఇరు దేశాల మిలిటరీ డెరైక్టర్ జనరళ్ల మధ్యా సంప్రదింపులు సాగుతాయని చెప్పింది. ఇన్ని చెప్పాక ఎంతటి నిరాశావాదు లైనా, నిస్పృహతో మాట్లాడేవారైనా యథాతథ స్థితే కొనసాగుతుందని భావించ లేరు. అయితే ఉఫా ఉమ్మడి ప్రకటనలో మాటమాత్రమైనా ప్రస్తావనకు రాని కశ్మీర్ అంశమూ, హుర్రియత్ సంస్థా ఇప్పుడు చర్చలకు పెద్ద అవరోధంగా మారడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

 భారత్-పాకిస్తాన్ సంబంధాలు విలక్షణమైనవి. వెలుపలివారికి అవి ఓ పట్టాన అంతుబట్టవు. ఊహించని రీతిలో ఉఫాలో ఇరు దేశాల అధినేతలూ అంతగా మాట్లా డుకున్నాక సరిహద్దుల్లో షరా మామూలుగా తుపాకులు గర్జించాయి. ఇరువైపులా పౌరులు తుపాకి గుళ్లకు ఎరకావడం, ఇళ్లు ధ్వంసం కావడం, ప్రాణ భయంతో గ్రామాలు విడిచి వెళ్లడం యథాప్రకారం సాగింది. ఆ తర్వాత మాటల యుద్ధం మొదలైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది మీరంటే మీరని ఆరోపణలు చేసుకున్నారు. ఇరు దేశాల సంబంధాలు ఎంత జటిలమైనవో, పరస్పర అవిశ్వాసం ఎంతగా ఉన్నదో ఈ పరిణామాలు నిరూపించాయి. ఇక చర్చ లు కల్లేనని అనుకున్నంతలోనే రెండు దేశాలూ ‘అదేం లేదు...అవి సాగుతాయ’ని ప్రకటించాయి. అందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టే కనబడ్డాయి. ఇంతలో హుర్రియత్ వివాదం మొదలైంది. చర్చలకు ముందు తమ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ హుర్రియత్ నేతలతో మాట్లాడతారని పాకిస్తాన్...అలా వీల్లేదని భారత్ పట్టుబట్టుకుని కూర్చున్నాయి. ఆదివారం తెల్లారక ఎన్‌ఎస్‌ఏలు సమావేశం కావాల్సి ఉండగా ఇరు దేశాలూ తమ తమ వైఖరులను మార్చుకోకపోవ డంతో అది రద్దయింది.

 చర్చల రద్దుకు దారితీసిన పరిస్థితులను గమనిస్తే రెండు దేశాల తప్పులూ కనిపిస్తాయి. ఉఫాలో ఉమ్మడి ప్రకటన విడుదల చేసేనాటికి  ఇరు దేశాల అధినే తలకూ అవతలివారి వైఖరేమిటో తెలుసు. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్  బాసిత్ మన ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా హుర్రియత్ నేతలతో సమావేశం కావడంతో ఆగ్రహించి నిరుడు ఆగస్టులో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను మన దేశం రద్దు చేసుకుంది. ఇరు దేశాల సమస్యలపైనా ఇద్దరమే మాట్లాడుకోవాలి తప్ప మూడో పక్షం ప్రమేయం ఉండరాదని ఆ సందర్భంలో మన దేశం గట్టిగా చెప్పింది. ఉఫా సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ సంగతినే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గుర్తు చేస్తే సరిపోయేది. ఒకవేళ మోదీ ఆ సంగతి మాట్లాడకపోతే షరీఫ్ అయినా దాన్ని లేవనెత్తి ఉండాలి. ఇద్దరిలో ఎవరు ఆ పని చేసినా ఉఫా చర్చలు హర్రియత్ అంశం దగ్గర ఆగిపోయేవి. అది తేలాకే బండి ముందుకు కదిలేది. అప్పుడు ఏం జరిగేదన్నది వేరే విషయం.

 నిజానికి హుర్రియత్ విషయంలో ఇరు దేశాలమధ్యా రేకెత్తిన వివాదం అర్థం లేనిది. ఒక్క సయ్యద్ అలీషా గిలానీ మినహా ఆ సంస్థ నాయకులెవరికీ జనంలో ఇప్పుడు పెద్దగా పలుకుబడి లేదు. వారితో మాట్లాడటంవల్ల పాకిస్తాన్‌కొచ్చే అద నపు ప్రయోజనం లేదు. ఇటు హుర్రియత్ నేతలు పొంద గలిగేది కూడా శూన్యం. అలాగే...మనకు సైతం వారిద్దరూ మాట్లాడుకోవడంవల్ల కలిగే నష్టం లేదు. ఆ మాదిరి చర్చలు రెండు దశాబ్దాలుగా సాగుతున్నాయి. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం సైతం అందుకు అభ్యంతరం చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా హుర్రియత్‌ను పెద్ద సమస్యగా చూపడం అర్థరహితం. చూపితే చూపారు...ఆ పని ఉఫాలోనే చేసి ఉంటే సరిపోయేది. వాస్తవానికి ఈ చర్చలనుంచి ఎలా తప్పించుకోవాలా అని పాకిస్తాన్ సాకులు వెదికింది. సరిహద్దు ల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనల సంగతలా ఉంచి, ఉఫా ఉమ్మడి ప్రకటనలో కశ్మీర్ అంశం లేనందుకు అక్కడి ఛాందసవాదులు నవాజ్ ప్రభుత్వంపై కత్తులు నూరారు. తెలివితక్కువగా వ్యవహరించారని ఆడిపోసుకున్నారు.

‘ఇరు దేశాల మధ్యా అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలనూ చర్చల ద్వారా పరిష్కరించు కోవాల’న్న మాటలోనే కశ్మీర్ అంశం కూడా దాగివున్నదని పాక్ నేతలు సర్ది చెప్పు కున్నా ప్రయోజనం లేకపోయింది. వీటికితోడు  పంజాబ్‌లోని గురుదాస్ పూర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, జమ్మూలో ఒక ఉగ్రవాది సజీవంగా పట్టుబడటం వంటివి ఆ దేశాన్ని సంకట స్థితికి నెట్టాయి. అందుకే హుర్రియత్ అంశాన్ని భారత్ ముం దుకు తీసుకురావడంవల్ల పాక్ ఊపిరిపీల్చుకుంది. ఆ సాకు చెప్పి చర్చల నుంచి వైదొలగింది. వాస్తవానికి అంతర్జాతీయంగా తనపై వస్తున్న ఒత్తిళ్ల ఫలితంగా విధిలేని పరిస్థితుల్లోనే ఆ దేశం చర్చలకు అంగీకరించింది. వాటిని ఎలాగైనా కొన సాగేలా చూసి ఉగ్రవాదానికి సంబంధించిన సరికొత్త సాక్ష్యాలను పాక్‌కు అందించి, చర్యలకు డిమాండ్ చేసివుంటే ఆ దేశం ఇరకాటంలో పడేది. అందుకు బదులుగా... హుర్రియత్‌పై వైఖరి మార్చుకుని చర్చలకు ఆటంకం కలిగించామన్న ముద్ర మనపై పడింది. ఇది మంచి పరిణామం కాదు. అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేయాలన్నా, ఆ దేశాన్ని దారికి తేవాలన్నా చర్చలే తప్ప మరో మార్గం లేదు.
 

Advertisement
Advertisement