సప్తపర్ణి: చిత్రకళకు విలువైన చేర్పు | Sakshi
Sakshi News home page

సప్తపర్ణి: చిత్రకళకు విలువైన చేర్పు

Published Mon, Sep 16 2013 12:07 AM

సప్తపర్ణి: చిత్రకళకు విలువైన చేర్పు

తాజా పుస్తకం
 
 ‘కాదేది కవితకనర్హం’ అని శ్రీశ్రీ అంటే ‘కాదేదీ కుంచెకనర్హం’ అంటాడు చిత్రకారుడు. కాని కవనాన్నీ కుంచెనూ సమపాళ్లలోనే వొదిగించ వచ్చునన్నది శ్రీనాథుడి విశ్వాసం. సూర్యుడు కుంచెగా సూర్యకిరణాలు ఏడు వర్ణాలుగా తనకు ఎలా కనిపించాయో శ్రీనాథ మహాకవి చూపించాడు. ఎలా? నిండు వెన్నెలలోని తెల్లదనాన్ని కొంత వేరు చేసి దాన్ని సున్నపునీరుగాను, అతి సుకుమారమైన లేత చీకటి వన్నెను ఒక పాలుగా కలిపి బురదరంగుగాను, అప్పుడప్పుడే విచ్చుకుంటున్న తామర మొగ్గలలోని పుప్పొడి పరాగాలను పసుపచ్చని దినుసుగాను, ఎర్రని వన్నెగల లేత ఉదయ సంధ్యలోని అందమైన అరుణ వర్ణాన్ని జేగురురాయి రంగుగాను కలిపి- ఈ రంగులన్నీ ఒకే సమయంలో సమకూరి రాత్రి తెల్లవారిపోయిం తర్వాత మనకు కన్పించే దృశ్యమేమిటట? ‘మెడలో మాణిక్యాలు పొదిగిన హారంతో తూర్పు దిక్కు అనే అందమైన అమ్మాయి’! అంటే ఇక్కడ కవి చిత్రకారుడిగా మారాడు.

 

కాని బొమ్మ కట్టలేకపోయాడు. ఆ భావానికి పరిపూర్ణ రూపం ఇవ్వగలిగేవాడు చిత్రకారుడు మాత్రమే. అలాంటి చిత్రకారులకు కిరీటం పెట్టిన పుస్తకమే ఈ ‘సప్తపర్ణి’.
 
 ప్రపంచ చిత్రకళారంగంలో ఎందరో మహానుభావులున్నారు. మహర్షులున్నారు. అయితే వీరిలో చాలామంది పేర్లు వినడమూ చెదురుమదురుగా కొన్ని వివరాలు చదవడం తప్ప వీరందరి గురించి సమగ్రమైన వ్యాసాలను ఒకచోట చదివే అవకాశం తెలుగు పాఠకులకు అంతగా దక్కలేదు. ఆ లోటు తీర్చే పుస్తకం ఇది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులైన చిత్రకారులను, వారి కళాసృష్టిని రసమయ వ్యాఖ్యానంతో, వర్ణచిత్ర సంచయంతో గుది గుచ్చి  కళావిమర్శకుడు కాండ్రేగుల నాగేశ్వరరావు రూపొందించిన గ్రంథం ఇది.  నేత్రపర్వంగా ఉన్న గ్రంథం. నేడొక విశ్రాంత ఉన్నతాధికారిగా ఉన్న నాగేశ్వరరావు దేశవ్యాప్తంగా అనేక చిత్రకళా ప్రదర్శనలను, మ్యూజియంలను సందర్శిస్తూ, స్వీయ అధ్యయనం ద్వారా గడించిన పరిజ్ఞానాన్ని  సవివరంగా, తులనాత్మకంగా, స్థూలంగా దఫదఫాలుగా ‘మిసిమి’ పత్రికలో రాస్తూ వచ్చారు. ఇప్పుడు వాటన్నింటిని కలిపి ఈ పుస్తకంగా తీసుకొచ్చారు. ఇందులో  పికాసో (గుయెర్నికా చిత్రం),  లియోనార్డో  దావించి (మొనాలిసా), డచ్ చిత్రకారుడు వెర్మీర్, డాలీ, మైఖెలాంజిలో, రింబ్రాండ్, నికొలస్ రోరిక్ తదితర చిత్రకారుల కళాసృష్టిలోని ఔన్నత్యాన్ని వివరించడంతోపాటు రెండవ ప్రపంచ యుద్ధానికి కాల్దువ్విన యూదుజాతి విద్వేషి,

 
 ఫాసిజానికి మార్గం తీసిన జర్మన్ నియంత హిట్లర్ చిత్రకారుడుగా ఎలా అవతరించిందీ సోదాహరణంగా వివరిస్తాడు గ్రంథకర్త. అలాగే రెండు ప్రపంచయుద్ధా ల మధ్య కకావికలమైపోయిన సామాన్య ప్రజాబాహుళ్యం జీవితాలను, కష్టాలను ప్రతిబింబిస్తూ,  అగ్రరాజ్య ఆధిపత్యపు రాక్షసత్వంపైన తమ చిత్రకళ ద్వారా విరుచుకుపడిన మహా కళాకారుల నిరసన చిత్రాలూ ఇందులో ఉన్నాయి. ఈ
 నిరసన కళల నుంచి విధ్వంసక, తిరుగుబాటు ఉద్యమాలు చిత్ర విచిత్ర పేర్లతో, సిద్ధాంతాలతో దూసుకువచ్చాయి.  అధివాస్తవికతా, ప్రతీకవాద కళారూపాలు వెలశాయి. గందరగోళానికి మారుపేరుగా నిలిచాయి. అరాచక ప్రక్రియ కొన్నాళ్లు ఆదర్శ కళారూపమయింది. ఇదే దశలో నిరాశావాదానికి ప్రతిబింబంగా రూపంతో నిమితంలేని నైరూప్య (ముక్కు ముఖం లేని, చిత్రకారుడు వచ్చి వివరిస్తే గాని) చిత్రకళ రంగంలోకి వచ్చింది. ఈ అరాచక రూపాలు అనేకం ఆదర్శవాదం, వాస్తవికవాదం, కాల్పనిక వాదనానంతర దశలో పుట్టుకొచ్చినవి- అనుభవవాదం (ఇంప్రెషనిజం), అసంప్రదాయ వర్ణచిత్రణవాదం లేదా హేళనకళావాదం (ఫావిజం),
 స్థూలతావాదం (క్యూబిజం), కాలాన్ని, కాలగతినీ ప్రేక్షకుడి, అనుభూతికి తెచ్చిన అనాగతావాదం (ఫ్యూచరిజం), అభివ్యక్తివాదం (ఎక్స్‌ప్రెషనిజం), అధివాస్తవికవాదం (సర్రియలిజం), నైరూప్య చిత్రకళ (ఆబ్‌స్ట్రాక్ట్), నిరాశతో కూడిన గందరగోళ వాదం (డాడాయిజం), అతుకు చిత్రకళావాదం (కొల్లేజి) వగైరా వాదాలు!  వీటన్నింటి చర్చ ఈ గ్రంథంలో కనిపించి పాఠకుడి, చిత్రకళా ప్రేమికుడి అవగాహనను ఇనుమడింప చేస్తుంది.

 


 అలాగే మన భారతీయ చిత్రకారులు సత్వల్కర్, రాజా రవివర్మ, మంజిత్‌బావా, శక్తి బర్మన్, నందలాల్ బోస్, అమృత షేర్‌గిల్, ఎంఎఫ్ హుస్సేన్...  ఆంధ్రప్రదేశ్  ప్రసిద్ధ చిత్రకారులు, ఛాయాగ్రాహకులు కొండపల్లి  శేషగిరిరావు, ఆచార్య పట్నాయక్, రాజన్‌బాబు, చీమకుర్తి శేషగిరిరావు, కాపు రాజయ్య, ఏలే లక్ష్మణ్, వైకుంఠం, జగదీష్, పిలకా నరసింహమూర్తి, భరత్ భూషణ్ తదితరులపై వ్యాసాలున్నాయి. కేవలం చిత్రకారులే కాక కేశవరెడ్డి, రావిశాస్త్రి వంటి రచయితల గురించి సిటిజన్ కేన్, బైజు బావరా వంటి సినిమాల గురించి... ఒకటనేమిటి మానసిక ప్రపంచంలో తేజస్సును నింపే అనేకానేక విలువైన వివరాల సంకలనం- సప్తవర్ణాల కాంతి- ఈ పుస్తకం. చిత్రకళను ఇష్టపడే ప్రతి ఒక్కరూ దీనిని పరిశీలించాలి. చిత్రకళ పట్ల అభిరుచిని వర్తమానంలో ఉన్నవారికీ, భావితరాల వారికీ చేరువ చేసే ఇలాంటి మంచి ప్రయత్నం కన్నుల పండువగా చేసిన నాగేశ్వరరావు అభినందనీయులు.
 - ఎ.బి.కె. ప్రసాద్
 
 సప్తపర్ణి- కాండ్రేగుల నాగేశ్వరరావు; చిత్రకళ, చిత్రకారుల పరిచయ వ్యాసాలు (వర్ణ
 చిత్రాలతో); అన్ని పేజీలూ రంగుల్లో ఉన్న హార్డ్ బౌండ్ పుస్తకం; 334 పేజీలు. రూ. 777; ప్రతులకు: 99480 83387
 

Advertisement
Advertisement