సురక్షిత ‘మాధ్యమాల’ కోసం...

17 May, 2019 00:07 IST|Sakshi

సామాజిక మాధ్యమాలనేవి రెండువైపులా పదునున్న కత్తి లాంటివి. ట్వీటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, యూట్యూబ్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలను అనునిత్యం వందలకోట్లమంది వీక్షిస్తున్నారు. భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ప్రపంచంలో ఎక్కడికైనా నిరంతరం స్వేచ్ఛగా ప్రవహించే ఇంటర్నెట్‌ వాహికగా ఈ మాధ్యమాలన్నీ ఇప్పుడు అరచేతుల్లోని సెల్‌ఫోన్లలో ఇమిడి పోతున్నాయి. అవి ప్రతి ఒక్కరి స్వరానికీ వేదికవుతున్నాయి. ఆశలు పెంచుకోవడానికి, అవకాశాలు అందుకోవడానికి, ఆలోచన వచ్చిందే తడవుగా దాన్ని లక్షలాదిమందితో పంచుకోవడానికి అవి తోడ్పడుతున్నాయి. వినియోగం వెనకే దుర్వినియోగం మొదలుకావడం ఎక్కడైనా ఉన్నదే. సామా జిక మాధ్యమాల్లో అది మరీ వెర్రితలలు వేస్తోంది.

మొన్న మార్చిలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చి నగరంలో ఒక ఉన్మాది మసీదుల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు సాగిస్తూ 51మందిని పొట్టనబెట్టుకుని ఆ రాక్షసకాండను ఫేస్‌బుక్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన తీరు దీనంతకూ పరా కాష్ట. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పరిరక్షిస్తూనే... మానవహక్కులకు కాస్తయినా నష్టం కలగనీయకుం డానే ఈ ఆన్‌లైన్‌ ఉన్మాదానికి అడ్డుకట్ట వేయడం ఎలాగన్నది చాన్నాళ్లుగా అందరినీ వేధిస్తున్న ప్రశ్న. బుధవారం పారిస్‌ వేదికగా జరిగిన ప్రపంచ దేశాల నాయకుల, సామాజిక మాధ్యమాల సదస్సు దీనికి సమాధానం వెదకడానికి ప్రయత్నించింది. విద్వేషపూరిత భావాల వ్యాప్తిని సామా జిక మాధ్యమాల్లో సాగనీయకూడదంటూ భారత్‌తోసహా 17 దేశాలు, 8 సామాజిక మాధ్యమాలు ఆ సదస్సులో ప్రతినబూనాయి. అదే సమయంలో భావప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. తన గడ్డపై ఉన్మాది సాగించిన హత్యాకాండతో కలవరపడిన న్యూజిలాండ్‌ దేశమే ఈ సదస్సు నిర్వహణకు చొరవచూపింది. అందరినీ సమీకరించింది. అయితే ఇంటర్నెట్‌ విశ్వ వ్యాపితమైనది. దానిద్వారా వచ్చే సమస్యలు అంతర్జాతీయ స్వభావంతో కూడుకున్నవి. ఎక్కడో ఒకచోట వాటిని అడ్డుకున్నా, మరోచోట మరోరూపంలో అవి వ్యాప్తి చెందుతాయి. నిజానికి ఇప్పుడు జరిగిన సదస్సు వల్ల వెనువెంటనే ఒరిగేదేమీ ఉండదు. ఒక సుదీర్ఘ ప్రయత్నంలో ఇది తొలి అడుగు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.

పేరేదైనా పెట్టుకోవచ్చుగానీ ఉన్మాదం బహురూపాల్లో విస్తరించి ఉంది. కొన్ని దేశాల్లో అది జాత్యహంకారంగా, మరికొన్నిచోట్ల మతదురహంకారంగా చొచ్చుకొస్తోంది. సకాలంలో ఈ పోకడ లను గమనించి సమాజం ఒక్కటిగా పోరాడకపోతే చూస్తుండగానే అవి విజృంభిస్తాయి. జర్మనీలో శరణార్ధులుగా వచ్చినవారిపై దాడులు, మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై దాడులు, సిరి యాలో యజ్దీ తెగ ముస్లింలపై మారణకాండ తదితరాలే ఇందుకు ఉదాహరణ. ఆన్‌లైన్‌ ద్వారా ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని వ్యాప్తి చేస్తూ, సమాజాలకు ముప్పు కలిగించే ధోరణులపై సమష్టిగా పోరాడాలన్నది పారిస్‌ సదస్సు సంకల్పం. ఇదంతా స్వచ్ఛందమేనని, న్యూజిలాండ్‌ ప్రధాని ఆర్డెర్న్‌ అంటున్నారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను అడ్డుకోవడం ఈ సదస్సు ఉద్దేశం కాదని చెబుతున్నారు. ఒక్కమాటలో ‘మరో క్రైస్ట్‌చర్చి మారణకాండ’ జరగకుండా చూడటమే తమ ధ్యేయమంటున్నారు. మంచిదే. ఏ మాధ్యమమైనా మనుషుల్ని కలిపేదిగా, వారిని మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లేదిగా ఉండాలి తప్ప వారిలో విద్వేషాలు పెంచేలా, ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా, హత్యాకాండను ప్రేరేపిం చేదిగా, దాన్ని ప్రత్యక్షంగా చూపేదిగా మారకూడదు. వినూత్న ఆవిష్కరణలకూ, విలక్షణ ధోరణు లకూ సామాజిక మాధ్యమాలు వేదికలైనప్పుడే భావవ్యక్తీకరణ, సృజనాత్మకత పదునుదేరతాయి. స్వేచ్ఛాస్వాతంత్య్రాలు వర్థిల్లుతాయి. 

విద్వేషాన్ని గుర్తించి సామాజిక మాధ్యమాల నుంచి దాన్ని తొలగించడం సాంకేతికంగా సాధ్య మేనని సామాజిక మాధ్యమాలు ఇన్నాళ్లూ చెబుతూ వచ్చాయి. ఫేస్‌బుక్‌ వంటివి  కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వంటి సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి నిత్యం వేలాది పోస్టిం గులు తొలగిస్తున్నామని చెప్పాయి. న్యూజిలాండ్‌ మారణకాండ ప్రత్యక్షప్రసారమయ్యే వరకూ అందరూ దీన్ని విశ్వసించారు. కానీ అదంతా భ్రమేనని తేలింది. సమర్ధవంతమైన శిక్షణ, సంపూ ర్ణమైన అవగాహన ఉండే సిబ్బంది మాత్రమే దేన్నయినా సకాలంలో గుర్తించి తొలగించగలరు. అయితే ఇందుకోసం గణనీయంగా మానవ వనరులు అవసరమవుతాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఏటా వేల కోట్ల డాలర్లు లాభాలు ఆర్జించే సంస్థలు తమ సామాజిక బాధ్యతను విస్మరిస్తు న్నాయి. జవాబుదారీతనం ఉంటుందన్న సంగతిని మరుస్తున్నాయి. ప్రభుత్వాలు సైతం ఇన్నాళ్లూ చూసీచూడనట్టున్నాయి.

అయితే పారిస్‌ సంకల్పం మంచిదేగానీ ఆచరణలో దానికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా చిత్తశుద్ధిలేని పాలకులు ఆ వంకన సహేతుకమైన విమర్శలను సైతం నిరోధించే ప్రయత్నం చేస్తారు. అలాంటి పెడధోరణులు తలెత్తకుండా ఏం చేయవచ్చునో మున్ముందు జరిగే సదస్సుల్లో ఆలోచించాల్సి ఉంటుంది. ఉగ్రవాదం, తీవ్రవాదం మాత్రమే కాదు...ఇతరత్రా అనేక రకాల ముసుగుల్లో సాగుతున్న విద్వేషం కూడా సమాజాలకు ముప్పు కలిగిస్తోంది. తమకు నచ్చని వ్యక్తులపై, గ్రూపులపై వదంతులు వ్యాప్తి చేయడం, దాడులకు పురిగొల్పడం మనదేశంలో ఇటీవలి కాలంలో పెచ్చరిల్లుతోంది. కేవలం వదంతుల కారణంగా మూకదాడులకు పలువురు బలయ్యారు. ఇక ఆన్‌లైన్‌లో మహిళలు లైంగిక వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొనడం నిత్యకృత్యం. సామాజిక మాధ్యమాలు సురక్షితంగా మారాలంటే వీటన్నిటినీ పరిహరించడమెలాగో ఆలోచించాలి. ఇన్నేళ్ల కైనా సామాజిక మాధ్యమాల దుష్ఫలితాలపై ఉన్నత స్థాయిలో చర్చ మొదలైంది గనుక కేవలం ఉగ్ర వాదం, తీవ్రవాదంవంటివేకాక, ఇతరేతర అంశాలు సైతం ఇందులో చేరాలి. ‘క్రైస్ట్‌చర్చి పిలుపు’ మరింత అర్ధవంతంగా మారాలంటే  సామాజిక మాధ్యమాలకు జవాబుదారీతనం అలవర్చాలి.

మరిన్ని వార్తలు