కరోనా మేల్కొలుపు | Sakshi
Sakshi News home page

కరోనా మేల్కొలుపు

Published Fri, Mar 13 2020 1:32 AM

Editorial On Coronavirus Disease Impact On World Wide - Sakshi

చైనాలో గత డిసెంబర్‌ చివరిలో ఉనికి చాటుకుని రెండు నెలలపాటు ఆ దేశాన్ని గడగడలాడించి, చాపకింద నీరులా ఒక్కో దేశానికీ విస్తరించిన కరోనా వైరస్‌ను విశ్వవ్యాప్త మహమ్మారిగా పరిగణిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ప్రకటించింది. అన్నిటినీ తట్టుకుని నిలకడగా ఖండాంతరాలకు విస్తరిస్తూపోయే వ్యాధిని మహమ్మారి అని చెబుతారు. అలాగని దాన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించనవసరం లేదు. పకడ్బందీ చర్యలు అవసరమైన వ్యాధిగా దాన్ని అందరితో గుర్తింపజేయడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉద్దేశం. చాలా దేశాలు ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టే విషయంలో నిర్లిప్తంగా వుండటాన్ని గుర్తించాక సంస్థ ఈ ప్రకటన చేసింది. 

వ్యాధి భిన్న భౌగోళిక ప్రాంతాలకు వ్యాపిస్తున్నదని చెప్పడమే దీని పరమార్థం. మన దేశంలో కరోనా వైరస్‌ కేసులు 74 వరకూ నమోదు కాగా అందులో వైరస్‌ చురుగ్గా ఉన్న కేసులు 69గా నిర్ధారించారు. అదృష్టవశాత్తూ మరణాలు లేవు. మొత్తమ్మీద గురువారంనాటికి ప్రపంచవ్యాప్తంగా 1,29,156 మందికి ఈ వ్యాధి సోకగా 80,000కు పైగా కేసులు చైనాలోనే వున్నాయి. అక్కడ ఈ వైరస్‌ బారినపడి 3,169మంది మరణించారు. ఇప్పుడిప్పుడే అది కట్టడి అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాధిని తీవ్రంగా పరిగణించి చర్యలకు ఉపక్రమిస్తే అదుపు చేయడం కష్టంకాదని చైనా అనుభవాలు నిరూపిస్తున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ చురుగ్గా వున్న కేసులు 55,753 కాగా, మరణాల సంఖ్య 4,749. ఆసియాలో చైనా తర్వాత ఈ వ్యాధితో సతమతమవుతున్నది యూరప్‌ ఖండమే. అందుకే ప్రస్తుతం యూరప్‌ను ‘నవ చైనా’ అంటున్నారు. ఆ ఖండంలో దాదాపు అన్ని దేశాల్లోనూ వైరస్‌ జాడ వున్నా ఇటలీ అధికంగా సమస్యలెదుర్కొంటున్నది. అక్కడ ఇంతవరకూ 827 మంది మరణించారు. పశ్చిమాసియాలో ఇరాన్‌కు ఈ వైరస్‌ తాకిడి ఎక్కువుంది. అక్కడ 429 మంది మరణించారు. బయటపడిన నాటినుంచీ గమనిస్తే ఈ వైరస్‌ కేసులు పది రెట్లు పెరగ్గా, బాధిత దేశాల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. కనుకనే దీనిపై అందరినీ హెచ్చరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించింది. 

విలేకరుల సమావేశంలో వారి మైక్‌లను చేతులతో తాకి వైరస్‌ను తేలిగ్గా తీసుకున్న అమెరికా బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు రూడీ గోబర్ట్‌ను 48 గంటల్లో ఆ వ్యాధి పలకరించింది. హాలీవుడ్‌ నటుడు టామ్‌ హాంక్స్, ఆయన భార్య కూడా ఆస్ట్రేలియాలో ఈ వ్యాధి బారినపడ్డారు. దేశ జనాభాలో దాదాపు 70శాతంమందికి కరోనా అంటుకునే ప్రమాదం వున్నదని జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించడమే కాదు... ఇప్పటికైతే దానికి ఎలాంటి చికిత్స లేదు గనుక వ్యాప్తిని అరికట్టడమే తక్షణ కర్తవ్యమని తెలిపారు. లౌక్యం లేకుండా దేన్నయినా నేరుగా చెప్పడం జర్మనీ అలవాటు. 

ఈ వ్యాధితో సతమతమవుతున్న దేశాలు, అవి తీసుకుంటున్న చర్యలు గమనిస్తే చాలా గుణపాఠాలు నేర్చుకోవచ్చు. మొదట్లో కాస్తంత నిర్లిప్త ధోరణిని ప్రదర్శించినా, ఒకసారి మేల్కొన్నాక బహుముఖ యుద్ధం ప్రకటించిన చైనా దాదాపు రెండునెలలు గడిచాక దాని వ్యాప్తిని చాలా పరిమితం చేయగలిగింది. ఏకస్వామ్య పాలనవున్న దేశం గనుక అది సాధ్యమైంది. ఆ స్థాయిలో కఠినంగా వ్యవహరించడం అన్నిచోట్లా సాధ్యమయ్యేది కాదు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఇటలీ నెమ్మదిగా అడుగులేసింది. గుర్తించిన తర్వాత కూడా కరోనా తీవ్రతను ఎదుర్కొనడంలో అవసర మైనంత శ్రద్ధ పెట్టలేదు. కనుకనే ఫిబ్రవరి మొదటివారంలో 600 వరకూ ఉన్న కేసులు కాస్తా నెల్లాళ్లు గడిచేసరికి 10,000 దాటాయి. 

ఇప్పుడైతే అత్యవసరమనుకున్న పనుల కోసం తప్ప ఎవరూ ఇళ్లూ వాకిళ్లూ దాటొద్దని కట్టడి విధిస్తోంది. రెస్టరెంట్లు, కెఫేలు, దుకాణాలు మూసేయమని హుకం జారీ చేసింది. దాదాపు బయటపడుతున్న కేసులన్నీ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా వున్న ప్రాంతాలనుంచి బయటకు వెళ్తున్నవారి వల్లనేనని రుజువైంది. కనుక తప్పనిసరైతే విదేశాలకెళ్లాలని చెప్పడం, వేరే దేశాలవారిని రానీయకుండా ఆంక్షలు విధించడం మొదలైంది. అన్ని రకాల క్రీడా పోటీలు నిలిచి పోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ అవసరం. మన దేశం వచ్చే నెల 15 వరకూ వీసాల జారీ నిలిపేస్తున్నట్టు చెప్పడం, సభలూ, సమావేశాలు జరపొద్దని సూచించడం, ఢిల్లీలో పాఠశాలలు, కళా శాలలు, సినిమా థియేటర్లు ఈ నెలాఖరు వరకూ మూసివేస్తున్నట్టు చెప్పడం ఈ ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే. 

దేశంలో బయటపడిన 74 కేసుల్లో 17 మన దేశానికొచ్చిన విదేశీ పౌరులవి కావడం, ఇక్కడ వ్యాధి లక్షణాలు బయటపడ్డవారు కూడా వ్యాధి తీవ్రత ఉన్న దేశాలనుంచి రావడం చూస్తే దీని అవసరమేమిటో తెలుస్తుంది. న్యూయార్క్‌లో వ్యాధి విస్తరణ వేగంగా వున్నదని గుర్తించాక అమెరికా సైతం ఈ మాదిరి చర్యలే ప్రకటించింది. యూరప్‌ దేశాల నుంచి రాకపోకల కారణంగానే న్యూయార్క్‌లో అధికంగా వైరస్‌ వ్యాపిస్తోందని గమనించడంతో యూరప్‌నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించింది. ఐక్యరాజ్యసమితి తన ప్రధాన కార్యాలయాన్ని మూసేస్తున్నట్టు, వేరే దేశాలకు ప్రతినిధి బృందాలను పంపడం నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. హార్వర్డ్‌ యూనివర్సిటీ  తరగతి గదుల్లో కాక ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతోంది. ఆ దేశంలోని చాలా రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. 

వేయిమందికి మించి పాల్గొనే సభలూ, సమావేశాలను రద్దు చేశారు.  అయితే వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం, రోగగ్రస్తులుగా అనుమానం వచ్చినవారిని పరీక్షించేందుకు అవ సరమైన కిట్లు అందుబాటులో వుంచడం ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. సూక్ష్మంలో మోక్షమన్నట్టు కొన్ని చిట్కాలతో అంతా సర్దుకుంటుందన్న భ్రమల్లోకి ఎవరూ జారకుండా చూడాలి. అదే సమయంలో అనవసర భయాందోళనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలి.

Advertisement
Advertisement