కొత్త వివాదాలకు బీజం | Sakshi
Sakshi News home page

కొత్త వివాదాలకు బీజం

Published Wed, Jul 13 2016 1:55 AM

Seed to controversy new south china regions

గత కొన్నేళ్లుగా వీడని చిక్కుముడిలా తయారైన దక్షిణ చైనా సముద్ర ప్రాంత వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఆ సముద్ర జలాల్లో ఉన్న చిన్న దీవులు, పగడాల దిబ్బలు, ఇసుక మేటలు తనవేనని, వాటిపై తనకు ‘చారిత్రక హక్కులు’ ఉన్నాయని చైనా చేస్తున్న వాదన చెల్లుబాటు కాదని హేగ్‌లోని అంతర్జాతీయ సాగర జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ మంగళవారం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఈ వివాదంలో మూడేళ్లక్రితం చైనాపై  ఫిలిప్పీన్స్ ఇచ్చిన ఫిర్యాదును విచారించి ఈ తీర్పును వెలువరించింది. అయితే విచారణను గుర్తించడానికి లేదా ఇందులో తన వాదనేమిటో వినిపించడానికి ఆదిలోనే చైనా తిరస్కరించింది.

ఆ ప్రాంతంపై తన కున్న చారిత్రక హక్కులు విచారణలకూ, వాదనలకూ అతీతమని చెప్పింది. అలా ప్రకటించడంతోపాటు మునుపటితో పోలిస్తే ఆ ప్రాంతంలో తన ఉనికిని బాగా పెంచింది. ముఖ్యంగా అక్కడున్న స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణం చేపట్టింది. మరికొన్నిచోట్ల ఉన్నవాటిని విస్తరించింది. నావికాదళం కార్య కలాపాల జోరు పెంచింది. అందుకు గల ప్రాతిపదికను గురించి చైనా చేస్తున్న వాదన ఇప్పుడు ఫిలిప్పీన్స్, చైనాల వివాదానికి మూలం.
 
  1947 డిసెంబర్‌లో... అంటే చైనాలో విప్లవం విజయవంతం కావడానికి ముందు అప్పటి ప్రభుత్వం దక్షిణ చైనా సముద్రానికి చెందిన భౌగోళిక చిత్రపటంలో ఇంగ్లిష్ అక్షరం ‘యు’ ఆకారంలో పదకొండు గీతలు గీసింది.‘ఎలెవెన్ డాష్ లైన్’గా పిలిచే ఆ పరిధిలోపల ఏ రకమైన దీవులున్నా తమవేనని తేల్చిచెప్పింది. అందుకు కారణం కూడా చెప్పింది. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో అప్పటి రాజవంశీకులు ఆ దీవులకు రాకపోకలు సాగించినట్టు ఆధారాలున్నాయని వివరించింది. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడ్డాక పాత పరిధులను గుర్తించి కొనసాగించినా... అప్పటి ప్రధాని చౌ ఎన్‌లై ఉత్తర వియత్నాంలోని తమ కమ్యూనిస్టు సోదరుల అభీష్టాన్ని మన్నించి ఇందులో రెండు గీతల్ని తగ్గించారు. ఫలితంగా టోన్‌కిన్ జలసంధి వియత్నాంకు దక్కింది. అప్పటినుంచీ అది ‘నైన్ డాష్ లైన్’గా ఉన్నా తూర్పు చైనా సముద్ర ప్రాంతంవైపు విస్తరిస్తూ, జపాన్ గుండెల్లో గుబులు రేపుతూ మరో గీత పడింది.
 
 అది వేరే వివాదం. ఇలా యాజమాన్య హక్కుల్ని దఖలుపరుచుకోవడం తప్ప చైనా ఆ ప్రాంత దీవులను పెద్దగా పట్టించుకోలేదు. రక్షణపరంగా, ఇంధన నిక్షేపాల పరంగా వాటి ప్రాధాన్యత  తెలియకపోవడమే ఇందుకు కారణం. 70వ దశకంలో పరిస్థితి మారింది. పారాసెల్ దీవులనుంచి దక్షిణ వియత్నాం నావికాదళాన్ని చైనా వెళ్లగొట్టింది. స్ప్రాట్లీ దీవుల్లో దాదాపు 200 ప్రాంతాలను అనంతరకాలంలో స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆ దీవులు తమవంటే తమవని ఎవరికి వారు వాదిస్తున్నారు. ఈ వివాదంలో తైవాన్, వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, ఇండొనేసియా దేశాలు తమ తమ భూభాగాల వైపున్న దీవులు తమవేనంటున్నాయి.
 
 ఫిలిప్పీన్స్ చేస్తున్న వాదనలో హేతుబద్ధత లేకపోలేదు. ఈ గీతలు కొన్నిచోట్ల చైనా ప్రధాన భూభాగానికి 2,000 కిలోమీటర్ల దూరానికి కూడా విస్తరించి ఉన్నాయని, ఆధునిక కాలంలో ఇది ఏ రకంగా న్యాయమని ఆ దేశం ప్రశ్నిస్తోంది. ఐక్యరాజ్యసమితి సముద్ర జలాల ఒప్పందం ప్రకారం ఒక దేశ ప్రధాన భూభాగం నుంచి నిర్దిష్టమైన దూరాన్ని లెక్కేసి ఆ మేరకే ఆ దేశ సరిహద్దు జలాలను నిర్ణయిస్తారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తమ సేనలు జపాన్ సైన్యాన్ని ఓడించి స్వాధీనం చేసుకున్న దీవులు గనుక చట్టపరంగా కూడా తమకు తిరుగులేని హక్కులున్నాయన్నది చైనా వాదన.
 
 అలాగని అది ‘నైన్ డాష్ లైన్’ గురించి ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. దాన్ని వివరించి చెబితే తన వాదన చెల్లకుండా పోతుందన్న భయం దీని వెనక ఉండొచ్చు. అందుకు బదులు ఫిలిప్పీన్స్ ఫిర్యాదు చేసింది మొదలుకొని ఈ కేసులో సాగుతున్న పరిణామాలపై అది గుర్రుగా ఉంది. నియమావళి ప్రకారం అంతర్జాతీయ సాగర జలాల న్యాయ ట్రిబ్యునల్ (ఐటీఎల్‌ఓఎస్) అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే ఒక సమస్యపై ఏర్పడే ట్రిబ్యునల్ సభ్యుల పేర్లు సూచించాలి. ఫిలిప్పీన్స్ ఫిర్యాదు చేసే సమయానికి ఆ పదవిలో ఉన్న జపాన్‌కు చెందిన న్యాయమూర్తి సభ్యులను ప్రకటించారు. తూర్పు చైనా సముద్రంలో తమకూ, జపాన్‌కూ మధ్య విభేదాలున్న నేపథ్యంలో ఆయన ఆ పని చేయకూడదని చైనా వాదిస్తోంది.
 
 ఇంతకూ వివాద పరిష్కార ట్రిబ్యునల్ అంతర్జాతీయ ఒప్పందంలో ఏముందో, ఆ నియమావళి అంతరార్ధమేదో చెప్పడం...దాని ప్రకారం ఎవరి వాదన తప్పో తేల్చడం తప్ప ఒక ప్రాంత దీవులపై సార్వభౌమాధిపత్యం ఎవరిదన్న అంశం జోలికి పోలేదు. సముద్ర జలాల సరిహద్దు వివాదాలు దాని పరిధిలోకి రావు. అందువల్లే ఇతర అంశాలపై ట్రిబ్యునల్ దృష్టి కేంద్రీకరించింది. దీవుల్లో చైనా కార్యకలాపాలవల్ల ఫిలిప్పీన్స్ హక్కులకు భంగం కలగడంతోపాటు ఆ ప్రాంత పర్యావరణానికి విఘాతం కలుగుతున్నదని తేల్చిచెప్పింది. ముఖ్యంగా సముద్ర జీవులకు ఆ కార్యకలాపాలు హానికరంగా పరిణమించాయని అభిప్రాయపడింది.
 
 ఈ తీర్పు తమకున్న హక్కులపై ఎలాంటి ప్రభావమూ చూపలేదని చైనా స్పందించడాన్నిబట్టి ఈ ప్రాంతంలో రాగలకాలంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందో సులభంగానే అంచనా వేయొచ్చు. ప్రస్తుత తీర్పు వివాదానికి పరిష్కారం కాకపోగా కొత్త ఘర్షణలకు తెరలేపడం ఖాయం. ఆ ప్రాంతంలోని తమ సహచర దేశాలకు అండగా ఉంటామని ‘అన్నివిధాలా’ చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో భారత్‌కంటూ సొంత ప్రయోజనాలు లేవు. అయితే ఆ వివాదంలో మన వైఖరి హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును నిలువరించడానికి మనకు తోడ్పడుతుంద న్నది నిపుణుల అంచనా. ఏదేమైనా హేగ్ ట్రిబ్యునల్ తీర్పు అడ్డుపెట్టుకుని చైనాను కట్టడి చేయాలన్న అమెరికా వ్యూహం...పర్యవసానంగా ఏర్పడే ఉద్రిక్తతలు భవిష్యత్తులో ఆసియా తీరుతెన్నులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

Advertisement
Advertisement