తీరుమారని కాంగ్రెస్! | Sakshi
Sakshi News home page

తీరుమారని కాంగ్రెస్!

Published Sun, May 25 2014 12:07 AM

general election fails of congress but not no Purge of the  party

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కాంగ్రెస్‌లో ఎప్పటిలా స్క్రిప్టు ప్రకారమే వరస పరిణామాలు సంభవిస్తున్నాయి. పార్టీ పదవుల నుంచి సోనియా, రాహుల్‌గాంధీ  తప్పుకుంటారన్నది మీడియాలో వచ్చిన తొలి కథనం. సహజంగానే ఈ కథనానికి అధినేతల వందిమాగధులు తీవ్రంగా స్పందించారు. అదే జరిగితే మిన్ను విరిగి మీద పడుతుందన్నంత హడావుడి చేశారు. అటు తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై వీరిద్దరి రాజీనామాలు అవసరం లేదని నిర్ణయించింది. సాధారణంగా అయితే ఈ మొత్తం ప్రహసనం అక్క డితో ముగిసిపోయి ఉండేది. కానీ, మిలింద్ దేవరా వంటివారు ఇంకొంచెం ముందుకెళ్లి ఈ నేతల సలహాదార్లపై పడ్డారు. వీరివల్లే పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శలు మొదలెట్టారు. సలహాలి చ్చిన వారూ, తీసుకున్నవారు కూడా ఓటమికి కారకులేనని తేల్చారు. ఆ రకంగా రాహుల్‌గాంధీ నిర్వాకాన్ని కూడా పరోక్షంగా ఎత్తిపొడి చారు. ఇది తగలవలసినవారికే తగిలింది. ఇంకేం... రాహుల్ బ్రిగేడ్ రంగంలోకి దిగిపోయింది. మిలింద్‌ను దుమ్మెత్తిపోయడం ప్రారం భించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ శనివారం ఎన్నిక కావడంతో ఇదంతా ఆగిపోయింది. మళ్లీ మరో ఓటమి సంభవించేవరకూ కాంగ్రెస్‌లో ఇక అంతా ప్రశాంతమే!
  ప్రజాస్వామ్యంలో గెలుపోటములనేవి సర్వసాధారణం. వాటిని బట్టి మాత్రమే ఒకరి నాయకత్వ పటిమను నిర్ణయించడం సాధ్యం కాదు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్‌కు దాపురించిన ఓటమి సామాన్య మైనది కాదు... 128 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగనిది. ప్రజల ఆగ్రహాన్ని పసిగట్టలేకపోయామని ఇప్పుడు సోనియాగాంధీ అంటున్నారుగానీ...అందులో ఏమాత్రం వాస్తవం లేదు.  నిరుడు జన వరిలో రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో మేధోమథన సదస్సు జరిగిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆమె పార్టీ పతనావస్థను స్పష్టంగానే చెప్పగలిగారు.

అధికారంలేనిచోట పార్టీ బలం పెరగక పోగా, ఉన్నచో ట నానాటికీ క్షీణిస్తున్నామని వాపోయా రు. ‘మారుతున్న భారతదేశాన్ని’ గుర్తించ లేకపోతున్నామని ఎన్నెన్నో ఆశలతో... అవి భగ్నంకావడంవల్ల వస్తున్న అసహనంతో రగులుతున్న యువ తరానికి దూరమవుతున్నామని చెప్పారు. ఆమె ఆనాడు చెప్పిందంతా పార్టీపై జనంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహం గురించే. మరి ఇప్పుడు తెలియదని బుకాయించడమెందుకో అర్థంకాని విషయం. ఇంతకూ  జైపూర్ సదస్సు చేసిందేమిటి? వరస కుంభకోణాల వ్యవహారంపైనా, వాటిపై యూపీఏ సర్కారు ప్రవర్తిస్తున్న తీరుపైనా చర్చేమైనా జరి గిందా? దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారా? అప్పటికి లోక్‌సభ ఎన్నికలకు ఏడాదిన్నర గడువున్నందువల్ల నిజాయితీగా ఇలాంటి పనులు చేసివుంటే పార్టీ ఇంత దారుణమైన వైఫల్యాన్ని చవిచూసేది కాదు. కానీ, అక్కడ జరిగింది వేరు. సినిమాల్లో అతిథి పాత్రలా తళు క్కున మెరిసి మాయమయ్యే రాహుల్ గాంధీకి పార్టీ ఉపాధ్యక్షుడిగా కిరీటధారణ పూర్తిచేసి సదస్సు అయిందనిపించారు. ఆ సదస్సులో సోనియా ప్రసంగమంతా మెహర్బానీకే తప్ప నిజంగా పార్టీని ప్రక్షాళన చేయడానికి కాదని అప్పుడే అందరికీ అవగాహన అయింది.

 జైపూర్ సదస్సులో అలా ‘అధివాస్తవిక’ భాషలో మాట్లాడకుండా ఆమె నేరుగా ఆత్మవిమర్శ చేసుకుని ఉంటే, సమస్యంతా తమతోనే ఉన్నదని గుర్తించివుంటే...మిగిలినవారికి అది ఆదర్శమై వారు కూడా తమ తప్పిదాలను గుర్తించి సరిదిద్దుకునేవారు. పార్టీకి జవజీవాలు కల్పించేందుకు నడుం బిగించేవారు. భవిష్యత్తు అడుగంటిన పార్టీగా కాంగ్రెస్‌కు అలాంటి ప్రక్షాళన అవసరం చాలా ఉంది. కానీ, అదేమీ జరగకపోవడంతో కాంగ్రెస్ ఇప్పుడు లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష నాయకత్వ హోదా కూడా కరువై బావురుమంటున్నది. మన రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కనుమరుగు కాగానే కాంగ్రెస్ అధినాయకత్వం సీబీఐ వంటి వ్యవస్థలను అడ్డంపెట్టుకుని ఆయన కుటుంబాన్ని ఎంతగా వేధించిందో అందరూ చూశారు. అటు తర్వాత వెల్లువెత్తిన తెలంగాణ ఉద్యమంపై ఎంత బాధ్యతారహి తంగా వ్యవహరించిందో... చివరి నిమిషంలో ఓట్లు, సీట్లతో ముడి పెట్టి ఏ రకంగా దానికి ముగింపు పలికిందో అందరూ గమనించారు. ఈ తీరు అటు సీమాంధ్రలో సరే...తెలంగాణలో సైతం కాంగ్రెస్‌పై ఏ వగింపు కలిగించింది. అందువల్లే రెండుచోట్లా ఆ పార్టీకి తీవ్ర పరాభ వం ఎదురైంది. ఇలాంటి పరిణామాల ప్రభావం మిగిలినచోట్ల కూడా పడి ఆ పార్టీ దుంపనాశనం కావడానికి దోహదపడింది. స్థానికంగా పట్టు కలిగినవారిని చూసి బెదిరిపోతూ... పార్టీని వందిమాగధుల సత్రంగా మార్చాక, వేధించడం ద్వారా ఎవరినైనా దారికి తెచ్చుకోవ చ్చునన్న భ్రమలో కూరుకుపోయాక కాంగ్రెస్‌కు ఈ దుస్థితి ఏర్పడ టంలో వింతేమీ లేదు. అలా జరగకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి.

 పంచాయతీ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తుల్ని సలహా దార్లుగా పెట్టుకుని వారు చెప్పినట్టల్లా ఆడిన ఈ నేతలు తమతోపాటు మిత్రపక్షాల్ని కూడా ముంచేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయపక్షాలు అధికారంలోకి లేదా అధికారానికి చేరువగా రాగలిగినా తాము మాత్రం కాంగ్రెస్‌తో జతకలవడంవల్ల దారుణంగా నష్టపోయామని ఎన్‌సీపీ నేత శరద్ పవార్ అన్నదాన్లో నూటికి నూరుపాళ్లూ వాస్తవం ఉంది. ఇంత జరిగాకైనా సోనియా, రాహుల్ తమ తప్పుల్ని గుర్తిస్తే బాగుండేది. పార్టీకి అంకితభావంతో సేవలందిస్తున్నవారికి బాధ్య తలు పంచుతామన్న సూచనలు పంపివుంటే సబబుగా ఉండేది. కానీ, ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకుంటున్న దాఖలాలు లేవు. సరికదా ఇప్పటికీ సోనియా బింకంగానే ఉన్నారు. మళ్లీ గత వైభవం సాధ్యమేనని దబాయిస్తున్నారు. ఇక ఈ పార్టీని రక్షించేదెవరు?

 

Advertisement
Advertisement