ఈ పాపం ఎవరిది?

29 May, 2019 00:39 IST|Sakshi
డాక్టర్‌ పాయల్‌ తాడ్వీ

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న కుల వివక్ష, వేధింపుల పర్యవసానంగా దళిత యువ మేధావి రోహిత్‌ వేముల ఆత్మార్పణ చేసుకుని మూడేళ్లయింది. ఆ కేసు అతీ గతీ ఈనాటికీ తేలలేదు. ఆ విషాద ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా ముంబైలోని ఒక వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న విద్యార్థిని డాక్టర్‌ పాయల్‌ తాడ్వీ గత బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. విజ్ఞాన కేంద్రా లుగా విలసిల్లుతూ ఉన్నతస్థాయి నిపుణులను అందించాల్సిన మన విద్యా సంస్థలు కుల, మతాల జాడ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయని తరచుగా మేధావులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ విషయంలో తగినంత ప్రక్షాళన జరుగుతున్న జాడలు లేవు. ఇప్పుడు పాయల్‌ ఉదంతం దాన్నే ధ్రువపరుస్తోంది. అన్ని వృత్తులలోనూ వైద్య వృత్తి అత్యున్నతమైనదని చెబుతారు.

సమాజంలో వైద్యులను అందరూ దైవ స్వరూపంగా భావిస్తారు. అలాంటి రంగంలో... అందునా విద్యార్థినుల్లో కుల, మత దురహంకారాలు ఇంతగా ఉంటాయని, అవి ఎదుటివారి ప్రాణాలు తీసేంత వికృత స్థాయికి చేరతాయని ఊహించడం కూడా సాధ్యం కాదు. డాక్టర్‌ పాయల్‌ నేపథ్యం గురించి విన్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. పుట్టుకను బట్టి ఆమె భిల్లు తెగకు చెందిన ఆదివాసీ యువతి. ఆ రంగంలో అక్షరాస్యత శాతమే తక్కువ. పైగా ఉన్నత విద్య వరకూ వచ్చేవారి శాతం అత్యల్పం. ఆ తెగలో వైద్యరంగంలో పీజీ కోర్సుకు చేరుకున్న తొలి యువతి ఆమేనని సన్నిహితులు చెబుతున్నారు. చదువులో ఎంతో రాణిస్తూ, ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందుతూ, తన రంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని తపనపడిన ఒక ఆదివాసీ యువతి కలలు చివరికిలా ఛిద్రంకావడం విషాదకరం.

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు జరిగిన ఎన్‌డీఏ పక్షాల పార్లమెంటరీ బోర్డు సమా వేశంలో మాట్లాడుతూ ‘సబ్‌ కా సాత్, సబ్‌కా విశ్వాస్‌(అందరితో కలిసి, అందరి అభివృద్ధి కోసం) అని పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు సమాజంలో కొరవడుతున్నది అదే. బడుగు కులాలవారు మంచి బట్టలు కట్టుకున్నా, వారు సౌకర్యవంతంగా జీవిస్తున్నా తట్టుకోలేని స్థితి ఇంకా కొనసాగు తోంది. పల్లెల్లో ఈ జాడ్యం బాహాటంగా కనిపిస్తుంటే నగరాల్లో ఇది ప్రచ్ఛన్నంగా చలామణిలో ఉంది. పాయల్‌తోపాటు రూంలో ఉంటున్న మరో ముగ్గురు యువతులు ఆధిపత్య కులాలకు చెందినవారని, వారు నిత్యం ఆమెను వేధించేవారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విష యమై కళాశాల నిర్వాహకులకు నిరుడు డిసెంబర్‌లోనూ, ఈ నెల మొదట్లోనూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని పాయల్‌ తల్లి చెబుతున్నారు.

ఆదివాసీల్లో ఇతర తెగలతో పోలిస్తే భిల్లుల్లో ఇస్లాం మత విశ్వాసాలు అనుసరించేవారు అధికం. పాయల్‌ ఆదివాసీ కావడం, అందునా ముస్లిం కావడం ఆమె ఉసురు తీశాయని తల్లి చెబుతున్న మాట. ఎనిమిదేళ్లక్రితం ఢిల్లీలోని ఉన్నతశ్రేణి వైద్య సంస్థ ఎయిమ్స్‌లో అమలవుతున్న కుల వివక్షను యూజీసీ మాజీ చైర్మన్, విద్యావేత్త సుఖదేవ్‌ తొరాట్‌ నేతృత్వంలోని కమిటీ దర్యాప్తు చేసి అక్కడ దళిత, ఆదివాసీ విద్యార్థులకు ఇతర వర్గాల విద్యా ర్థులతో పోలిస్తే అధ్యాపకుల నుంచి పెద్దగా సహకారం అందదని నిర్ధారించారు. కులం తెలియ నంతవరకూ ఆత్మీయంగా ఉన్నవారే, తెలిసిన మరుక్షణం నుంచి వివక్ష ప్రదర్శిస్తారని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 84 శాతంమంది ఆ కమిటీకి చెప్పారు. పరీక్ష పత్రాలు దిద్దే అధ్యాపకులు ప్రత్య క్షంగానో, పరోక్షంగానో విద్యార్థుల కుల నేపథ్యాన్ని తెలుసుకుని ఉద్దేశపూర్వకంగా మార్కులు తగ్గి స్తారని కమిటీ తేల్చింది. భోజనం చేసేచోట, ఆటలాడుకునేచోట తమను అత్యంత హీనంగా చూస్తా రని ఆ వర్గాల విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

దళిత, ఆదివాసీ వర్గాల విద్యార్థులకు దినదిన గండంగా మారిన ఈ ధోరణులను అరికట్ట డానికి యూజీసీ ఎన్నో చర్యలు సూచించింది. ఈ విషయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు విద్యా సంస్థలు తమ వెబ్‌సైట్లలో ప్రత్యేక ఏర్పాటు చేయడం దగ్గర నుంచి రిజిస్ట్రార్‌ లేదా ప్రిన్సిపాల్‌ కార్యాలయాల్లో ప్రత్యేక రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఫిర్యాదులు వచ్చినప్పుడు రెండు నెలల వ్యవధిలో వాటిపై తగిన చర్యలు తీసుకోవాలన్న నిబంధన పెట్టింది. అయితే విచారకరమైన విషయమేమంటే...దేశంలోని అత్యధిక విశ్వవిద్యాలయాలు యూజీసీ ఇచ్చిన ఈ మార్గదర్శకాలను సరిగా పట్టించుకోవడం లేదు. ఆ సంగతిని యూజీసీయే అంగీకరించింది. తాము మార్గదర్శకాలు పంపుతూ 800 విశ్వవిద్యాలయాలకు లేఖలు రాస్తే కేవలం 155 సంస్థలు మాత్రమే ప్రతిస్పందిం చాయని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో పాయల్‌ వంటివారు ప్రాణాలు తీసుకోవడమే పరిష్కార మనుకోవడంలో వింతేముంది? తమకు నిత్యమూ వేధింపులు తప్పనప్పుడు, ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోనప్పుడు వారికి అంతకన్నా గత్యంతరం లేదు. 

ఆత్మహత్యలన్నీ వాస్తవానికి హత్యలేనంటారు. విద్యాసంస్థల వరకూ ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. సమాజం ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడాల్సిన ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు కుల, మతాల రొంపిలో కూరుకుపోతుండటం... బాధితుల గోడు అరణ్యరోదన కావడం ఆందోళన కలిగించే అంశం. ‘నా పుట్టుకే ఒక ప్రాణాంతక దుర్ఘటన’ అని ఎంతో ఆర్తితో, ఆవేదనతో రోహిత్‌ వేముల తన చిట్ట చివరి లేఖలో రాశాడు. పాయల్‌ సైతం అలా అనుకోకతప్పని దుస్థితి ఉన్నత విద్యాసంస్థల్లో ఇంకా రాజ్యమేలుతున్నదని తాజా ఉదంతం చెబుతోంది. ఆమె ఆత్మహత్య చేసు కున్న వారం రోజులకు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయగలిగారు. అది కూడా దళిత సంఘాల ఆందోళన తర్వాత. ఈలోగా ఇద్దరు నిందితులు ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. ‘సబ్‌ కా సాత్, సబ్‌ కా విశ్వాస్‌’ నెరవేరాలంటే, పాయల్‌ మాదిరి మరెవరూ బలికాకూడదనుకుంటే నిందితులకు వత్తాసుపలికే ధోరణిని ప్రభుత్వాలు విడనాడాలి. చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి. సకల జాడ్యాల నుంచీ విద్యాసంస్థల్ని కాపాడుకోవాలి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు