27 Nov, 2018 01:09 IST|Sakshi

దేశ చరిత్రలో నవంబర్‌ 26 చాలా ముఖ్యమైన తేదీ. అరవై ఎనిమిది సంవత్సరాల కిందట స్వతంత్ర భారతానికి రాజ్యాంగం రూపుదిద్దుకొని రాజ్యాంగసభ ఆమోదం పొందిన రోజు. సంవిధాన్‌ దివస్‌. పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయ్‌ నగరంపైన దాడి చేసి 166 మందిని హత్య చేసి, సుమారు 300 మందిని గాయపరచిన దుర్దినం కూడా ఇదే కావడం విశేషం. లష్కరే తొయ్యబా, జమాత్‌–ఉద్‌–దవా అధినేత హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్‌ నేతృత్వంలో పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు సముద్రమార్గంలో ముంబయ్‌ తీరానికి చేరుకొని దేశ ఆర్థిక రాజధానిపైన పైశాచికంగా దాడి చేసి అమాయకులను చంపివేసిన ఘటన జరిగి సరిగ్గా పదేళ్ళు. దేశ పరిపాలనకు దిక్సూచిగా సంవిధానం రచించుకొని, దాని ప్రాతిపదికగా దేశ సమైక్యతనూ, సమగ్రతనూ పరిరక్షించుకోవాలని సంకల్పం చెప్పుకున్న రోజే పాకిస్తాన్‌ ముష్కరులు దేశ ఆర్థిక  రాజధానిపైన ఉగ్రపంజా విసరడం, విధ్వంసం సృష్టించడం దేశ ప్రజలను నిర్ఘాంతపరిచింది. ముంబయ్‌ దాడి నుంచి మనం ఎటువంటి గుణపాఠాలు నేర్చుకున్నామో సమీక్షించుకోవలసిన సందర్భం ఇది.

అదే విధంగా రాజ్యాంగపాలన ఎంత సమర్థంగా సాగుతున్నదో పరిశీలించుకొని రాజ్యాంగస్పూర్తితో పరిపాలన నిరాఘాటంగా, జనామోదంగా సాగే విధంగా  భవిష్యత్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించవలసిన సమయం కూడా ఇదే. నిజానికి మన దేశ భద్రతకూ, సమగ్రతకూ అవినాభావ సంబంధం ఉన్నది. సమగ్రత సమైక్యతపైన ఆధారపడి ఉంటుంది. ముంబయ్‌పైన ఉగ్రదాడి జరిగిన తర్వాత మరోదాడి అంత స్థాయిలో జరగలేదు. కానీ పాకిస్తాన్‌ భూభాగంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు  కశ్మీర్‌లో రక్తపాతం సృష్టిస్తూనే ఉన్నారు. భద్రతావ్యవస్థను బలోపేతం చేసుకోవడం పరమావధి. ఏడున్నర వేల కిలోమీటర్ల పొడవున్న కోస్తాతీరంలో  భద్రత పెంపొందించడానికి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చిన దాఖలా లేదు. కోస్తాను అనుకొని ఉన్న ఏడు రాష్ట్రాల, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకీ, దేశ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థకీ, కోస్టల్‌గార్డ్‌కీ,  నావికాదళానికీ మధ్య సమన్వయం ఇప్పటికీ లేదని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ముంబయ్‌పైన దాడి చేయించిన సూత్రధారులకు పాకిస్తాన్‌ ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నదనేది వాస్తవం. హఫీజ్‌ను ఉగ్రవాదిగా పరిగణించాలని ఇండియాతోపాటు అమెరికా, తదితర దేశాలు తీర్మానిస్తే చైనా అందుకు అడ్డుతగిలి పాకిస్తాన్‌ను గుడ్డిగా సమర్థిస్తున్నది.

ముంబయ్‌పైన దాడి చేయడానికి పథకం రచించినవారిని పట్టిచ్చినవారికి భారీ బహుమతి ఇస్తానంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంకులను నట్టేట ముంచిన ఆర్థిక నేరస్తుల అరాచకాలను లండన్‌ కోర్టులో నిరూపించడానికి ప్రయత్నిస్తున్నట్టే పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న విషయాన్ని చైనాకు వివరించడానికీ, అంతర్జాతీయ వేదికలపైన చర్చనీయాంశం చేయడానికి విశేషమైన కృషి జరగవలసిన అవసరం ఉన్నది. కశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణ అత్యవసరం. దౌత్య యంత్రాంగాన్ని పటిష్టం చేయవలసిన అగత్యం ఉంది. దేశంలో పెరుగుతున్న ఆరాచక వాతావరణం ఆందోళన కలిగిస్తున్నది. రాజ్యాంగస్పూర్తిని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్య ప్రియులందరూ ప్రయత్నించాలి. రాజ్యాంగస్పూర్తికి విఘాతం కలిగించే ధోరణులను అరికట్టడానికి సర్వశక్తులూ వినియోగించాలి.

మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో సమాజంలో చీలికలు తెచ్చే దుర్మార్గపుటాలోచనలను ప్రతిఘటించాలి. ‘ధర్మసభ’ పేరుతో సోమవారంనాడు అయోధ్యలో సుమారు 50 వేల మంది గుమికూడటం, అక్కడ ఆయుధబలగాలను మోహరించడం, 1992లో బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత జరిగినట్టు హింసాకాండ జరుగుతుందనే భయంతో ముస్లిం కుటుంబాలు కొన్ని అయోధ్య ప్రాంతం నుంచి పారిపోయి ఎక్కడో తలదాచుకోవడం ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు. మందిర వివాదంలో న్యాయవ్యవస్థపైన వ్యాఖ్యలు చేయడం కూడా సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ఎవరు పూనుకున్నప్పటికీ అది క్షమార్హం  కాని నేరమే. ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలూ బీటలు వారాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను ఉపయోగించుకొని ఉన్నత పదవులు పొందినవారే అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము స్వయంగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్నీ, దేశాన్నీ రక్షిస్తామంటూ బయలు దేరిన బూటకపు ప్రజాస్వామ్యవాదుల నిజస్వరూపం బయటపెట్టడమూ అవసరమే.

ఇతర పార్టీల టిక్కెట్లపైన ఎన్నికలలో గెలిచినవారిని కొనుగోలు చేసి పార్టీ ఫిరాయింపుల చట్టాన్న కుళ్ళపొడిచినవారిని తప్పుపట్టని, శిక్షించని వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకం కావడంలో ఆశ్చర్యం ఏమున్నది? ఎన్నికల సమయంలో మర్యాదలు మట్టికరుస్తున్నాయి. రాజ్యాంగ విలువలను పునరుద్ధరించేందుకు ప్రజలు కంకణబద్ధులు కావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లితే విచ్ఛిన్నకరశక్తులు వీరంగం వేస్తాయి. అధికారంలో ఉన్నవారే రాజ్యాంగస్పూర్తిని తు.చ. తప్పకుండా పాటించాలి. రాజ్యాంగ సంస్థలనూ, ప్రక్రియలనూ గౌరవించడం ద్వారా శాంతిసుస్థిరతలకు దోహదం చేయాలి. అధికారాలు మాత్రమే కాకుండా బాధ్యతలు గుర్తెరిగి ప్రజలందరూ వ్యవహరిస్తేనే 130 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం ప్రశాంతంగా ఉంటుంది.  అనేక మతాలూ,  కులాలూ, సంస్కృతులూ, భాషలూ, ప్రాంతాలూ కలిగి భిన్నత్వంలో ఏకత్వం సిద్ధాంతంపైన మనుగడ సాగిస్తున్న దేశాన్ని రాజ్యాంగం మాత్రమే సమైక్యంగా ఉంచగలదు. రాజ్యాంగమే రక్ష. రాజ్యాంగాన్ని పవిత్రగ్రంథంగా భావించి శిరసావహించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజిత్‌ గొగోయ్‌ చెప్పినట్టు రాజ్యాంగం అర్భకులకు రక్షణ కల్పించే కవచం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌నూ, ఆయన సామాజిక–రాజకీయ దృక్పథాన్నీ అర్థం చేసుకొని ప్రచారం చేస్తామనీ, రాజ్యాంగస్పృహను పెంపొందిస్తామని దేశ ప్రజలు ప్రతిజ్ఞ చేయవలసిన సందర్భం ఇది.

మరిన్ని వార్తలు