Sakshi News home page

మహా మనీషి మండేలా!

Published Sat, Dec 7 2013 4:51 AM

మహా మనీషి మండేలా!

సంపాదకీయం: ప్రపంచంలో దోపిడీ, పీడన ఉన్నంతవరకూ పోరాట యోధులు పుట్టుకొస్తూనే ఉంటారు. వారు తమ తరాన్ని మాత్రమే కాదు... తరతరాలను ప్రభావితం చేస్తూనే ఉంటారు. శుక్రవారం వేకువజామున అస్తమించిన నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అలాంటి ప్రజా పోరాటయోధుడు. దక్షిణాఫ్రికా దేశాన్ని దశాబ్దాలపాటు పట్టిపీడించిన శ్వేతజాత్యహంకారంపై మడమ తిప్పని పోరాటం చేసిన సేనాని ఆయన. నేలతల్లి ఒడిలో సకల సంపదలూ ఉన్నా వలసపాలకుల దోపిడీలో చిక్కిశల్యమైన దక్షిణాఫ్రికాలో తోటి ప్రజలకోసం ఏమైనా చేయాలన్న తపనతో యుద్ధరంగంలోకురికిన మండేలా... తన శత్రువెవరో, తాను చేయాల్సిన పోరాటం ఎలాంటిదో సంపూర్ణంగా తెలుసుకుని ఉద్యమించాడు. స్వేచ్ఛా సమరమంటే సభలు పెట్టడం, ప్రసంగించడం, తీర్మానాలు చేయడం కాదని... శ్రద్ధగా సంస్థను నిర్మించడం, ప్రజలను సమరశీల ఉద్యమాల్లో సమీకరించడం... అన్నిటికీ మించి బాధలకూ, త్యాగాలకు సిద్ధపడటమని ఆయన విశ్వసించాడు.
 
 మహాత్ముడి సత్యాగ్రహ సమరంతో ప్రభావితుడైనా, శ్వేతజాత్య హంకారంపై ఎన్ని విధాల వీలైతే అన్నివిధాలా పోరాడాలని సంకల్పించుకున్నాడు. అందుకు అనుగుణంగా నల్లజాతీయు లందరినీ కదిలించాడు. మృత్యువు ఎప్పుడూ తనకు వెంట్రుకవాసి దూరంలోనే ఉన్నదని గ్రహించినా ఆయన భయపడలేదు. దక్షిణా ఫ్రికాలో ప్రజాస్వామ్య స్థాపన అనే ఆదర్శం కోసం మరణానికైనా సిద్ధమేనని 1963-64 సమయంలో నిండు న్యాయస్థానంలో ప్రకటించాడు. ఆ విచారణ తర్వాతే ఆయన 27ఏళ్ల సుదీర్ఘకాలం దుర్భరమైన జైలు జీవితం గడిపాడు. చెరసాలను సైతం ఉద్యమ ఖిల్లాగా మార్చాడు. జైల్లో ఉన్నవారికి కనీస సౌకర్యాలకోసం, చదువుకునే స్వేచ్ఛకోసం అలుపెరగని పోరాటం చేశాడు.
 
  అలా చదువుకునే లండన్ యూనివర్సిటీనుంచి న్యాయశాస్త్ర పట్టాను పొందాడు. ‘హింసను విడనాడుతున్నట్టు హామీ ఇస్తే విడుదలచేస్తాం’ అంటూ శ్వేతజాతి ప్రభుత్వం 1985లో షరతు విధించినప్పుడు ‘ఖైదీ కాదు... స్వేచ్ఛాజీవి మాత్రమే సంప్రదింపులు జరపగలడు. ఒప్పందానికి రాగలడు. ఖైదీగా మీతో మాట్లాడే ప్రశ్నేలేదు’ అని బదులిచ్చాడు. ‘స్వేచ్ఛ కోసం పరితపించే నా ప్రజల జన్మహక్కును తాకట్టుపెట్టి జైలునుంచి విడుదలకావడానికి ససేమిరా అంగీకరించను’అని మండేలా స్పష్టం చేశాడు. ఆయననూ, ఆయన నాయకత్వంలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ)ని ఒప్పించడానికి అనేక విధాలుగా ప్రయత్నించి విఫలుడైన అప్పటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎఫ్‌డబ్ల్యు డీక్లార్క్ చివరకు తన శ్వేత జాతి సహచరులకే నచ్చజెప్పాడు. కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించి జాత్యహంకారానికి స్వస్తి చెప్పకపోతే వినాశనం తప్పదని హెచ్చరించాడు. మరో నాలుగేళ్లకు మండేలాను విడుదలచేయక తప్పలేదు.
 
 నెల్సన్ మండేలా ఉద్యమనాయకుడిగా మాత్రమే కాదు...వ్యక్తిగా కూడా శిఖరసమానుడు. ‘సాధారణంగా సమాజంలో తామేమి సాధించామన్నదాన్నిబట్టి ప్రజలు తమను తాము అంచనావేసుకుంటారు. కానీ, జైల్లో అలా కాదు. అక్కడివారు తమలోకి తాము చూసుకోవాలి. నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత, నమ్రత, ఔదార్యంవంటివి తమకు ఏమేరకు ఉన్నాయో అంచనా వేసుకోవాలి. దాన్నిబట్టి తాము ఎలాంటివారమన్న నిర్ణయానికి రావాలి’ అని ఒక సందర్భంలో మండేలా అంటాడు. దేశాధ్యక్షుడిగా పదవీవిరమణ చేశాక 2004లో ప్రారంభించి ఆదిలోనే విరమించుకున్న ‘ప్రెసిడెన్షియల్ యియర్స్’ అనే గ్రంథంలో తనను గురించి తాను దాపరికం లేకుండా రాసుకున్నాడు.
 
 తన పుస్తకం నుంచి నేర్చుకోదగినదేమీ ఉండబోదని చెప్పాడు. ‘యువకుడిగా ఉన్నప్పుడు నేనూ అందరిలానే పొరపాట్లు చేశాను. బలహీనతలను కప్పిపుచ్చుకునేందుకు అహంకారంతో మెలిగాను. పెద్దవాడినయ్యాక నా సహచరులు నాకు లేని గొప్పతనాన్ని అంటగట్టారు’ అని రాయాలంటే ఎంత నిజాయితీ, ఎంత నిబద్ధత కావాలి? ఆయన అనారోగ్యం బారిన పడకపోతే, తానే స్వయంగా రాయాలని పట్టుబట్టకపోతే ఈ గ్రంథం పూర్తయ్యేది. పెనుసంచలనమే కలిగించేది.
 
 స్వపరిపాలన ప్రారంభంలో తాము దేశ ప్రజలకు వాగ్దానం చేసిన ‘నవీన ఆఫ్రికా’ చెదిరిన స్వప్నమయిందని చివరిరోజుల్లో మండేలా ఆవేదన చెందారు. చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ నల్లవారికి అవకాశాలు పెరిగినా ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న పరిశ్రమలు, వాణిజ్యం, సర్వీసు రంగం వంటివన్నీ శ్వేత జాతీయుల అధీనంలోనే ఉన్నాయని వేర్వేరు సందర్భాల్లో ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి జాత్యహంకార వ్యవస్థపై పోరాడిన నాయకులు సైతం అధికారంలోకొచ్చాక అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంపై ఆయన తల్లడిల్లారు. ఇంతటి గొప్ప యోధుణ్ణి, నిలువెత్తు మానవత్వంగా వెలిగిన మనిషిని ‘ఉగ్రవాది’గా ముద్రేయడానికి అమెరికా వెనకాడలేదు.
 
 అజ్ఞాతవాసం గడుపుతున్న మండేలా గురించి దక్షిణాఫ్రికా శ్వేతజాత్యహంకార పాలకులకు ఉప్పందించి అరెస్టు చేయించడమే కాదు... అటుతర్వాత దశాబ్దాలపాటు ఆయనను ఉగ్రవాదుల జాబితాలోనే ఉంచింది. మండేలా దేశాధ్యక్షుడిగా పనిచేసినా ఆ ముద్ర తప్పలేదు. 2008 జూలై 1న మండేలాపై ‘ఉగ్ర ముద్ర’ తొలగించే డిక్రీపై అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్ సంతకం చేశారు. మండేలా, ఆయనలాంటి వేలాదిమంది యోధులు దక్షిణాఫ్రికాను దట్టంగా ఆవరించి ఉన్న జాత్యహంకా రాన్ని పారదోలే పెను తుపానుల్లా విరుచుకు పడబట్టే నల్లజాతీయులకు విముక్తి లభించింది. అణచివేతకూ, వివక్షకూ, భయానికీ తావులేని ప్రదేశంగా... అందరికీ అవకాశాలు కల్పించే సప్తవర్ణ మిశ్రమంగా తమ దేశం ఉండాలని మండేలా ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షను అక్కడ మాత్రమే కాదు... దేశ దేశాల్లోనూ నెరవేర్చడమే ఆ మహా మనీషికి అర్పించే నిజమైన నివాళి అవుతుంది.

Advertisement
Advertisement