'ఉగ్ర' పోరు ఇలాగేనా?! | Sakshi
Sakshi News home page

'ఉగ్ర' పోరు ఇలాగేనా?!

Published Mon, Nov 23 2015 12:23 AM

paris after mali terrorists stike again

పారిస్ దాడులకు కారకులైనవారి ఏరివేతలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఇంకా పూర్తిగా విజయం సాధించకముందే ఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో హోటల్‌పై ఉగ్రవా దులు దాడి జరిపి 170 మంది పౌరులను బందీలుగా పట్టుకోవడంతోపాటు 27 మందిని కాల్చిచంపారు. ఈ ఉదంతంలో చిక్కుకున్నవారు పాశ్చాత్యులు కావడం, అందులో ఫ్రాన్స్ పౌరులు ఎక్కువుండటాన్నిబట్టి ఉగ్రవాదుల గురి ఎవరిపైనో స్పష్టంగానే తెలుస్తున్నది. ఉగ్రవాదులపై రాత్రింబగళ్లు యుద్ధం చేయడంలో తల మునకలైన అమెరికా, దాని కూటమి దేశాలు ఈ దాడిని నిజానికి ఊహించి ఉండాలి. ఎందుకంటే, ఆఫ్రికా ఖండంలో...మరీ ముఖ్యంగా మాలిలో చాన్నాళ్లుగా వాటి కార్యకలాపాలు సాగుతున్నాయి.

ఇరాక్‌లో అమెరికా దురాక్రమణను ఫ్రాన్స్ వ్యతిరేకించి ఉండొచ్చు...కూటమిలోని ఇతర దేశాలతో పోలిస్తే పశ్చిమాసియాపై జరిగిన దాడుల్లో ఆ దేశం పాత్ర తక్కువే ఉండొచ్చు. కానీ లిబియాలోగానీ, మాలి లోగానీ ఫ్రాన్స్ ప్రదర్శించిన చొరవ తక్కువేమీ కాదు. పైగా మాలితో ఫ్రాన్స్ అను బంధం ఈనాటిది కాదు. ఎనిమిది దశాబ్దాలపాటు ఆ దేశం ఫ్రాన్స్ వలసగా ఉంది. అందువల్లే 2012 చివరిలో మాలిలో సైనిక కుట్ర జరిగి అక్కడి ప్రభుత్వాన్ని కూల దోసినప్పుడు...ఆ తర్వాత అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడి వేర్పాటువాదులు విజృంభించినప్పుడు ఫ్రాన్స్ వెనువెంటనే స్పందించి అక్కడికి బలగాలను పంపింది. స్వల్పకాలంలోనే సైనిక తిరుగుబాటును, వేర్పాటువాదులనూ అణచివేసింది. తిరిగి అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పడినా, పరిస్థితులు చక్కబడినట్టు కన బడ్డా మాలిలో ఉద్రిక్తతలు చల్లారలేదు. అక్కడ అస్థిరత్వానికి కారణమైన శక్తులు అప్పటినుంచీ ఫ్రాన్స్‌పై కత్తులు నూరుతున్నాయి. దీన్ని ఏమాత్రం గుర్తుంచుకున్నా ఫ్రాన్స్ ముందు జాగ్రత్తలు తీసుకునేది. ఉగ్రవాదంపై పాశ్చాత్య ప్రభుత్వాలు సాగిస్తున్న యుద్ధం ఎన్ని లోటుపాట్లతో కూడుకుని ఉన్నదో చెప్పడానికి మాలి ఉగ్రవాద దాడే పెద్ద ఉదాహరణ.

 మాలిలోనూ, ఆఫ్రికా ఖండంలోని ఇతర దేశాల్లోనూ ఉగ్రవాద సంస్థలు చాలా నే ఉన్నాయి.  ఆఫ్రికాలో ఈ మాదిరి సంస్థలు దాదాపు 50 వరకూ ఉన్నాయని దశాబ్దం క్రితమే అమెరికా గుర్తించింది. వీటిలో అల్ షబాబ్, బోకో హరాం, అల్ కాయిదా వగైరా ఉన్నాయి. మాలిలోనే దాదాపు డజను సంస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పు డు మాలి దాడికి బాధ్యులమని చెప్పుకున్న మిలిటెంట్ సంస్థ అల్ మౌరాబిటన్‌కు అల్ కాయిదాతో సన్నిహిత సంబంధాలున్నాయంటారు. అల్ కాయిదానుంచి విడివడి ఏర్పడిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సంస్థ ఇరాక్, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో ఆధిపత్యాన్ని సాధించడంతో ఆ రెండు సంస్థల మధ్యా ఆధిపత్య పోరు మొద లైంది. పారిస్ దాడికి కారణమైన ఐఎస్‌కు తామూ దీటుగా ఉన్నట్టు నిరూపించు కోవడానికే అల్ కాయిదా మాలి దాడికి పథక రచన చేసి ఉండొచ్చునన్నది నిపుణుల అంచనా.
ఆఫ్రికా ఖండంలో ఉగ్రవాదుల కదలికలను అరికట్టడం, అంతిమంగా వారిని మట్టుబెట్టడం లక్ష్యంగా అమెరికా 2002 నుంచి దాడులు చేస్తున్నా ఆ గ్రూ పుల బలం పెరుగుతున్న వైనాన్ని ఇది సూచిస్తోంది. నిరుడు ఆ ఖండంలో అమెరికా సొంతంగా 674 సైనిక దాడులు నిర్వహించింది. అంటే సగటును రోజుకు రెండు దాడులు జరిగాయి. లిబియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, మాలి దేశాల్లో మిత్రులతో సాగిస్తున్న దాడులు వీటికి అదనం.  ఇన్ని చేస్తున్నా దేశ రాజధాని నగరంలో అందరి కన్నూ కప్పి ఉగ్రవాదులు హోటల్‌పై దాడి చేయగలగడం మాటలు కాదు.

  తమ ప్రాబల్యం ఉన్నచోట్ల పాశ్చాత్య దేశాలకు నష్టం చేకూర్చడంతోపాటు... వారి దేశాల్లోకి సైతం చొరబడి అక్కడి సమాజాలను విచ్ఛిన్నం చేయడంలో ఉగ్రవాదులు విజయవంతమవుతున్నారు. పారిస్ దాడులకు కారణమైన ఉగ్రవాదు లంతా వాస్తవానికి బయటినుంచి వచ్చినవారు కాదు. వారంతా ఫ్రాన్స్ పౌరులు. అక్కడే పుట్టి పెరిగినవారు. అక్కడి సమాజాల్లో ఏదో మేర వివక్ష ఎదుర్కొంటు న్నవారిని ఐఎస్ ఉగ్రవాదులు ఆకర్షించి, వారికి తమ సిద్ధాంతాలను బోధించి దాడు లకు పురిగొల్పగలుగుతున్నారు. ఇలాంటి దాడుల ద్వారా ఐఎస్ ఉగ్రవాదులు రెండు లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతున్నారు. తాము ఎక్కడున్నా, తమపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పాశ్చాత్య ప్రపంచానికి ఏదో ఒక మేర నష్టం కలిగించగల మని నిరూపిస్తున్నారు. అదే సమయంలో అక్కడుంటున్న ముస్లింలకూ, ఇతరు లకూ మధ్య పరస్పర అవిశ్వాసాన్ని పెంచి, వారి మధ్య చిచ్చు రగల్చగలుగుతు న్నారు.

పాశ్చాత్య దేశాల్లో ఉండే ముస్లింలు చాలా త్వరలోనే ఏదో ఒకటి తేల్చు కోవాల్సిన పరిస్థితుల్లో పడతారంటూ ఏడెనిమిది నెలలక్రితమే ఐఎస్ సంస్థ ప్రక టించింది. చార్లీ హెబ్డో పత్రికపై దాడి, మొన్న జరిగిన పారిస్ దాడులు ఈ వ్యూహం లో భాగమే. పాశ్చాత్య దేశాల పౌరుల్లో  ముస్లింలపై విద్వేష భావనలు రగిలిస్తే వారిలో సహజంగా అభద్రతా భావన ఏర్పడుతుందని, అప్పుడు అక్కడి ముస్లిం లంతా తమ మద్దతుదార్లుగా మారకతప్పదన్న అభిప్రాయంతో ఉగ్రవాద సంస్థలు న్నాయి. ఇలా పరస్పరం కలహించుకుంటే తమ పని సులభమవుతుందని అవి బావిస్తున్నాయి. ఇరాక్‌లో అల్ కాయిదాను ఈ వ్యూహంతోనే ఐఎస్ దెబ్బతీయ గలిగింది. ఇవన్నీ తెలిసినా పాశ్చాత్య దేశాలు తమ ప్రవర్తన ద్వారా ఉగ్రవాదుల అభీష్టాన్ని నెరవేరుస్తున్నాయి. సిరియానుంచి శరణార్థులుగా వచ్చినవారే పారిస్ దాడుల్లో పాల్గొన్నారన్న ప్రచారం ముమ్మరంగా సాగడం ఇందుకు ఉదాహరణ. ఇందులో నిజమెంతో, కానిదెంతో తెలుసుకోకుండానే శరణార్థుల నియంత్రణకు అన్ని దేశాలూ ప్రయత్నాలు ప్రారంభించాయి. అనవసర భయాందోళనలకు పారదోలి, తమ సమాజాలు సమైక్యంగా ఉండేలా చూడకపోతే... వివక్షను అంతం చేయకపోతే ఉగ్రవాదంపై పోరులో విజయం సాధించలేమన్న సంగతిని అటు అమెరికా, ఇటు యూరప్ దేశాలూ గ్రహించాలి. ఇంటా, బయటా ఉగ్రవాదుల అభీష్టాన్ని నెరవేర్చేలా ఉన్న తమ చర్యలను సమీక్షించుకుని సరిదిద్దుకోవాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement