జయంతి ‘లెటర్ బాంబు’ | Sakshi
Sakshi News home page

జయంతి ‘లెటర్ బాంబు’

Published Sat, Jan 31 2015 3:41 PM

jayanthi natarajan to make blast a bomb of letter

నిజాలు ఎల్లకాలమూ దాగవు. సమయం, సందర్భం చూసుకుని బద్దలుకాక మానవు. మరికొన్నాళ్లలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న వేళ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి జయంతీ నటరాజన్ ఒక్కసారిగా ‘లెటర్‌బాంబు’ పేల్చారు. ఎలాంటి పదవీ వ్యామోహమూ లేని గొప్పవ్యక్తిగా తరచు పార్టీలోని కోటరీనుంచి కితాబులందుకునే రాహుల్‌గాంధీ ప్రభుత్వ వ్యవహారాల్లో తరచు ఎలా జోక్యం చేసుకునేవారో ఆమె సోనియాగాంధీకి రాసిన లేఖ వెల్లడించింది. అందులో సోనియా ప్రస్తావనా ఉన్నది.
 
 2013 డిసెంబర్‌లో హఠాత్తుగా ఆమెతో రాజీనామా చేయించిన రోజున అధినాయకత్వం ఏం చెప్పింది? ఎన్నికలు ముంచుకొస్తున్నందు వల్ల కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలనుకున్నామని, అందులో భాగంగానే జయంతి తప్పుకున్నారని వివరించింది. అయితే, భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య(ఫిక్కీ) సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగించడానికి కొన్ని గంటలముందు ఈ రాజీనామా వ్యవహారం చోటు చేసుకోవడంతో ఆ మాటల్ని ఎవరూ నమ్మలేదు. ఆయన ఆ రోజు ప్రత్యేకించి పారిశ్రామికవేత్తలు పడుతున్న ‘కడగండ్ల’ను వారికంటే ముందు తానే పూసగుచ్చినట్టు చెప్పారు. ప్రాజెక్టుల ఆమోదంలో సాగే జాప్యంవల్ల దేశ వ్యవస్థకు ఎంత చేటు కలుగుతుందో ఏకరువు పెట్టారు. ఎందరికో ఉపాధి కలిగించే ప్రాజెక్టులపై తుది నిర్ణయం తీసుకునే అధికారం పర్యావరణ మంత్రి దగ్గరో, ముఖ్యమంత్రి దగ్గరో ఉండిపోవడమేమిటని ఆవేదనపడ్డారు.
 
 ఆ అధికారం ప్రాజెక్టును పెట్టే పారిశ్రామిక వేత్తలకే దఖలుపర్చాలన్నది ఆయన ఉద్దేశమేమోనని కొందరు ఆరోజు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అటు ఆమె రాజీనామానూ, ఇటు రాహుల్ వ్యాఖ్యలనూ కలిపి చదువుకున్న వారికి తెరవెనక ఏం జరిగి ఉంటుందో సులభంగానే బోధపడింది. పర్యావరణం విషయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలకూ ఉన్న చిన్న చూపే మన దేశం లోనూ మొదటినుంచీ సాగుతున్నది. అందుకు సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని 1985 నాటికిగానీ అనుకోలేదంటేనే దీనిపై ఉన్న నిర్లక్ష్యం ఏపాటో తెలుస్తుంది. ఆ మంత్రిత్వ శాఖ క్రియాశీలంగా వ్యవహరించడం కూడా తక్కువే. ఆ శాఖ తన బాధ్యతను విస్మరిస్తున్నదని పర్యావరణవేత్తలు ఆరోపించినప్పుడో... తమ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంలో ఎడతెగని జాప్యం చేస్తున్నారని పారిశ్రామికవేత్తలు నిందవేసినప్పుడో అలాంటి శాఖ ఉందని నలుగురికీ తెలుస్తుంది. ఆ శాఖ పనితీరు ప్రభుత్వానికుండే రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఉంటుందే తప్ప పర్యావరణ ప్రయోజనాలతో ముడిపడి ఉండాలన్న స్పృహ తక్కువన్న విమర్శలున్నాయి.
 
 అయితే, జయంతి నటరాజన్‌పై వెలువడిన ఆరోపణల సంగతెలా ఉన్నా ఉన్నంతలో ఆ శాఖను సమర్థవంతంగానే నిర్వహించారని ఆమె అనంతరం ఆ శాఖ బాధ్యతలను చేపట్టిన మొయిలీ ఆదరా బాదరా నిర్ణయాలు గమనిస్తే అర్థమవుతుంది. కేవలం 20 రోజుల వ్యవధిలో ఆయన 70 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేశారు. వీటి మొత్తం విలువ లక్షన్నర కోట్ల రూపాయల పైమాటే. జయంతిపై ఆరోపణలు లేవని కాదు. ఆమె రాజీనామా అనంతరం కాంగ్రెస్‌నుంచిగానీ, ప్రభుత్వంనుంచిగానీ అధికారికంగా ఎలాంటి వివరణా రాకపోగా ఆ రెండువైపులనుంచీ విస్తృతంగా లీకులు వెలువడ్డాయి. అనుమతుల కోసం పారిశ్రామికవేత్తలు ఆమెకు ముడుపులు చెల్లించాల్సివచ్చేదన్నది ఆ లీకుల సారాంశం. వాటి ఆధారంగానే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రచార సారథిగా వ్యవహరించిన ప్రధాని నరేంద్ర మోదీ ‘జయంతి టాక్స్’ అనే పదబంధాన్ని అప్పట్లో తన సభల్లో ఎక్కువగా ప్రయోగించారు. కానీ ఆమె వ్యక్తిత్వాన్ని పట్టి ఇచ్చే సందర్భం ఒకటుంది.
 
 జన్యు పరివర్తిత పంటల క్షేత్రస్థాయి పరిశోధనలకు అనుమతించరాదని సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలనుకున్నప్పుడు ఆమె దాన్ని గట్టిగా వ్యతిరేకించి ఆపేయించారు. జైరాం రమేష్ ఆ శాఖను చూసినప్పుడు కూడా అనుమతులు రాని పోస్కో, గోరఖ్‌పూర్ అణు విద్యుత్ ప్రాజెక్టువంటి వాటికి జయంతి తర్వాత మొయిలీయే అనుమతులిచ్చారు. ఇలాంటి ఉదాహరణలే ఆమె నిజాయితీని చెబుతాయి. తనపై కావాలని లీకులిస్తున్న తీరుతో ఆత్మాభిమానం దెబ్బతిన్న జయంతి ఎప్పటికీ అలా మౌనంగా ఉండిపోతారని ఆశించడం కాంగ్రెస్ నేతల తెలివితక్కువ తనమే అవుతుంది.
 
 ఇప్పుడామె రాహుల్, సోనియాల జోక్యం గురించి వెల్లడించిన అంశాలు చూస్తే తల్లీకొడుకులు జవాబుదారీతనంలేని అధికారాన్ని ఎలా అనుభవించారో అర్ధమవుతుంది. వేదాంత ప్రాజెక్టుకు అనుమతి నిరాక రించాలని రాహుల్‌గాంధీ కార్యాలయం నుంచి సూచనలు రావడం... కొన్ని ప్రాజెక్టుల అనుమతుల విషయంలో గిరిజన హక్కుల సంగతి చూడమని సోనియాగాంధీ లేఖలు రాయడం, వాటికి సంబంధించి తాను ఎప్పటికప్పుడు ఆమెతో మాట్లాడటం వంటివి జయంతి ప్రస్తావించారు. మంచి సలహాలు ఎవరిచ్చినా తప్పులేదు.
 
 కానీ, ఎంత సొంత ప్రభుత్వమైనా అందుకొక పద్ధతి, విధానం ఉండాలి. తెరవెనక ఉండి సలహాలివ్వ డంలో ఒక వెసులుబాటు ఉంటుంది. ఆ సలహా వికటించినప్పుడు ఆ చెప్పినవారికి ఎలాంటి బాధ్యతా ఉండదు. తప్పంతా ఆచరించినవారిపై నెట్టేయొచ్చు. జయంతికి జరిగింది ఇదే. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటం తమ విజయావ కాశాలను దెబ్బతీస్తున్నదని గుర్తించిన వెంటనే వెనకా ముందూ చూడకుండా ఆమెను బలిపశువును చేసి తాము మాత్రం కార్పొరేట్ ప్రపంచానికి అనుకూలమే అనే అభిప్రాయం రాహుల్ గాంధీ కలిగించబోయారు. ఇన్నాళ్లకు జయంతీ నటరాజన్‌కు అవకాశం చిక్కింది. సోనియాకు ఎప్పుడో రాసిన లేఖను లీక్ చేయడంతో పాటు ఆమె పార్టీ నుంచి కూడా తప్పుకున్నారు. తనకు చేతనైన పద్ధతుల్లో ప్రతీకారం తీర్చుకున్నారు. అది గుర్తించకుండా జయంతి వెనక బీజేపీ ఉన్నదని, ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నదని కాంగ్రెస్ ఆక్రోశించడం వృథా ప్రయాస.

Advertisement
Advertisement