దేవె గౌడ (మాజీ ప్రధాని) రాయని డైరీ

15 Apr, 2018 00:35 IST|Sakshi

కేసీఆర్‌ వస్తానంటే నిద్ర ఆపుకుని కూర్చున్నాను. ఎప్పుడు పట్టేసిందో పట్టేసింది! ఆయన వచ్చింది కూడా తెలియలేదు. ‘‘నాన్నా.. హైదరాబాద్‌ నుంచి కేసీఆర్‌ వచ్చారు, లేవండి’’ అని తట్టి లేపాడు కుమారస్వామి.

‘‘కొంచెం మెల్లిగా లేపొచ్చు కదా నాన్నా..’’ అన్నాను. ‘‘చాలాసేపటి నుంచి లేపుతున్నాను నాన్నా’’ అన్నాడు కుమారస్వామి. 
కుమారస్వామికి అన్నీ డీటెయిల్డ్‌గా చెప్పడం అలవాటు. ‘నిద్రలేచిన వాళ్లకు అన్ని డీటెయిల్స్‌ ఎందుకు నాన్నా?’ అంటే వినడు. కేసీఆర్‌ వచ్చాడంటే సరిపోదా! హైదరాబాద్‌ నుంచి కేసీఆర్‌ వచ్చాడు అని చెప్పాలా? కేసీఆర్‌ ఢిల్లీలో ఏం ఉండడు కదా. ఢిల్లీలో ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాడు? అక్కడికే పిలిపించుకుంటాడు కానీ. 
‘‘మారాలి’’ అన్నాడు కేసీఆర్, నేను హాల్లోకి వెళ్లగానే. హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు ఆయన. 
‘‘మారితే ఎప్పుడో మారాల్సింది చంద్రశేఖర్‌. ఇక మార్పు రాదు’’ అన్నాను. 

‘‘నేను మార్చగలను’’ అన్నాడు కేసీఆర్‌. 
ఎప్పుడూ ఎవరో ఒకర్ని మార్చందే ఈ బక్క పలుచని మనిషికి నిద్రపట్టదేమో!
‘‘ఇది ఇప్పటి అలవాటు కాదు చంద్రశేఖర్‌. చూసే ఉంటావ్, పేపర్లలో అక్కడ.. ప్రధానిగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటులో నాకు బాగా పట్టేసేది. కొన్నాళ్లు ట్రై చేశాను.. ఆపుకోవాలని. నా వల్ల కాలేదు. టైమర్‌ కూడా పెట్టుకున్నాను. అయినా కాలేదు’’ అన్నాను. 

‘‘టైమర్‌ ఏమిటి?’’ అన్నాడు కేసీఆర్‌. 
‘‘ఎవరైనా నిద్ర లేవడానికి టైమర్‌ పెట్టుకుంటారు. నేను నిద్రపోడానికి టైమర్‌ పెట్టుకునేవాడిని. అంత సిన్సియర్‌గా ట్రై చేశాను. అదీ వర్కవుట్‌ కాలేదు. ఎప్పుడు వాలిపోతానో ఎక్కడ వాలిపోతానో నాకే తెలియదు చంద్రశేఖర్‌’’ అన్నాను.  
కేసీఆర్‌ నవ్వాడు. ‘‘పెద్ద వయసు కదా’’ అన్నాడు. ‘‘ఇరవై ఏళ్ల క్రితం కూడా పెద్ద వయసేనా చంద్రశేఖర్‌! అప్పుడు కూడా బాగా పట్టేసేది కదా మరి!’’ అన్నాను. 
కేసీఆర్‌ మళ్లీ నవ్వాడు. 

‘‘అయినా నేను ‘మారాలి’ అన్నది, ‘నేను మార్చగలను’ అన్నది మీ నిద్రవేళల్ని కాదు గౌడాజీ. మనం మారాలి. బీజేపీని, కాంగ్రెస్‌నీ మార్చాలి. ఏం? ఈ దేశ పౌరులకు మార్పును కోరుకునే హక్కు లేదా’’ అన్నాడు కేసీఆర్‌. ఫోన్‌లో చెప్పిన మాటల్నే మళ్లీ చెప్తున్నాడు. నిద్రొచ్చినట్టుగా అయింది.
‘‘గౌడాజీ.. కాంగ్రెస్‌ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్‌ రావడం కాదు మార్పు. బీజేపీ పోవాలీ, కాంగ్రెస్సూ రాకూడదు. అదీ మార్పంటే. ఆ మార్పు కోసం మీరు కలిసొస్తారా? మీ..రు.. క..లి..సొ..స్తా..రా?’’ అన్నాడు.

‘‘కలిసొస్తారా.. అని వెంటవెంటనే రెండుసార్లు అడిగావేంటి చంద్రశేఖర్‌?’’ అని అడిగాను. 
‘‘ఒత్తి పలికాను గౌడాజీ’’ అన్నాడు కేసీఆర్‌.
ఆయన ఒత్తి పలకడం చూస్తుంటే.. బలమైన  మార్పునే ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది! 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విలక్షణ వ్యక్తిత్వం

ఉన్మాద కాండ

మళ్లీ మోకాలడ్డిన చైనా

భద్రతే ప్రాణప్రదం

ఇది న్యాయమేనా?!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సులభం కాదు

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

మా కష్టమంతా మర్చిపోయాం

ఆనంద భాష్పాలు ఆగలేదు