నెత్తురోడిన అఫ్ఘాన్‌ | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన అఫ్ఘాన్‌

Published Fri, Jun 2 2017 1:31 AM

he blasted himself made 90 dead in afghanistan

బాంబు పేలుళ్లు రివాజుగా మారిన అఫ్ఘానిస్తాన్‌లో మరోసారి నెత్తురొలికింది. బుధవారం కాబూల్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతం గ్రీన్‌ జోన్‌లో ఒక దుండగుడు ట్రక్కుతో వచ్చి తనను తాను పేల్చుకుని 90 మంది ఉసురు తీశాడు. ఈ ఉదంతంలో 400 మంది గాయపడ్డారు. మృతుల్లో, గాయపడ్డవారిలో అత్యధికులు అఫ్ఘాన్‌ పౌరులు. ఆ దేశాన్ని ఏం చేయాలన్న అంశంలో అగ్రరాజ్యాలు చర్చోపచర్చలు, కుటిల ఎత్తుగడలు కొనసాగిస్తుంటే... ఉగ్రవాదులు తమ వంతుగా నరమేథాన్ని యథాప్రకారం అమలు చేస్తున్నారని ఈ ఉదంతం తేటతెల్లం చేసింది. అఫ్ఘాన్‌లో కేవలం 55 శాతం భూభాగంలో మాత్రమే ప్రభుత్వ పెత్తనం ఉంటుంది. భద్రతా బలగాల మోహరింపు అక్కడికే పరిమితం. మిగిలిన 45 శాతంలో తాలి బన్లదే రాజ్యం. దాదాపు మూడున్నర కోట్ల జనాభాలో కోటిన్నర మంది వారి ఏలుబడిలోనే ఉన్నారు. ప్రభుత్వ పాలన సాగే ప్రాంతాల్లో... మరీ ముఖ్యంగా ప్రభుత్వాధినేతలు, ఉన్నతాధికార గణం, పాశ్చాత్య దేశాల బలగాలు, వివిధ దౌత్య కార్యాలయాలు ఉన్న దేశ రాజధాని కాబూల్‌లో దాడులకు పాల్పడటం, భారీ నష్టం కలిగించాలని చూడటం తాలిబన్‌లు, ఇతర మిలిటెంట్‌ సంస్థల లక్ష్యం. తాజా దాడికి తమ బాధ్యత లేదని తాలిబన్‌లు ప్రకటించగా, పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ కనుసన్నల్లోని హక్కానీ నెట్‌వర్క్‌దే బాధ్యతని అఫ్ఘాన్‌ ప్రభుత్వం ఆరో పిస్తోంది. దశాబ్దాలు గడిచినా అఫ్ఘాన్‌ను ఆవరించిన అయోమయం అణుమాత్ర మైనా పోలేదని ఈ ఉదంతం రుజువుచేసింది.

ఒకప్పుడు అఫ్ఘాన్‌ తలరాతను నిర్దేశించిన అమెరికా... డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్య క్షుడయ్యాక నిర్లిప్తంగా ఉండటం మొదలెట్టింది. నాటో సేనలను పూర్తిగా ఉపసం హరించే ప్రక్రియను ప్రారంభిస్తామని, అఫ్ఘాన్‌ దళాలే ఇకపై ఉగ్రవాదంపై పోరాడ తాయని తన పాలన చివరి దశలో ఒబామా ప్రకటించడం వాస్తవమే అయినా విధాన నిర్ణయాల్లో దాని జోక్యం తగ్గలేదు. కానీ ట్రంప్‌ వచ్చాక ఈ పరిస్థితి కూడా మారింది. అఫ్ఘాన్‌పై దాని వైఖరేమిటో తెలియని అయోమయం నెలకొంది. సరిగ్గా ఈ స్థితిని సద్వినియోగం చేసుకోవాలని రష్యా ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు తనను లక్ష్యంగా చేసుకుని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ సృష్టించిన తాలిబన్‌లనే అది దువ్వుతోంది. లేని పెద్దరికం తెచ్చుకుని ఆ దేశాన్ని బాగుచేయడానికంటూ ప్రయ త్నాలు ప్రారంభించింది. ఇందుకు తన కారణాలు తనకున్నాయి. పూర్వపు సోవి యెట్‌ ప్రాంతాలైన తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్‌లు అఫ్ఘాన్‌కు ఇరుగు పొరుగు దేశాలు. అఫ్ఘాన్‌లో అడుగుపెట్టిన ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)తో ఈ దేశాలకు భవిష్యత్తులో ముప్పు కలగవచ్చునన్నది రష్యా వాదన. ఇవన్నీ ప్రస్తుతం రష్యా మిత్ర దేశాలుగా ఉంటున్నాయి. చెచెన్యా ప్రాంతంలో సైతం ఐఎస్‌ తమకు తల నొప్పిగా మారవచ్చునని రష్యా చెబుతోంది. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ రష్యా తాజా ఎత్తుగడలపై నిరసన వ్యక్తం చేశాక, తాలిబన్‌లకు రష్యా ఆయుధాలు సరఫరా చేస్తున్నదంటూ అఫ్ఘాన్‌లోని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ చీఫ్‌ జనరల్‌ జోసెఫ్‌ వోటెల్‌ ఆరోపించాక ఆ దేశానికి మరో 5,000మంది సైనికులను పంపు తామని గత నెలలో ట్రంప్‌ ప్రకటించారు. అది క్రమేపీ అమెరికా–రష్యా వైషమ్యా లకు దారితీసినా తీయవచ్చు.  

అదే జరిగితే ఇప్పటికే అధ్వాన్నంగా ఉన్న అఫ్ఘాన్‌ను అది మరింత సంక్షో భంలోకి నెట్టేస్తుంది. వాస్తవానికి 40 ఏళ్లక్రితం జరిగిన సోవియెట్‌ దురాక్రమణ మొదలుకొని అప్పుడప్పుడు మినహా నిత్యం అది సంక్షోభాల్లోనే కాలం వెళ్లదీ స్తోంది. ఇప్పటికి 10 లక్షలమంది ప్రాణాలు కోల్పోగా ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట అమెరికా 17 ఏళ్లక్రితం ప్రారంభించిన దాడుల్లో లక్షా 70 వేలమంది అఫ్ఘాన్‌ పౌరులు, 2,400మంది అమెరికా సైనిక సిబ్బంది, మరో 1,200మంది నాటో సైని కులు మరణించారు. దాదాపు 80 లక్షలమంది పౌరులు చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. రష్యా కొత్త ఎత్తుగడలు అఫ్ఘాన్‌ను ఏ దిక్కు నడిపిస్తాయో అనూహ్యం. ఇప్పటికైతే తాలిబన్‌లకు ఆయుధాలిస్తున్నామన్నది తప్పుడు ప్రచారం మాత్రమే నని రష్యా కొట్టిపారేస్తోంది. ఇందులో నిజానిజాల సంగతలా ఉంచి అఫ్ఘాన్‌ విష యంలో దాని వైఖరి భారత్‌ భద్రతకు కూడా ముప్పుగా పరిణమించింది. నిరుడు డిసెంబర్‌లో తొలిసారి అఫ్ఘాన్‌పై నిర్వహించిన సదస్సుకు పాకిస్తాన్, చైనాలను మాత్రమే రష్యా ఆహ్వానించింది. దీనిపై అఫ్ఘాన్‌ నిరసన వ్యక్తం చేశాక రెండో సద స్సుకు ఆ దేశాన్ని, దానితోపాటు భారత్‌ను పిలిచింది. మూడో సదస్సు ఏప్రిల్‌ నెలలో జరిగింది. ప్రధాన పాత్రధారిగా ఉన్న అమెరికాకు ఈ సదస్సుల్లో ఒక్కదానికి కూడా పిలుపురాలేదు. ఐఎస్‌ను వ్యతిరేకించడం వరకూ తాలిబన్‌ లక్ష్యమూ, తమ లక్ష్యమూ కలుస్తాయని అఫ్ఘాన్‌లో పుతిన్‌ దూత జమీర్‌ కబులోవ్‌ ఏడాదిక్రితం ప్రకటించారు.

ఈ వైషమ్యాల సంగతలా ఉంచి తాజా ఉదంతం ఉగ్రవాదులకున్న పట్టును రుజువుచేస్తోంది. గ్రీన్‌జోన్‌ వరకూ వారు చొచ్చుకు రాగలగటం సాధారణ విషయం కాదు. దేశంలో 40 శాతం మించి నిరుద్యోగిత ఉంది. ఒక్క కాబూల్‌లో తప్ప ఎక్కడా ఉపాధి దొరకదు. అత్యధికులు అక్కడికే వలస వస్తుండటం వల్ల ఆ అవ కాశాలు కూడా అంతంతమాత్రమే. పొరుగునున్న ఇరాన్, పాకిస్తాన్‌లకూ, జర్మనీ వంటి దేశాలకూ చట్టవిరుద్ధంగా వెళ్లినవారిని తిప్పిపంపేస్తున్నారు. గ్రీన్‌జోన్‌లో ఉపాధి లభించినవారికి మాత్రమే ఉద్యోగభద్రత, ఉన్నంతలో మెరుగైన జీవితం, స్థిరత్వం సాధ్యమవుతోంది. అక్కడుంటున్న తమ తోటి పౌరులపట్ల సహజంగానే అఫ్ఘాన్‌ ప్రజల్లో ఉండే ఆగ్రహం, ఈర్ష్య వగైరాలను సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా ఉగ్రవాదులు తాజా దాడికి పాల్పడ్డట్టు కనిపిస్తోంది. ఇకనైనా అగ్రరాజ్యాలు ఆ దేశాన్ని తమ సొంత ఎస్టేట్‌గా భావించి ఇష్టానుసారం వ్యవహరించడంకాక ఐక్య రాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలు ఆలంబనగా, అందరి భాగస్వామ్యంతో ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి. అందుకు భిన్నంగా పాత రోత విధానాలనే కొనసాగిస్తే అఫ్ఘానిస్తాన్‌ సాధారణ ప్రజానీకం మాత్రమే కాదు...  ప్రపంచ పౌరులు కూడా వాటిని క్షమించరు.

 

Advertisement
Advertisement