శోభా డే రాయని డైరీ | Sakshi
Sakshi News home page

శోభా డే రాయని డైరీ

Published Sun, Oct 18 2015 3:46 AM

శోభా డే రాయని డైరీ

నైదర్ ఎ హాక్ నార్ ఎ డోవ్! యుద్ధమూ కాదు, శాంతీ కాదు. మరేమిటి? కుర్షిద్ మహ్మద్ కసూరి ఈ పుస్తకాన్ని ఒక అణ్వాయుధంగా గానీ, శాంతి కపోతంగా కానీ కనిపించనివ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్లున్నారు. అలాంటప్పుడు వాస్తవాలను ఏ డేగో వచ్చి తన్నుకుపోదా? అబద్ధాలు ఏ పావురం ముక్కు ద్వారానో బట్వాడా కాకుండా ఉంటాయా? పేజీలు తిప్పుతున్నాను.
 
చేతి వేళ్లకు అంటిన జాతీయవాద మసి.. పుస్తకంలోని భారత్-పాక్ సంబంధాల వెలుగు నీడల్ని ఏ మూలనైనా అలికిపడేస్తుందేమోనన్న స్పృహతో అతి జాగ్రత్తగా చదవవలసి వస్తోంది. ఆవిష్కరణ సభకు వెళ్లిన సుధీంద్ర కులకర్ణి ముఖానికి ముంబై దేశభక్తి వాదులు పులిమిన సిరా.. తలసరి రుణంలా దేశప్రజలందరి చేతులకూ తలా ఇంత తగులుకుంది మరి. బహుశా ఈ మసి.. పుస్తకంలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ, నట్వర్‌సింగ్, యశ్వంత్ సిన్హా, మన్మోహన్‌సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయ్‌లకు కూడా అంటుకుని ఉండొచ్చు!
 
పాక్ చరిత్రలో పరదేశీ హాక్ ఎవరో, దేశం లోపలి డోవ్ ఎవరో చెప్పకుండా కుర్షిద్ మహ్మద్ తన పుస్తకంలో పాటించిన విదేశాంగ మర్యాదను.. నా దేశం కనీసం పుస్తకమైనా తెరవకుండానే దేశవాళీ నేషనలిజంతో మంట కలిపింది. ఎటు వెళ్తున్నాం? గోద్రాలు, దాద్రీల క్రానలాజికల్ ఆర్డర్‌లో మనమొక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంపదగా నిర్మించుకుంటున్నామా?
 ఇష్టమైన సంగీతాన్ని వినడానికి లేదు. ఇష్టం లేని సినిమాలను చూడకుండా ఉండేందుకు లేదు. ఇష్టమైన ఆహారాన్ని గిన్నెల్లో ఉడికించుకునేందుకు లేదు! పాట వినడానికి, పుస్తకం చదవడానికి కూడా ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టించుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. బెడ్‌రూమ్‌లోంచి గులామ్ అలీ పాడుతున్నాడు. హాల్లో కుర్షిద్ మహ్మద్ పుస్తకానికి ఆయన సింక్ అవడం లేదు.
 
ఇంటి పని చేసుకుంటూ హిందూస్థానీ సంప్రదాయ సంగీతంతో శ్రావ్యంగా బ్లెండ్ అయి ఉండే ఉస్తాద్ గులామ్ అలీ ఘజల్స్ వినడమంత సౌఖ్యం కాదు కదా.. శత్రుదేశాల దౌత్యస్నేహాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం! కానీ అర్థం చేసుకోవాలి. భారత్ ఏమిటో తెలుసుకోవాలంటే, పాక్ ఏమిటో తెలుసుకుని ఉండాలి. హాక్‌లు ఎవరో తెలుసుకోవాలంటే మోదీ, దేవేంద్ర ఫడ్నవిస్‌ల ప్రసంగాలను వినాలి. డోవ్‌లు ఎవరో తెలుసుకోవాలంటే గులామ్ అలీ ఘజల్స్‌ను ఆలకించాలి. నవంబర్ 8న ఢిల్లీలో అలీ కచేరీ ఉంది. ముంబైలో రద్దయిన కచేరీ అది. మోదీ వస్తే బాగుంటుంది. కానీ, అదేరోజు అంతకన్నా మనోరంజకంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వినిపించే విజయగీతం కోసం ఆయన ఎదురుచూస్తూ కూర్చుంటారనుకుంటా... సెవన్ రేస్ కోర్స్ రోడ్డులోని తన కార్యాలయంలో.
మాధవ్ శింగరాజు

Advertisement
Advertisement